గ్రేడింగ్ విధానాన్ని కొనసాగించాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:04 PM
మార్కెట్ యార్డ్‌లో గ్రేడింగ్ విధానాన్ని కొనసాగించాలంటూ మహిళా కూలీలు డిమాండ్ చేశారు.
మార్కెట్‌యార్డు కార్యాలయాన్ని ముట్టడించిన మహిళా కూలీలు
పాసింగ్ వల్ల రైతులు నష్టపోతారు
లైసెన్స లేని కూలీలు ఆందోళన చేస్తే ఉపేక్షించం
కార్యదర్శి కల్పన హెచ్చరిక
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): మార్కెట్ యార్డ్‌లో గ్రేడింగ్ విధానాన్ని కొనసాగించాలంటూ మహిళా కూలీలు డిమాండ్ చేశారు. పట్టణంలోని మార్కెట్‌యార్డు కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. వారు మాట్లాడుతూ ఈనెల 25 నుంచి రైతులు విక్రయానికి తెచ్చిన వేరుశనగ దిగుబడులకు పాసింగ్ విధానం లేకుండా కొనుగోలు చేయాల్సిందేనని మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఎం. కల్పన వ్యాపారులను ఆదేశించారు. రైతులకు నష్టం కలిగించే విధానాన్ని మార్కెట్ యార్డ్‌లో అమలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. వ్యాపారుల దగ్గర పనిచేస్తూ గ్రేడింగ్ చేస్తున్న మహిళా కూలీలను కొందరు రెచ్చగొట్టి కార్యాలయం వైపు ఉసిగొల్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో 250 మందిపైగా మహిళా కూలీలు మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడే బైఠాయించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తాము ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని యార్డ్ అధికారులు హెచ్చరించారు. మహిళా కూలీలు పాసింగ్ విధానాన్ని రద్దు చేస్తే తమకు ఉపాధి కోల్పోతామని, ఎన్నో ఏళ్ల నుంచి మార్కెట్ యార్డ్ పైనే జీవనం చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఇది వేరుశనగ వ్యాపారులకు, మీకు సంబంధించినదని, లైసెన్స కలిగిన కూలీలు కానప్పుడు ఇక్కడ ఆందోళన చేయొద్దంటూ సూచించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు కమీషన ఏజెంట్ల దుకాణాల వద్దకు వెళ్లకుండా తూకాలు నిలుపుదల చేయడంతో ఒకటో పట్టణ పోలీసులు అక్కడ చేరుకొని వారికి సరిధచెప్పారు. రైతులకు నష్టం కలిగించే విధానం అని, వ్యాపారులతో మీరు మాట్లాడుకోవాలని అక్కడి నుంచి పంపించేశారు. వ్యాపారులు మాత్రం పాసింగ్ కొనసాగిస్తేనే వేరుశనగ దిగుబడును కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. పాసింగ్ విధానం రద్దు చేస్తారా? కొనసాగిస్తారా? అన్న దానిపై సందేహాలు వ్యక్త అవుతున్నాయి. మార్కెట్ యార్డ్ కార్యదర్శి కల్పన మాట్లాడుతూ మహిళా కూలీలు వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తే ఉపేక్షించబోమని, వారు లైసెన్స దారులు కాదని చెప్పారు. వ్యాపారులతో మాట్లాడుకోవాలని సూచించారు.