Share News

జోగి అనుచరుల ఘరానా మోసం

ABN , Publish Date - Nov 17 , 2025 | 01:12 AM

గత వైపీపీ పాలనలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అనుచరులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఇంతేరులో ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చూపి విక్రయించేందుకు ప్రయత్నించారు. 30 ఎకరాలను బేరం పెట్టి నరసాపురానికి చెందిన రొయ్యల వ్యాపారి నుంచి రూ.38 లక్షలు వసూలు చేశారు. అది ప్రభుత్వ భూమి అని తెలియడంతో నగదు తిరిగి ఇవ్వాలని కోరిన వ్యాపారిని రెండేళ్ల పాటు తిప్పించుకున్నారు. గట్టిగా అడిగితే ఇచ్చేదిలేదని బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. జోగి అనుచరులు ఐదుగురిపై ఈ నెల 13న కేసు నమోదు చేశారు

జోగి అనుచరుల ఘరానా మోసం

- ఇంతేరులో ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చూపి విక్రయించేందుకు యత్నం

- ఎకరం రూ. 3 లక్షలే అంటూ 30 ఎకరాలకు బేరం

- నరసాపురానికి చెందిన రొయ్యల వ్యాపారి నుంచి రూ.38 లక్షలు వసూలు

- ప్రభుత్వ భూమని తెలియడంతో నగదు వెనక్కి తిరిగి ఇవ్వమన్న వ్యాపారి

- రెండేళ్లు తిప్పుకుని ఇవ్వకుండా బెదిరింపులకు దిగిన వైసీపీ నేతలు

- ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

- కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి, జోగి ప్రైవేటు సెక్రటరీ పులగం శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు వైదాని వెంకటరాజు, మైలా రమేష్‌, మైలా మహేష్‌రాజుపై ఈ నెల 13న కేసు నమోదు

గత వైపీపీ పాలనలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అనుచరులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఇంతేరులో ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చూపి విక్రయించేందుకు ప్రయత్నించారు. 30 ఎకరాలను బేరం పెట్టి నరసాపురానికి చెందిన రొయ్యల వ్యాపారి నుంచి రూ.38 లక్షలు వసూలు చేశారు. అది ప్రభుత్వ భూమి అని తెలియడంతో నగదు తిరిగి ఇవ్వాలని కోరిన వ్యాపారిని రెండేళ్ల పాటు తిప్పించుకున్నారు. గట్టిగా అడిగితే ఇచ్చేదిలేదని బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. జోగి అనుచరులు ఐదుగురిపై ఈ నెల 13న కేసు నమోదు చేశారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

మాజీ మంత్రి జోగి రమేశ్‌ అనుచరులపై కృత్తివెన్ను పోలీస్‌స్టేషనలో కేసు నమోదైంది, కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపి విక్రయిస్తామని నమ్మించి, పెద్దమొత్తంలో నగదు తీసుకుని మోసం చేసిన ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 13న కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇచ్చిన హామీతో ఆయన అనుచరుల ఖాతాలకు నగదు ఎప్పుడెప్పుడు, ఎంతమేర చెల్లింపులు చేసిందీ వివరాలతో సహా పోలీసులకు నరసాపురానికి చెందిన రొయ్యల వ్యాపారి తమ్ము కల్యాణ్‌కుమార్‌ అందజేశారు.

కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలితో పాటు మరో నలుగురిపై కేసు

