లక్ష సౌర గృహాలే లక్ష్యం!
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:15 AM
లక్ష సౌర గృహాలే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. 2026-27 నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. కిందటి ఆర్థిక సంవత్సరం 2024 - 25లో జిల్లాలో 20 వేల సౌర గృహ యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ ఆచరణలో పూర్తిస్థాయిలో అమలు జరగలేదు. ఎన్నికలు రావటం, అనంతరం ఈ పథకం ముగియటానికి కొద్ది నెలలు మాత్రమే గడువు ఉండటంతో క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం గడువును మరో ఐదేళ్లపాటు పెంచటంతో సౌర గృహాల లక్ష్యం దిశగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మళ్లీ కదులుతోంది.
మూడేళ్లలో పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం అడుగులు
ఇప్పటి వరకు ప్రజల నుంచి
వచ్చిన దరఖాస్తులు 79,871
సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుకు 10,470 మంది వెండర్ల నియామకం
మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ముందుకు
లక్ష సౌర గృహాలే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. 2026-27 నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. కిందటి ఆర్థిక సంవత్సరం 2024 - 25లో జిల్లాలో 20 వేల సౌర గృహ యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ ఆచరణలో పూర్తిస్థాయిలో అమలు జరగలేదు. ఎన్నికలు రావటం, అనంతరం ఈ పథకం ముగియటానికి కొద్ది నెలలు మాత్రమే గడువు ఉండటంతో క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం గడువును మరో ఐదేళ్లపాటు పెంచటంతో సౌర గృహాల లక్ష్యం దిశగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మళ్లీ కదులుతోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కేంద్ర ప్రభుత్వం ఈ పథకం గడువును మరో ఐదేళ్లపాటు పెంచటంతో సౌర గృహాల లక్ష్యం దిశగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మళ్లీ కదులుతోంది. కిందటి ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యంతో పాటు ఈ ఏడాది రెట్టింపు లక్ష్యాన్ని నిర్దేశించు కుని దానిని కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 20 వేల సౌర గృహ యూనిట్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 2025-26 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనికి రెట్టింపుగా అంటే 40,000 సౌర గృహ యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026 - 2027 నాటికి మరో 40,000 సౌర గృహ యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తంగా మూడేళ్లలో లక్ష సౌరగృహ యూనిట్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026- 27 నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న దిశగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో డ్వాక్రా, డ్వాక్వా మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులందరి చేత తమ ఇళ్లపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే విధంగా వారిని కొద్ది రోజులుగా చైతన్య పరుస్తోంది. బ్యాంకర్లను కూడా స్వయం సహాయక సంఘాలకు టై అప్ చేస్తూ ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతోంది. సౌర ఫలకాలను బిగించే వెండర్లను కూడా పెద్ద ఎత్తున గుర్తిస్తోంది.
పెరిగిన దరఖాస్తులు
ప్రస్తుతం జిల్లాలో ఉధృతంగా జరుగుతున్న అవగాహనా కార్యక్రమాల వల్ల ఇప్పటివరకు 79,871 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 79,709 దరఖాస్తులకు అనుమతి ఇవ్వడం జరిగింది. మరో 162 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క దరఖాస్తును మాత్రమే తిరస్కరించారు. ఎందుకంటే ఇంటి మీద సౌరపలకలు పెట్టుకునే పరిస్థితి లేదు. సౌర పలకలు పెట్టుకోవటానికి తగిన చోటు ఉండి ఉండాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు ఆ దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి వస్తున్న విశేష స్పందనను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసే వెండర్లను కూడా పెద్ద ఎత్తున నియమిస్తోంది. ప్రస్తుతం 10,470 వెండర్లను నియమించుకోవడం జరిగింది. ఇప్పటివరకు 988 సౌర గృహ యూనిట్లను పూర్తి చేశారు. వాస్తవానికి వస్తున్న దరఖాస్తులకు, పూర్తవుతున్న సౌర గృహ ప్లాంట్లకు చాలా తేడా ఉంది. ఎందుకంటే విద్యుత్ శాఖ నుంచి ఫీజుబిలిటీ రిపోర్ట్, పరిశీలన, ఇతర అనుమతులు కూడా అవసరం. అలాగే వెండర్ల్ సమస్య ఉండటం కూడా జాప్యానికి కారణమవుతోంది. జిల్లా యంత్రాంగం వీటిపై కూడా ప్రస్తుతం దృష్టి సారించింది. విద్యుత్ శాఖ పరిధిలో వెంటనే అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటోంది.
ఐదు గ్రామాల్లో సంపూర్ణ సౌర గృహాల లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లాలోని ఐదు గ్రామాల్లో నూరు శాతం సంపూర్ణ సౌర విద్యుత్ గృహాలను తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జగ్గయ్యపేటలో బోదవాడ, షేర్ మహమ్మద్ పేట, కంచికచర్లలో పరిటాల, మైలవరంలో వెల్వడం, కంభంపాడులో అడవినెక్కలం గ్రామాలను సంపూర్ణ సౌర గృహ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం గుర్తించింది. 2026 - 27 నాటికి ఈ గ్రామాలలోని గృహాలన్నీ కూడా సౌరవెలుగులతో విరాజిల్లేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. స్వయం సహాయక సంఘాల సభ్యులే కాకుండా.. ఆ గ్రామంలో ప్రతి ఇంటికీ సచివాలయ సిబ్బందిని పంపించి ఈ పథకం ప్రయోజనం గురించి వారికి వివరించి వారి అంగీకార పత్రాన్ని తీసుకొని ప్రతి ఇంటిపైనా సౌర పలకలను ఏర్పాటు చేసి సౌరకాంతులను నింపాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. దీని కోసం స్వచ్ఛంద సంస్థలు, ఇతర ఎన్జీవోల సహాయ, సహకారాలను కూడా తీసుకోవాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీ-4 పథకంలో భాగంగా కూడా పెద్ద పెద్ద కంపెనీల నుంచి సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద ఆయా గ్రామాలలో పేద ప్రజల గృహాలపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి సహాయ సహకారాలను తీసుకోవాలని కూడా జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి స్పాన్సర్ చేస్తామన్నా వారి పేరుతో ఎంపిక చేసిన గ్రామాలలోని పేదల ఇళ్లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు.