ఇంక్రిమెంట్ల మాయాజాలం!
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:46 AM
పంచాయతీరాజ్ విభాగంలో వసూళ్ల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. ఉద్యోగులకు సర్వీస్ మేటర్‌లకు సంబంధించిన ఫైళ్లు కదలాలంటే ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి, నగదు చెల్లించుకోవాలని చెప్పి మరీ వసూళ్లకు పాల్పడటం రివాజుగా మారింది. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్, విజయవాడ నుంచి ప్రత్యేకంగా డిప్యుటేషన్‌పై తెచ్చుకున్న జూనియర్ అసిస్టెంట్ తమదైన శైలిలో వ్యవహారాలు నడుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఏదైనా పనిపై ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లాలంటేనే జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
- డీపీవో కార్యాలయంలో అవినీతి జలగలు!
- ఇంక్రిమెంట్ల మంజూరుకు ఉద్యోగుల నుంచి నగదు వసూలు!
- తెరవెనుక చక్రం తిప్పుతిప్పుతున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పంచాయతీ ఉద్యోగులు
- ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వేడుకోలు
పంచాయతీరాజ్ విభాగంలో వసూళ్ల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. ఉద్యోగులకు సర్వీస్ మేటర్‌లకు సంబంధించిన ఫైళ్లు కదలాలంటే ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి, నగదు చెల్లించుకోవాలని చెప్పి మరీ వసూళ్లకు పాల్పడటం రివాజుగా మారింది. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్, విజయవాడ నుంచి ప్రత్యేకంగా డిప్యుటేషన్‌పై తెచ్చుకున్న జూనియర్ అసిస్టెంట్ తమదైన శైలిలో వ్యవహారాలు నడుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఏదైనా పనిపై ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లాలంటేనే జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం :
పంచాయతీరాజ్ విభాగంలో అన్ని కేడర్‌లలో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులు వచ్చినా, రాకున్నా వారి సీనియారిటీని బట్టి ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఉద్యోగులు వారు విధుల్లో చేరిన నాటి నుంచి ఆరు, పన్నెండు, పద్దెనిమిది, 24 సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఇంక్రిమెంట్లు మంజూరవుతాయి. ఈ ఇంక్రిమెంట్ నెలకు రెండు నుంచి మూడు వేల రూపాయలుగా ఉంటుంది. గతంలో ఉద్యోగులకు ఈ తరహా ఇంక్రిమెంట్ల మంజూరుకు సంబంధించిన ఫైళ్లకు ఎలాంటి నగదు తీసుకోకుండానే అధికారులు ఆమోదం తెలిపేవారు. అయితే కొంతకాలంగా ఈ పద్ధతిని మార్చారు. మీకు ఇంక్రిమెంట్‌లు మంజూరు కావాలంటే కార్యాలయానికి వచ్చి తమను ప్రసన్నం చేసుకోవాలనే కొత్త నిబంధన పెట్టారు. ఏడాదికి రూ. 24వేలకు పైగా ఇంక్రిమెంట్ రూపంలో వస్తుందని, మీఫైలుకు మోక్షం లభించాలంటే మా సంగతి ఏంటని తెరవెనుక బేరాలు పెడుతున్నారు. ఉద్యోగం చేసినంతకాలం ఇంక్రిమెంట్ వస్తుంది కాబట్టి, ఒక ఏడాదిలో ఇంక్రిమెంట్ రూపంలో వచ్చే నగదును తమకు సమర్పించు కోవాలని చెప్పకనే చెబుతున్నారు. దీంతో ఉద్యోగులు ఇదేం పద్ధతని, గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఉద్యోగులకు సర్వీసును బట్టి వచ్చే ఇంక్రిమెంట్‌లను మంజూరు చేసేందుకు నగదు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. అవ న్నీ పక్కనపెట్టి అడిగినంత నగదు ఇవ్వవచ్చు కదా అని కొందరు ఉద్యోగులకు నచ్చచెప్పి నగదు చెల్లింపులు చేసేలా వ్యవహారం చక్కదిద్దుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెనకబడితే ఇక అంతే..
