ప్రభుత్వమే ఆదుకోవాలి
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:25 PM
వర్షాలకు రైతులు సాగుచేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజాసాహెబ్, మండల కార్యదర్శి కారుమంచి, రైతుసంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్ డిమాండ్ చేశారు.
పత్తికొండ టౌన్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వర్షాలకు రైతులు సాగుచేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజాసాహెబ్, మండల కార్యదర్శి కారుమంచి, రైతుసంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సీఆర్.భవన్ నుంచి సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఉల్లి, టమోటా, పత్తి, సజ్జ పంటలతో నిరసన ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై ఉల్లి, టమోటా, పత్తి తదితర పంటలను పారబోసి నిరసన తెలియజేశారు. వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లా రైతాంగమే అతలాకుతలమయ్యారన్నారు. అధికారులు పంట పొలాల్లో పర్యటించి ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందో సమగ్ర నివేదికలు తయారు చేయాలన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు గురుదాస్, రామాంజనేయులు, ఉమాహేష్, రంగన్న, వెంకటరామిరెడ్డి, ఉసేని తదితరులు పాల్గొన్నారు.