ఇష్టారాజ్యమే!
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:40 AM
గ్రామ, వార్డు సచివాలయాల తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తమ కార్యాలయాల్లో వీరిని డెప్యూటేషన్‌పై పని చేయించుకుంటున్నారు. దీంతో సచివాలయాలకు పనులపై వచ్చిన ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండటంలేదు. ఇబ్బంది ఉన్న చోట్ల నెలల తరబడి కంప్యూటర్లు పనిచేయక పోవడంతో సేవలు నిలిచిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం సచివాలయాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తేనే మెరుగైన సేవలు అందుతాయని ప్రజలు భావిస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో అనేక విషయాలు వెలుగుచూశాయి.
- గ్రామ, వార్డు సచివాలయాల తీరుపై విమర్శలు
- సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకుండా నాడు ఏర్పాటు
- నేటికీ అదేవిధంగా కొనసాగుతున్న పాలన
- డెప్యూటేషన్‌పై వివిధశాఖలకు ఉద్యోగులు
- సచివాలయాల్లో అందుబాటులో ఉండని సిబ్బంది
- నెలల తరబడి పనిచేయని కంప్యూటర్లు
- పూర్తిస్థాయిలో సచివాలయాల ప్రక్షాళన అవసరం
- ఆంధ్రజ్యోతి పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి..
గ్రామ, వార్డు సచివాలయాల తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తమ కార్యాలయాల్లో వీరిని డెప్యూటేషన్‌పై పని చేయించుకుంటున్నారు. దీంతో సచివాలయాలకు పనులపై వచ్చిన ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండటంలేదు. ఇబ్బంది ఉన్న చోట్ల నెలల తరబడి కంప్యూటర్లు పనిచేయక పోవడంతో సేవలు నిలిచిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం సచివాలయాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తేనే మెరుగైన సేవలు అందుతాయని ప్రజలు భావిస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో అనేక విషయాలు వెలుగుచూశాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పాలనగాడితప్పింది. ఉద్యోగులపై పర్యవేక్షణ చేసేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బందిని తమ కార్యాలయాల్లో పనిచేసేందుకు డెప్యుటేషన్ పేరుతో వాడుకుంటున్నారు. కలెక్టరేట్‌తో పాటు డీపీవో, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, వ్యవసాయ తదితర శాఖల అధికారులు సచివాలయ సిబ్బందితో తమ కార్యాలయాల్లో పనిచేయించుకుంటున్నారు. దీంతో గ్రామ, వార్టు సచివాలయాల్లో ప్రజలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు సచివాలయాల్లో కంప్యూటర్‌లు మొరాయిస్తున్నాయి. వీటికి కనీస మరమ్మతులు చేయడానికి నెలలు పడుతోంది. పర్యవేక్షించే వారు లేకపోవడంతో సచివాలయ అడ్మిన్‌లతోపాటు ఇతర విభాగాల సిబ్బంది సమయపాలన పాటించడం లేదు.
మూడంచెలుగా సచివాలయాల్లో సిబ్బంది
ఇటీవల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేశారు. 2,500 మంది జనాభా ఉన్న గ్రామ సచివాలయాన్ని ఎ కేటగిరిగా చూపి అక్కడ ఆరుగురు సిబ్బందిని, అదే వార్డు సచివాలయంలో అయితే ఐదుగురు సిబ్బందితో పని చేయించాలని నిర్ణయించారు. 2,500 నుంచి మూడు వేల మంది జనాభా ఉన్న గ్రామ సచివాలయంలో ఏడుగురు సిబ్బంది, వార్డు సచివాలయంలో అయితే ఆరుగురు ఉండాలని పేర్కొన్నారు. 3,500లకుపైబడి జనాభా ఉన్న గ్రామ సచివాలయంలో ఎనిమిది మంది, వార్డు సచివాలయంలో అయితే ఏడుగురితో పనిచేయించాలని నిర్ణయించారు. సచివాలయాల్లో అడ్మిన్‌తో పాటు డేటా ప్రాసెస్ అసిస్టెంట్, మహిళా పోలీస్, వెల్ఫేర్ సెక్రటరీలు ఖచ్చితంగా ఉండాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి వ్యవసాయశాఖ అసిస్టెంట్, మత్స్యవిభాగం, ఉద్యాన అసిస్టెంట్‌లను కూడా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
బదిలీలతో గందరగోళం
