Share News

అరాచకాల ‘కొండ’!

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:51 AM

కొండపల్లి శ్రీనివాసరావు... ఈ పేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. వాణిజ్య పన్నుల శాఖలో అధికారులు, సిబ్బంది, వ్యాపార వర్గాలకు మాత్రం బాగా తెలుసు. అవినీతికి ఈ పేరు ఒక బ్రాండ్‌. కొంతమంది అధికారులకు బాగా ఇష్టమైన పేరు కూడా. ఇటీవల ఏసీబీ అధికారులకు చిక్కిన సబార్డినేటే ఈ కొండపల్లి శ్రీనివాసరావు. లంచాల కోసం వ్యాపార వర్గాలను పీడించాడు. తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగడానికి అధికారుల పేర్లు ఉపయోగించి తోటి ఉద్యోగులను సైతం వేధించాడు. ఇంతకాలం గోప్యంగా ఉన్న కొండపల్లి శ్రీనివాసరావు ఆగడాలు, చేష్టలు తాజాగా ఆయన ఏసీబీకి చిక్కన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

అరాచకాల ‘కొండ’!

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి తీరుపై విమర్శలు

అనధికారికంగా విదేశీ పర్యటనలు

మర్నాడు విధులకు ముందు రోజే సంతకాలు

వ్యాపార వర్గాల నుంచి మామూళ్లు వసూలు

తోటి ఉద్యోగులపై వేధింపులు

సబార్డినేట్‌ కొండపల్లి శ్రీనివాసరావు అరాచకాలు వెలుగులోకి..

కొండపల్లి శ్రీనివాసరావు... ఈ పేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. వాణిజ్య పన్నుల శాఖలో అధికారులు, సిబ్బంది, వ్యాపార వర్గాలకు మాత్రం బాగా తెలుసు. అవినీతికి ఈ పేరు ఒక బ్రాండ్‌. కొంతమంది అధికారులకు బాగా ఇష్టమైన పేరు కూడా. ఇటీవల ఏసీబీ అధికారులకు చిక్కిన సబార్డినేటే ఈ కొండపల్లి శ్రీనివాసరావు. లంచాల కోసం వ్యాపార వర్గాలను పీడించాడు. తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగడానికి అధికారుల పేర్లు ఉపయోగించి తోటి ఉద్యోగులను సైతం వేధించాడు. ఇంతకాలం గోప్యంగా ఉన్న కొండపల్లి శ్రీనివాసరావు ఆగడాలు, చేష్టలు తాజాగా ఆయన ఏసీబీకి చిక్కన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ)

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పైఅధికారులు చెప్పిన పని కింది స్థాయి ఉద్యోగులు చేస్తుంటారు. వాణిజ్య పన్నుల శాఖలో మాత్రం పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. సబార్డినేట్‌గా ఉన్న కొండపల్లి శ్రీనివాసరావు ఏ పని చెప్పినా కొంతమంది అధికారులు ఎలాంటి ఆలోచన లేకుండా చేసి పెట్టారని ఆ శాఖ మొత్తం చెప్పుకుంటున్నారు.

అనధికార విదేశీయానాలు

కొండపల్లి శ్రీనివాసరావు కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఒకరు లండన్‌లో ఉంటే, మరొకరు యూకేలో ఉంటున్నారు. ఒకరు ఇంజనీరింగ్‌, మరొకరు మెడిసిన్‌ చదువుతున్నారు. వారి వద్దకు శ్రీనివాసరావు ఏడాదిలో రెండు సార్లు వెళ్లి వస్తుంటారు. దీనికి ఉన్నతాధికారుల అనుమతులు ఉండవు. అలాగని వారికి సమాచారం ఉండదు. నిబంధనల ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఆ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలను తెలియజేయాలి. వాణిజ్య పన్నుల శాఖలో ఎవరైనా కిందిస్థాయి ఉద్యోగి విదేశాలకు వెళ్లాలంటే సంబంధిత సర్కిల్‌ సీటీవో ద్వారా డివిజన్‌ సంయుక్త కమిషనర్‌కు ప్రతిపాదన వెళ్లాలి. విదేశాలకు వెళ్లడానికి నిధులు ఎలా సమకూరాయి, అక్కడ ఎవరు ఉంటున్నారు, ఎవరి వద్ద బస చేస్తున్నారు అన్న వివరాలతోపాటు విదేశీ ప్రయాణానికి సంబంధించిన విమాన టికెట్ల ఫొటోస్టాట్‌ కాపీలను అధికారులకు సమర్పించాలి. వాణిజ్య పన్నుల శాఖ కింది, మధ్యస్థాయి ఉద్యోగులంతా ఈ నిబంధనను అనుసరిస్తున్నారు. దీనికి తాను మినహాయింపు అన్న భావనలో కొండపల్లి శ్రీనివాసరావు వ్యవహరించాడు. విదేశాలకు వెళ్లేటప్పుడు సంబంధిత సర్కిల్‌లోని సీటీవోకు ఎలాంటి సమాచారం ఇచ్చేవాడు కాదు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకునేవాడు కాదు. దర్జాగా పక్క ఊరికి వెళ్లి వచ్చినట్టుగా ప్రయాణం చేసేవాడు. శ్రీనివాసరావు అనధికారికంగా విదేశాలకు వెళ్తున్నాడని సర్కిల్‌లోని అధికారులకు పూర్తిగా సమాచారం ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకునేవారు కాదు. పైగా అతనిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు.

రేపటి విధులకు ముందు రోజే సంతకాలు

గవర్నరుపేట సర్కిల్‌లో కొండపల్లి శ్రీనివాసరావు ఎంత అరాచకంగా వ్యవహరించాడు, అతనికి అధికారులు ఏ స్థాయిలో వత్తాసు పలికారు అన్న దానికి బలమైన ఆధారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేటు ఉద్యోగులైనా ఏ రోజు విధులకు హాజరైతే ఆ రోజే హాజరుపట్టీలో సంతకాలు చేస్తారు. ఒకవేళ బయోమెట్రిక్‌ ఉంటే ఆరోజే వేస్తారు. ఈ విషయంలో కొండపల్లి శ్రీనివాసరావు తనంతట తాను సొంత నిబంధనను రూపొందించుకున్నాడు. శ్రీనివాసరావు తొమ్మిదో తేదీన లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత అధికారులు కార్యాలయంలో హాజరుపట్టికను పరిశీలించారు. తొమ్మిదో తేదీన హాజరుపట్టీలో సంతకం చేయడంతోపాటు ఆ మర్నాడు పదో తేదీన సంతకాలు చేసి ఉండడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. వాణిజ్య పన్నుల శాఖలో బయోమెట్రిక్‌ హాజరు అమలవుతోంది. ఒకవేళ సాంకేతికంగా ఏమైనా సమస్యలు వస్తే ఇబ్బంది లేకుండా దానికి సమాంతరంగా హాజరుపట్టీని నిర్వహిస్తున్నారు. ఇందులో మాత్రం శ్రీనివాసరావు తర్వాత తేదీలో సంతకాలు చేయడం గమనార్హం. ఈ సర్కిల్‌లో ఉన్న అధికారి ఎవరైనా ఉద్యోగులు విధులకు ఆలస్యంగా హాజరైతే ఆ పేరు ఎదురుగా ఇన్‌టు మార్క్‌ పెడతారు. ఈ మార్క్‌ నుంచి కొండపల్లి శ్రీనివాసరావుకు మినహాయింపు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతడు ఎన్ని గంటల ఆలస్యంగా విధులకు వచ్చినా, అసలు సమాచారం లేకుండా విధులకు రాకపోయినా ఆ అధికారి వెనుకేసుకుని వచ్చినట్టు విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా కొండపల్లి అవినీతి కోటలను విస్తరించుకున్నాడని తెలుస్తోంది.

Updated Date - Oct 22 , 2025 | 12:51 AM