ప్రభుత్వం ఇటీవల పంచాయతీల్లో తడిచెత్త, పొడిచెత్తం వేర్వేరుగా సేకరిస్తున్నారా, పారిశుద్ధ్య చర్యలు సక్రమంగా చేస్తున్నారా లేదా అనే అంశంపై నేరుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తోంది. ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో ప్రజలు ఇచ్చిన సమాధానాలు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి నివేదికల రూపంలో వస్తున్నాయి. ఏదైనా పంచాయతీలో పారిశుధ్య చర్యలు చేపట్టడంలో వెనుకబడి ఉన్నట్లుగా నివేదికలో ఉంటే అక్కడకు అధికారులు వాలిపోతున్నారు. ప్రభుత్వం పంపిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో మీ పనితీరు బాగుండలేంటూ నివేదిక వచ్చింది.. మీపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే అదనుగా విజయవాడ నుంచి ప్రత్యేకంగా డెప్యుటేషన్‌పై డీపీవో కార్యాలయానికి వచ్చిన ఓ జూనియర్ అసిస్టెంట్ అధికారులు మీ పనితీరుపట్ల ఆగ్రహంగా ఉన్నారని, వారితో నేను మాట్లాడి నచ్చచెబుతానని చెప్పి తెరవెనుక బేరాలు పెడుతున్నాడని సమాచారం. అంతటితో ఆగకుండా అధికారులు మీ మండలంలో పలానారోజున పర్యటనకు వస్తున్నారని, ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటానని, ఇందుకు గాను నగదు సమకూర్చాలని ముందస్తుగానే చెబుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు చెప్పుకోవడం గమనార్హం. గత నెల రోజుల వ్యవధిలో రెండు మండలాల్లోని పంచాయతీ కార్యదర్శుల నుంచి పెద్దమొత్తంలో ఈ జూనియర్ అసిస్టెంట్ నగదు వసూలు చేశాడని తెలిసింది.
గంటల తరబడి జూమ్ మీటింగ్‌లు
నవంబరు నెల నుంచి పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లు వేగ వంతం చేస్తారు. ఇంటి పన్నుల వసూళ్లతోపాటు స్వామిత్వ సర్వే, తదితర పనుల్లో పంచాయతీ సిబ్బంది బిజీ బీజీగా ఉంటున్నారు. వరి కోతలు పూర్తయిన తర్వాత ధాన్యం నగదు చేతికి అందితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇంటి పన్నుల చెల్లింపులు చేస్తారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమయ్యాయి. కొందరు ఇంటి పన్నులు చెల్లించేందుకు కొన్నిరోజులు గడువు ఇవ్వాలని కోరుతున్నారు. ఈలోగానే ఇంటి పన్నులు వసూలులో ఎందుకు వెనుకబడిపోయారని అధికారులు జూమ్ మీటింగ్‌లు పెట్టి పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా అధికారి రెండు గంటలు, ఆ తర్వాత డివిజన్ స్థాయి అధికారులు మరో గంట, మరికొద్ది సేటికే డిప్యూటీ ఎంపీడీవో(ఈవోపీఆర్‌డీ)లు మరో గంటపాటు ఇంటిపన్నులు, స్వామిత్వ సర్వే, తదితర అంశాలపై రోజులో నాలుగు గంటల పాటు జూమ్ మీటింగ్‌లు నిర్వహిస్తుండటంతో తాము పని చేయడానికి సమయమే ఉండటం లేదని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో జూమ్ మీటింగ్‌లు అధికమయ్యయని వారు అంటున్నారు.
స్వామిత్వ సర్వేలో అనేక సమస్యలు
స్వామిత్వ సర్వే పూర్తిచేయాలంటే తొలుత ఆయా గ్రామాల్లో సాగులో ఉన్న భూములను పూర్తిస్థాయిలో సర్వేచేసి, గ్రామాలకు సంబంధించిన హద్దులు నిర్ణయించాలని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రామాల్లోని గృహాలకు సంబంధించిన స్వామిత్వ సర్వేను చేయాల్సి ఉందని, ఈ సర్వే జరిగే సమయంలో సర్వేయర్‌లు, వీఆర్వోలు తప్పనిసరిగా ఉండాలని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. కానీ వారు వివిధ విధుల్లో ఉన్న కారణంగా స్వామిత్వ సర్వేకు అందుబాటులో ఉండటం లేదని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. ఈ విషయంపై అధికారులకు తెలిసినా తమదే తప్పు అన్నట్లుగా చూపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.