కర్షకుడికి తప్పని కష్టాలు
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:10 AM
రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు.

· ఆశాజనకంగా దిగుబడులు
· లభించని గిట్టుబాటు ధరలు
· చేతికందని పెట్టుబడులు
· అప్పు ఊబిలో అన్నదాతలు
· దందా కొనసాగిస్తున్న దళారులు
సంజామల/ రుద్రవరం ఏప్రిల్ 13: రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు మాత్రం లేవు. ఎకరం వరి పంట సాగు చేయాలంటే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. నాట్లు మొదలుకొని పంట నూర్పిడి వరకు చీడ పీడలను నివారిస్తూ తీరా పంట చేతికి వచ్చాక మార్కెట్లో ధర లేక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది రబీలో సాగైన వరి పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ గిట్టుబాటు ధర అంతంత మాత్రమే ఉందంటూ రైతులు వాపోతున్నారు. 50కిలోల ఎరువు బస్తా రూ. 1800 ఉండగా 70కిలోల వరి బస్తా రూ.1300లకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎకరం వరి పంట సాగుకు 12 నుంచి 16బస్తాల ఎరువులు ట్రాక్టర్ డ్రమ్ముకొట్టిన బాడుగలు, నాటు కూలీలు, కలుపు కూలీలు, చీడ పీడల నివారణకు క్రిమి సంహారక మందులు, నూర్పిడి కూలీలు కలిపి ఎకరాకు రూ.30వేల నుంచి రూ.35వేలు పెట్టుబడి పెట్టా ల్సి వస్తోందని పంట దిగుబడి 40బస్తాలు వస్తే తప్ప కాస్తో కూస్తో మిగులుతుందని రైతు లు పేర్కొంటున్నారు. ధాన్యం విక్రయాలకు మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో దళారుల దందా అధికమైంది. దళారులు సిండికేట్‌గా ఏర్పడి పక్క దళారులను రానివ్వకుండా రైతు నుంచి తక్కువ ధరలకే ధాన్యాలు కొనుగోలు చేస్తున్నారు. ఓ ప్రక్క దళారుల బెడద మరోపక్క ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతను అప్పుల్లోకి నెట్టివేస్తున్నాయి.
చెరువులు, కాలువ కింద సాగు
రుద్రవరం మండలం రబీ సీజనలో 10,148 ఎకరాలు బోరు బావుల కింద, చెరవులు, కాల్వ ల కింద సాగుచేశారు. వరిపంట దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర లేదని రైతులు వా పోతున్నారు. వర్షాలు కురుస్తున్న హడావుడి లో రైతులు వరి పంటను కోయడంతో వ్యా పారులు చెప్పిందే ధరగా మారింది. రైతులు ఏం చేసేది లేక 75 కేజీల బస్తాతో పాటు 3 కేజీలు అదనం గా 78 కేజీల బస్తా రూ.1350కి కొను గోలు చేస్తున్నా రు. రూ.1500 బస్తా రేటు ఉం డగా, వారంలోనే రూ.150 బస్తాపై రేటు తగ్గించా రు. ఎకరాకు సగటున 40 నుంచి 42 బస్తా లు దిగుబడి వచ్చింది. రైతులు ఎకరాకు రూ.25వేల నుంచి 30వేలు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.