రొయ్యల వ్యాపారి తమ్ము కల్యాణ్‌కుమార్‌ ఫిర్యాదుతో కృత్తివెన్ను పోలీసులు ఐదుదురిపై 420, 386, 506 ఆర్‌/డబ్ల్యూ ఐసీపీసెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేశ్‌ ప్రైవేటు సెక్రటరీ పులగం శ్రీనివాసరెడ్డి, కృత్తివెన్ను మండల జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి, మైలా రమేష్‌, వైసీపీ కృత్తివెన్ను మండల నాయకుడు వైదాని వెంకటరాజు, మైలా మహేష్‌రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పులగం శ్రీనివాసరెడ్డి ఇంతేరు గ్రామంలోని సర్వే నెంబరు 94లోని 30 ఎకరాల ప్రభుత్వ భూములను తన పేరున ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించాడు. ఈ భూములను ఎకరం రూ.3లక్షలకే విక్రయిస్తానని బేరం పెట్టాడు. అప్పట్లో మంత్రిగా ఉన్న జోగి రమేశ్‌తో చెప్పించి భూములను రిజిస్ర్టేషన్‌ చేయిస్తామని నమ్మించి నరసాపురానికి చెందిన తమ్ము కల్యాణ్‌కుమార్‌ నుంచి లక్షలాది రూపాయలు కాజేశారు. విడతల వారీగా నగదు తీసుకున్న ఈ ఐదుగురు భూమిని రిజిస్ర్టేషన్‌ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో వీరి తీరుపై అనుమానం వచ్చిన కల్యాణ్‌కుమార్‌ కృత్తివెన్ను తహసీల్దార్‌ కార్యాలయంలో ఇంతేరు గ్రామంలోని సర్వే నెంబరు 94లోని భూములకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాడు. అవి ప్రభుత్వ భూములని, ప్రైవేటు భూములు కాదని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో వైసీపీ నాయకుల చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితుడు తాను భూమి కొనుగోలు చేయనని, తాను ఇచ్చిన నగదును తిరిగి ఇచ్చివేయాలని వైసీపీ నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు. కొంతకాలం తర్వాత వీరు నగదు ఇచ్చేదిలేదని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

తెరవెనుక జరిగింది ఇదీ

కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో సర్వే నెంబరు 94లోని ప్రభుత్వ భూమిని 2021 నుంచి జోగి రమేశ్‌, ఆయన ప్రైవేటు పీఏ శ్రీనివాసరెడ్డి, కృత్తివెన్ను మండల వైసీపీ నాయకుడు వెంకటరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి తదితరుల కనుసన్నల్లో విక్రయిస్తూ వచ్చారు. ఇంతేరులో ప్రైవేటు భూమి 30 ఎకరాలు ఉందని, ఎకరం కేవలం రూ.3లక్షలకే విక్రయించేందుకు బేరం పెట్టారు. పెడనలోని నాటి ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకువెళ్లి ఈ భూమి విక్రయంలో ఏమైౖనా ఇబ్బందులు ఎదురైతే అప్పటి ఎమ్మెల్యే జోగి చూసుకుంటారని కూడా చెప్పించారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే తాను చూసుకుంటానని మాజీ మంత్రి జోగి తమతో చెప్పారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నగదు చెల్లింపులు ఇలా..

కృత్తివెన్ను మండలం ఇంతేరులో ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపి విక్రయం పేరుతో అప్పటి ఎమ్మెల్యే జోగి రమేశ్‌ ఇచ్చిన అభయంతో ఆయన ప్రైవేటు పీఏ శ్రీనివాసరెడ్డి ఖాతాకు 2012 జూలై 5వ తేదీన రూ.2.20లక్షలను ఒకసారి, రెండోసారి రూ.10లక్షలను నరసాపురంలోని వెంకట సత్యదుర్గా సీఫుడ్స్‌ ఖాతా నుంచి చెల్లించినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. 2021 జూలై 6వ తేదీన మైలా మహేష్‌బాబు ఖాతాకు రూ.5లక్షలు, 2021 జూలై 7వ తేదీన అతని ఖాతాకే మరో రూ10లక్షలు, అదేరోజు శ్రీనివాసరెడ్డి ఖాతాకు రూ.8లక్షలు, మైలా రత్నకుమారి ఖాతాకు రూ.2లక్షలు జమచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2022 మే 5వ తేదీన శ్రీనివాసరెడ్డి ఖాతాకు మరో రూ.3లక్షలను వెంకటసత్యదుర్గా సీఫుడ్స్‌ ఖాతా నుంచి జమ చేసినట్లు ఫిర్యాదులో వివరించారు. భూమి కొనుగోలు నిమిత్తం మొత్తంగా రూ.38 లక్షలను విడతల వారీగా తమ కంపెనీ ఖాతా నుంచి నగదు జమ చేశామని, అందుకు సంబంధించిన పూర్త్తిస్థాయి వివరాలను పోలీసులకు అందజేశారు. దీంతో పాటు జోగి రమేశ్‌ కృత్తివెన్ను పర్యటనకు వచ్చిన సమయంలో రత్నకుమారి, శ్రీనివాసరెడ్డి, వెంకటరాజు ఒక ఇంటిలో ఉండి తమకు కబురు చేయగా, అక్కడకు వెళ్లి 2022 మే 21వ తేదీన పెద్దమొత్త్తంలో నగదు అందజేశామని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేశారు.

Updated Date - Nov 17 , 2025 | 01:12 AM