జిల్లాలో 508 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో నాలుగు వేల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో సిబ్బంది ఐదేళ్లుగా ఒకే సచివాలయంలో పనిచేస్తున్నారనేకారణంతో మూడు వేల మందిని ఇతర సచివాలయాలకు బదిలీ చేశారు. కలెక్టరేట్, రెవెన్యూ, వైద్యశాఖ, డీపీవో కార్యాలయం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, సర్వే విభాగాలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల కార్యాలయాల్లో వందలాది మంది సచివాలయ ఉద్యోగులు డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. బదిలీలు, డెప్యుటేషన్‌ల ప్రభావంతో సచివాలయాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకుండా పోయారు. దీంతో ఈ లోటును పూడ్చేందుకు సచివాలయాల గ్రూపింగ్ పేరుతో అంతగా పనిలేని వీఆర్వోలు, సర్వేయర్‌లు, ఏఎన్‌ఎంలు, మహిళా పోలీస్‌లు, వెల్ఫేర్ అసిస్టెంట్‌లు తదితర విభాగాల్లో పనిచేసే సిబ్బందికి రెండు సచివాలయాల్లో పనిచేయాలని సూచించారు. దీంతో వారు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదు. వీరు ఏ సచివాలయంలో ఉన్నారో ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. అడ్మిన్‌లు ఎక్కడున్నారని ప్రశ్నిస్తే తమ విభాగం అధికారులు వేరే చోటకు పంపారని, అక్కడ నుంచే ముఖఆధారిత హాజరు వేశామని చెబుతున్నారు. దీంతో సచివాలయ సిబ్బంది ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
డెప్యుటేషన్‌లు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చినా కూడా..
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిలో అధిక శాతం మంది డెప్యుటేషన్‌పై, ఇతరత్రా విభాగాల్లో అనధికారికంగా పనిచేస్తున్న విషయాన్ని రాష్ట్ర సచివాలయాల విభాగం ఉన్నతాధికారులు గుర్తించారు. తమ అనుమతి లేకుండా కలెక్టరేట్‌తో పాటు ఇతర విభాగాల్లో ఎలా పనిచేయించుకుంటారని ప్రశ్నిస్తూ, వారందరినీ సచివాలయాలకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరి పరిస్థితిలో సచివాలయ సిబ్బందికి ఇతరత్రా పనుల కోసం డెప్యుటేషన్ వేస్తే తగిన కారణాలు చూపుతూ, తమకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చి, తాము అనుమతులు ఇచ్చిన తర్వాత డెప్యుటేషన్‌లు వేయాలనే షరతు పెట్టారు. సచివాలయ సిబ్బందికి తాము వేతనాలు చెల్లిస్తుంటే.. మీరెలా పనిచేయించుకుంటారని కూడా లేఖలో ప్రశ్నించారు. ఈ ఆదేశాలను అన్ని విభాగాల అధికారులు తుంగలో తొక్కి యథావిధిగా తమ కార్యాలయాల్లోనే సచివాలయ సిబ్బందితో పని చేయించుకుంటున్నారు.
నూతన వ్యవస్థ అందుబాటులోకి వస్తేనే..
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఆయా సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచకుండా ఆయా విభాగాల అధికారులు తమ కార్యాలయాల్లో పని చేయించుకోవడంతో రాష్ట్ర సచివాలయ విభాగం అధికారులు ఇటీవల కొత్త ప్రతిపాదన చేశారు. సచివాలయంలోని అన్ని విభాగాల్లో పనిచేసే సిబ్బందిపై పర్యవేక్షణ చేసేందుకు జిల్లాస్థాయిలో ఒక అధికారిని నియమించి, ఆయనకు మరో ఆరుగురు సిబ్బందిని ఇచ్చి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు మండల స్థాయిలో ఎంపీడీవోలు, పురపాలక సంఘాల్లో కమిషనర్‌లతో సమన్వయం చేసుకునేలా ఒక అధికారితో పాటు ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని నియమించాలని ప్రతిపాదన చేశారు. ఈ వ్యవస్థ ఏర్పడితే సచివాలయ సిబ్బందికి సంబంధించిన పర్యవేక్షణ మొత్తం ఈ ప్రత్యేక అధికారులు చూడాల్సి ఉంటుంది. దీంతో పాటు సచివాలయ సిబ్బంది తమకు కేటాయించిన సచివాలయం నుంచి తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు వేయాలనే నిబంధనను పాటించేలా చేస్తేనే సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారని అధికారులు అంటున్నారు.