రాజుల రేడు.. గోరంట్ల మాధవుడు..!
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:03 AM
భక్తుల కల్పతరువు.. కొలిచినవారి కొంగుబంగారం గోరంట్ల లక్ష్మీమాధవుడు.

గోరంట్లలో ప్రాచీన ఆలయం
పూజలందుకుంటున్న లక్ష్మీమాధవస్వామి
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కోడుమూరు రూరల్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): భక్తుల కల్పతరువు.. కొలిచినవారి కొంగుబంగారం గోరంట్ల లక్ష్మీమాధవుడు. రాజ పోషకుడైన మాధవుడి వైభవం చూసి తరించాల్సిందే. కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 35 కి.మీ, కోడుమూరు మండల కేంద్రానికి 11 కి.మీ దూరంలో గోరంట్ల గ్రామం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో గోరువంకముని తపస్సు చేసి స్వామిని ప్రత్యక్ష్యం చేసుకున్నాడని, ముని కోరిక మేరకు మాధవస్వామి గోరంట్లలో వెలసినట్లు ప్రచారంలో ఉంది. ఇక్కడ వెలసిన లక్ష్మీమాధవస్వామి ఆలయం జిల్లాలోనే ప్రసిద్ధి చెందింది.
ఫ ఆలయ చరిత్ర
గోరంట్లలో లక్ష్మీమాధవస్వామి ఆలయాన్ని క్రీ.శ 1105లో చోళరాజులు నిర్మించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత తుళు వంశస్థుడు శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని సందర్శించారు. అరవీటి వంశజుడు శ్రీరంగప్పరాజయ్య లక్ష్మీమాధవస్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. వెల్దుర్తి, డోన మొదలగు చతుసీమలో సుమారు 500లకు పైగా ఎకరాలు పూజా కైంకర్యాలకు ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో లక్ష్మీదేవి, మాధవస్వామి, ఆళ్వార్ల విగ్రహాలు ఉన్నాయి. వైష్ణవ సంప్రదాయం ఉన్న ఆలయాల్లో ఆళ్వార్లు తప్పనిసరిగా ఉంటారు. అరవీటి రాజులు ప్రతిష్టించిన విగ్రహం స్థానంలో 1961లో మరోసారి మాధవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాంతో గర్భగుడిలో ఈ రెండు విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. మొదటగా ఆరవీటి రాజుల ప్రతిష్టించిన మాధవ విగ్రహం పూజలందుకుంటుంది. ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. రాజగోపురం ముందు రాతి, గర్బగుడి ముందు చెక్కతో రూపొందించిన ధ్వజస్తంభాలు నెలకొల్పారు. ఆలయంలో చోళ, యాదవ, అరవీటి వంశస్థుల శాసనాలను చూడవచ్చు. వీటి సారాంశం మద్రాసు తాళపత్ర గ్రంథాలయంలో లభిస్తుంది. స్వామివారి రాజగోపురం ఎంతో సుందరంగా నిర్మించి ఉంది. రాజగోపుర నిర్మాణ శైలి రాజుల కళాపోషణకు నిదర్శనం. స్వామి పాదముద్రలు సమీపంలోని గట్టుమీద ఉన్న ఆనవాలు ఉన్నట్లు భక్తులు నమ్ముతున్నారు. లక్ష్మీమాధవస్వామి ఆలయానికి పూజా కైంకర్యాల నిమిత్తం వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలో ఉంది. దేవదాయ శాఖ పరిధిలో ఉత్సవాలు, భూముల వేలం నిర్వహణ జరుగుతోంది.
ఫ 11 రోజుల పాటు ఉత్సవాలు
గోరంట్ల లక్ష్మీమాధవుడికి ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఉత్తరద్వారం గుండా ప్రవేశం కల్పిస్తారు. ఇదేమాసంలో గోదాదేవి, మాధవస్వామి కల్యాణం జరిపిస్తారు. శ్రావణమాసంలో ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుంచి సమీప గట్టు దగ్గరకు వెళతారు. పాదముద్రలకు పూజలు చేస్తారు. ఆరోజు గ్రామప్రజలంతా అక్కడికి హాజరవుతారు. అలాగే దసరా శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవి అమ్మవారు వివిఽధ రూపాల్లో భక్తులచే పూజలందుకుంటారు. పాల్గుణమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సుమారు 11 రోజులపాటు వేడుకలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో స్వామిఅమ్మవార్ల కల్యాణం, గరుడోత్సవం, రథోత్సవం ప్రధాన ఘట్టాలు. రథోత్సవం తిలకించేందుకు నలుమూలల నుంచి వచ్చే భక్తులు హంద్రీతీరంలో టెంట్లు వేసుకుని విడిది చేస్తారు. ఈ తిరుణాలలో ఎద్దుల క్రయవిక్రయాలు, వంట, వ్యవసాయసామగ్రి అందుబాటులో ఉంటుంది. గోరంట్ల జాతరను ఈ ప్రాంత ప్రజలు రైతుల తిరుణాలగా పిలుచుకుంటారు.
12 నుంచి మాధవుడి బ్రహ్మోత్సవాలు
ప్రసిద్ధ గోరంట్ల లక్ష్మీమాధవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో గుర్రెడ్డి వెల్లడించారు. 11 రోజులపాటు జరిగే వేడుకల్లో భాగంగా మొదటిరోజున ఉత్సవాలకు అంకురార్పణ, రక్షాబంధనము 13న ధ్వజారోహణము, బేరిపూజ, సింహ వాహనోత్సవం, 14న శేష ఉత్సవం, 15 న హనుమంత వాహనం, 16న అర్ధరాత్రి తర్వాత స్వామిఅమ్మవార్ల కల్యాణం, గరుడవాహనం, 17న గజవాహనం, 18న శిభికోత్సవం, 19న రథారోహణము, 20న శ్రీవారి రథోత్సవం, 21న పారువేట, అశ్వవాహనసేవ, 22న హంసవాహనసేవ, చక్రస్నానం, వసంతోత్సవం, రాత్రి కంకణ విసర్జనముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.