Share News

‘అతిథి’దేవోభవ..!

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:34 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో పని చేసే అతిథి అధ్యాపకులు (గెస్టు ఫ్యాకల్టీకి) పెద్ద పీట వేసింది.

   ‘అతిథి’దేవోభవ..!

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీకి పెద్దపీట

గౌరవ వేతనం పెంపు

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

కర్నూలు జిల్లాలో 54 మందికి లబ్ది

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూన 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో పని చేసే అతిథి అధ్యాపకులు (గెస్టు ఫ్యాకల్టీకి) పెద్ద పీట వేసింది. గెస్టు ఫ్యాకల్టీగా పని చేసే కాలానికిగానూ మూడింతల గౌరవ వేతనాన్ని పెంచింది. రూ.10వేల నుంచి రూ.27వేలకు పెంచుతూ జీవోఆర్‌టీ.నెం.181ను తేదీ.12.05.2025న ఇంటర్మీడియట్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ఫలితంగా కర్నూలు జిల్లాలో గెస్టు ఫ్యాకల్టీగా పని చేస్తున్న 54 మంది అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచుతూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపిందనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గెస్టు ఫ్యాకల్టీగా సుదీర్ఘకాలంగా పని చేస్తున్నారు. వారు పని చేసే కాలానికి ప్రభుత్వం ఇచ్చే అరకొర గౌరవ వేతనంతో కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులు పడేవారు. తక్కువ గౌరవ వేతనం ఉండటంతో కళాశాలలో అద్యాపకులుగా పని చేసేందుకు పెద్దగా ఉత్సాహం చూపేవారు కాదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చే హామీని నెరవేర్చడంపై అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అతిథి అధ్యాపకులకు గౌరవ వేతనం పెంచడం వల్ల పని చేసేందుకు పోటీ అధికంగా ఉంటుందని ఇంటర్‌ బోర్డు అధికారులు బావిస్తున్నారు. గెస్టు ఫ్యాకల్టీకి గౌరవ వేతనం పెంచడం శుభసూచకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఫ జూన నుంచే అమలు

- సురేష్‌బాబు, డీఐఈవో, కర్నూలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గెస్టు అధ్యాపకుల గౌరవ వేతనం రూ.10వేల నుంచి రూ.27వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన గౌరవ వేతనం జూన నుంచి అమలులోకి వస్తుంది. గౌరవ వేతనం పెంచడం వల్ల మంచి ఫ్యాకల్టీ వస్తుంది. కష్టపడి పనిచేస్తారు. మంచి ఫలితాలు కూడా వస్తాయి. కళాశాలలో ఎనరోల్‌మెంటు పెరుగుతుంది. ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, బ్యాగులు, జేఈఈ- నీట్‌ పోటీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్‌ను సరఫరా చేస్తుండటంతో విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ పథకాలతో ప్రభుత్వ కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య మెరుగుపడుతుంది.

ఫ శుభపరిణామం

- శ్రీధర్‌మూర్తి, బీ.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ కళాశాల, కర్నూలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పని చేసే అతిథి అధ్యాపకులకు ఇచ్చే గౌరవ వేతనం పెంచడం శుభపరిణామమే. నేను బీ.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. చాలీ చాలనీ గౌరవ వేతనంతో కుటుంబాన్ని పోషించుకోలేక ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేక అనేక ఇబ్బందులు పడ్డాను. ఇచ్చే గౌరవ వేతనం కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మా ఇబ్బందులను ఆలకించి గౌరవ వేతనం పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు.

Updated Date - Jun 25 , 2025 | 11:34 PM