కంకణాల మహిమ!
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:10 AM
పూజలో పెట్టిన కంకణం ఇది. ఒకటి రూ.100. దీన్ని పెద్దలు కట్టుకోవచ్చు. పిల్లలకూ కట్టొచ్చు. ఇది భూతవైద్యులు చెప్పిన మాట కాదు. సాక్షాత్తు కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై పురోహితులు చెబుతున్న మాట. ఇంద్రకీలాద్రిపై ఈ కంకణాల మాటున పెద్ద వ్యాపారమే జరుగుతోంది. అధికారులు తనిఖీలు చేసినప్పుడు మాత్రం ఇవి మాయమవుతాయి. మిగిలిన సమయాల్లో శఠారీ ఉండే పళ్లాల్లో దర్శనమిస్తాయి. కొంతమంది భక్తులు వాటిని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యాపారమంతా కనకదుర్గమ్మ ప్రధానాలయం నుంచి ఉపాలయాల వరకు కొనసాగుతోంది.
ఇంద్రకీలాద్రిపై జోరుగా వ్యాపారం
ఒక్కోటి రూ.100లకు విక్రయం
నిమ్మకాయలపైనా వ్యాపారమే
శఠారీల వద్ద భక్తుల నుంచి దోపిడీ
అమలు కాని రూ.5 నిర్ణయం
పూజలో పెట్టిన కంకణం ఇది. ఒకటి రూ.100. దీన్ని పెద్దలు కట్టుకోవచ్చు. పిల్లలకూ కట్టొచ్చు. ఇది భూతవైద్యులు చెప్పిన మాట కాదు. సాక్షాత్తు కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై పురోహితులు చెబుతున్న మాట. ఇంద్రకీలాద్రిపై ఈ కంకణాల మాటున పెద్ద వ్యాపారమే జరుగుతోంది. అధికారులు తనిఖీలు చేసినప్పుడు మాత్రం ఇవి మాయమవుతాయి. మిగిలిన సమయాల్లో శఠారీ ఉండే పళ్లాల్లో దర్శనమిస్తాయి. కొంతమంది భక్తులు వాటిని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యాపారమంతా కనకదుర్గమ్మ ప్రధానాలయం నుంచి ఉపాలయాల వరకు కొనసాగుతోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. రోజుకు 30 వేల నుంచి 40వేల మంది అమ్మవారిని దర్శించుకుంటారు. ఆది, మంగళ, శుక్రవారాల్లో 50వేల మంది భక్తులు వస్తుంటారు. తొలుత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఉపాలయాలకు వెళ్తారు. కనకదుర్గమ్మ ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో నటరాజస్వామి ఆలయం, దీనికి వెనుక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. అమ్మవారిని దర్శించుకున్న కొంతమంది భక్తులు మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్తారు. మరికొంతమంది మాత్రం ఉపాలయాలను దర్శించుకుని మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్తారు.
రావిచెట్టు దగ్గర నుంచి మొదలు..
అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులు రావిచెట్టు వద్దకు వెళ్తారు. ఇక్కడ పురోహితులు శఠారీ ఇస్తారు. పళ్లెంలో ఎరుపు రంగు దారం కట్టిన కంకణాలు కుప్పలుగా ఉంటాయి. ఈ కంకణాలు అమ్మవారి పూజల్లో పెట్టినవి, కట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తులకు చెబుతున్నారు. ఒక్కో కంకణం రూ.100కు విక్రయిస్తున్నారు. ఇక్కడ కంకణాలతో పాటు నిమ్మకాయలు ఉంటాయి. వాటినీ భక్తులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా విక్రయించిన డబ్బులు పురోహితుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై కంకణాల వ్యాపారం రావిచెట్టు దగ్గర నుంచే ప్రారంభమవుతోంది. ఆ తర్వాత నటరాజస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలోనూ సాగుతోంది. పురోహితులు సొంతంగా ఈ కంకణాల వ్యాపారం చేస్తున్నారని ఆలయ వర్గాలే చెబుతున్నాయి. దీనికి ఆలయానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై కంకణాల వ్యాపారం మంచి జోరుగా జరుగుతోంది. అమ్మవారికి నిత్యం ఆర్జిత సేవలు జరుగుతాయి. తెల్లవారుజామున అమ్మవారికి ఖడ్గమాలార్చన జరుగుతుంది. ఇది కాకుండా కుంకుమ పూజలు జరుగుతాయి. ఇందులో ఏ ఆర్జితసేవలో, ఏ పూజలో ఈ కంకణాలు పెడుతున్నారో ఎవరికీ తెలియదు. అమ్మవారి పూజలో ఉంచిన కంకణాలు కట్టుకుంటే అంతా మంచే జరుగుతుందన్న మాటలు చెప్పి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. నిత్యం ఈ కంకణాల ముసుగులో వేలాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. అమ్మవారిపై భక్తులకు ఉన్న భక్తిని కొంతమంది పురోహితులు క్యాష్ చేసుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
రూ.5 నిర్ణయం ఏమైంది?
కంకణాల వ్యాపారం అధికారుల దృష్టికి వెళ్లడంతో దీనికి అడ్డుకట్ట వేయాలని భావించారు. కంకణం ఐదు రూపాయలకు విక్రయించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందున్న ఈవో ఈ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత పురోహితుల గొంతులో వెలక్కాయపడినట్టయింది. తర్వాత కొన్నాళ్లపాటు కంకణాలను విక్రయించడం ఆపేశారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత తిరిగి మళ్లీ ప్రారంభించారు. భక్తుల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని జరిగే వ్యాపారానికి బ్రేకులు వేయాలని పలువురు కోరుతున్నారు. కంకణాలకు అధికారులే ఒక ధరను నిర్ణయించి బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.