స్వామిత్వ తలపోటు!
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:36 AM
పంచాయతీ కార్యదర్శులకు స్వామిత్వ సర్వే పెద్ద తలపోటుగా మారింది. నెలాఖరులోపు ఇంటింటికి వెళ్లి టేపుతో కొలిచి సర్వే వివరాలు స్వమిత్వ పోర్టల్‌లో నమోదు చేయాలని డీపీవో కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. సర్వేయరు, వీఆర్వోలు, డ్రోన్లు లేకుండా ఎలా జరపాలని తలలు పట్టుకుంటున్నారు. గతంలో నలుగురైదుగురు సిబ్బంది యంత్రాల సాయంతో చేస్తేనే అవ్వని పని ఇప్పుడు తక్కువ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరింత మంది, సిబ్బంది, యంత్రాలు, గడువు కావాలని కోరుతున్నారు.
-నెలాఖరులోపు ఇళ్ల సర్వే పూర్తి చేయాలని డెడ్‌లైన్
-జూమ్ మీటింగ్‌లో ఆదేశాలు ఇచ్చిన డీపీవో
-సర్వేయరు, వీఆర్వోలు, డ్రోన్లు లేకుండా జరపాలని సూచన
-తలలు పట్టుకుంటున్న పంచాయతీ కార్యదర్శులు
-టేపుతో కొలిచి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం తమ వల్లకాదని ఆవేదన
పంచాయతీ కార్యదర్శులకు స్వామిత్వ సర్వే పెద్ద తలపోటుగా మారింది. నెలాఖరులోపు ఇంటింటికి వెళ్లి టేపుతో కొలిచి సర్వే వివరాలు స్వమిత్వ పోర్టల్‌లో నమోదు చేయాలని డీపీవో కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. సర్వేయరు, వీఆర్వోలు, డ్రోన్లు లేకుండా ఎలా జరపాలని తలలు పట్టుకుంటున్నారు. గతంలో నలుగురైదుగురు సిబ్బంది యంత్రాల సాయంతో చేస్తేనే అవ్వని పని ఇప్పుడు తక్కువ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరింత మంది, సిబ్బంది, యంత్రాలు, గడువు కావాలని కోరుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, ఈవోలపై స్వామిత్వ(సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్)సర్వే కత్తి వేలాడుతోంది. గ్రామ పంచాయతీల్లో గృహాల సర్వేను ఖచ్చితత్వంతో పూర్తి చేసి స్వమిత్వ పోర్టల్‌లో నమోదు చేసి, సంబంధిత ఇంటి యజమాని పేరుతో భూమి హక్కు పత్రం ఇచ్చే వెసులుబాటు కోసం ఓ బృహత్తర కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో మండలంలో ఒకటీ లేదా రెండు పంచాయతీలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా ఈ సర్వేను పూర్తి చేసేవారు. సర్వే చేసే సమయంలో గ్రామ వీఆర్వో, సర్వేయర్, పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్‌లు దగ్గరుండేవారు. సర్వే ప్రక్రియను తక్కువ సమయంలో ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు రోవర్‌లు, డ్రోన్‌లను కూడా ఉపయోగించేవారు. యంత్రాల ద్వారా చేసిన సర్వేను ఆధారంగా చేసుకుని ఇంటి యజమానులు, గృహాల సరిహద్దులను స్వామిత్వ పోర్టల్‌లో నమోదు చేసేవారు. ఈ పద్ధతిలో జరిగిన సర్వేపై ఎలాంటి అభ్యంతరాలు, ఇబ్బందులు రాలేదని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.
రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్‌లు లేకుండా ఎలా?
గ్రామాల్లో ఇళ్లు సర్వే చేయాలంటే ఆయా గృహాలు ఏయే సర్వే నెంబర్లలో ఉన్నాయో రెవెన్యూ సిబ్బందికి, సర్వేయర్లకు మాత్రమే తెలుస్తుంది. దీంతో పాటు సర్వేచేసే సమయంలో వీఆర్వోలు సర్వే నెంబంర్లను నిర్ధారిస్తే సర్వేయర్‌లు గృహాలకు కొలతలు వేసి, ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉంది, ఇంటి చుట్టూ ఖాళీస్థలం ఎంత ఉంది అనేది నిర్ధారిస్తారు. వీఆర్వో, సర్వేయర్, పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్‌లు అందరూ కలసి పనిచేస్తే ఒక రోజుకు 20 గృహాలలోపు సర్వే పూర్తి చేయగలిగామని చెబుతున్నారు. ఇప్పడు వీఆర్వో, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్‌లు, రోవర్‌లు, డ్రోన్‌లు లేకుండా కేవలం పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు ఇంటింటికీ వెళ్లి, ఇంటి కొలతలను టేపుతో కొలిచి రోజుకు 150 గృహాల సర్వేను పూర్తి చేయాలని సోమవారం నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో డీపీవో ఆదేశించటంతో పంచాయతీ కార్యదర్శులు ఖంగుతిన్నారు. గతంలో నలుగురైదుగురు సిబ్బంది యంత్రాల సాయంతో సర్వే చేస్తేనే రోజుకు 20 ఇళ్లు అవ్వలేదని, ఇప్పుడు అవేమీ లేకుండా ఇద్దరే ఈ పని చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని పంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు.
మూడు, నాలుగు నెలలు పడుతుంది!
జిల్లాలో 474 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 100కుపైగా అధిక జనాభా, గృహాలు ఉన్న పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి కొలతలు తీసుకుని, వాటిని రాసుకుని, మళ్లీ స్వామిత్వ పోర్టల్‌లో పూర్తి వివరాలు నమోదు చేయడానికి కనీసంగా మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. చిన్న పంచాయతీల్లో రెండు నెలల వ్యవధిలో ఈ పనిపూర్తి చేసినా, పెద్ద పంచాయతీలలో కనీసంగా నాలుగు నెలల సమయం పడుతుందని పేర్కొంటున్నారు. కానీ ఆగస్టు నెలాఖరులోపుగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు చెబుతున్నారని పంచాయతీ కార్యదర్శులు, ఈవోలు వాపోతున్నారు. హడావుడిగా ఈ పనిని పూర్తిచేస్తే తప్పులు దొర్లడం ఖాయమని, మళ్లీ సర్వే చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఇంటి యజమానుల పేరున భూమి హక్కు పత్రాలు ఇస్తారని, వీటి ద్వారా ఇంటి స్థలం రిజిస్ర్టేషన్ సులువుగా చేయించుకునే వెసులుబాటు వస్తుందని అంటున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సర్వేను హడావుడిగా చేయాలని ఆదేశాలు జారీ చేస్తుండటంతో ఏం చేయాలో తమకు పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, సర్వే విభాగం సిబ్బంది సమన్వయంతో పనిచేసేలా అవకాశం కల్పించి, సర్వే యంత్రాలను కూడా సమకూరిస్తే ఈప్రక్రియ వేగవంతంగా, ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా పూర్తి చేయగలుగుతామని అంటున్నారు. స్వామిత్వ సర్వేకు కొంతసమయం ఇవ్వాలని కోరుతున్నారు.