అటకెక్కిన విచారణ!
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:20 AM
తాడిగడప పురపాలక సంఘంలోని టౌన్ ప్లానింగ్ విభాగం పరిధిలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులతో పూర్వ మునిసిపల్ కమిషనర్లపై శాఖాపరమైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విచారణ జరగలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- తాడిగడప మున్సిపాల్టీలో గతంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
- ఫ్లాట్ల కొనుగోలుదారుల నుంచి భారీగా అపరాధ రుసుము వసూలు
- వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేసిన బాధితులు
- పూర్వ కమిషనర్లపై విచారణకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం
- విచారణాధికారిని నియమిస్తూ జీవో జారీ
- ఇప్పటి వరకు విచారణకు రాని అధికారి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
తాడిగడప పురపాలక సంఘంలోని టౌన్ ప్లానింగ్ విభాగం పరిధిలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులతో పూర్వ మునిసిపల్ కమిషనర్లపై శాఖాపరమైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విచారణ జరగలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడిగడప పురపాలక సంఘంలోని టౌన్ ప్లానింగ్ విభాగం నిబంధనలను మీరి అడ్డగోలుగా అనధికారిక కట్టడాలకు అనుమతులు ఇచ్చింది. సాధారణంగా 450 చదరపు గజాల స్థలంలో స్టిల్ట్ + గ్రౌండ్ + నాలుగు అంతస్తులకు అనుమతులు ఇస్తారు. కానీ 200 - 250 చదరపు గజాల లోపు ఉన్న స్థలాలకు కూడా అపార్ట్‌మెంట్ల తరహాలో స్టిల్ట్ + గ్రౌండ్ + నాలుగు అంతస్తులకు అనుమతులు ఇచ్చేశారు. ఇలా అనధికారికంగా అనుమతులు ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. వీటిలోని ఫ్లాట్లను కొనుగోలు చేసిన బాధితులను లక్ష్యంగా చేసుకుని బీపీఎస్ అమల్లో లేకపోయినా.. కొనుగోలుదారుల నుంచి అపరాధ రుసుమును వసూలు చేశారు. ఈ అపరాధ రుసుమును కూడా ఆస్తి పన్నులో కలిపి వసూలు చేశారు. వీటిపై కొందరు బాధితులు కూటమి ప్రభుత్వం వచ్చాక సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం గతంలో పనిచేసిన మునిసిపల్ కమిషనర్లు ముగ్గురుపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఏకంగా విచారణాధికారిగా డీటీసీపీలో పనిచేసే జీవీజీఎస్‌వీ ప్రసాద్ అనే అధికారిని విచారణాధికారిగా నియమించింది. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయన తాడిగడప మునిసిపాలిటీకి వచ్చి పరిశీలించింది లేదు. విచారించింది లేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణాధికారి కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దీనిపై ఫిర్యాదుదారులు ఆ విచారణాధికారి దగ్గరకు వెళ్లి అడగ్గా తనను విచారణ అధికారిగా నియమించినట్టు కాపీ రాలేదని చెప్పటం సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత.. సదరు విచారణాధికారికి ఎందుకు కాపీ వెళ్లలేదో అర్థం కాని విషయంగా మారింది. తనకు కాపీ వచ్చినా ఉద్దేశ్యపూర్వకంగా విచారణాధికారి పక్కన పెట్టాడా అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణాధికారి నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది.