గ్యారేజీల్లో డొల్లతనం!
ABN , Publish Date - May 08 , 2025 | 12:18 AM
రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎన్టీఆర్, కృష్ణా రీజియన్ల పరిధిలోని గ్యారేజీల పనితీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్సుల కండీషన్‌ను మెరుగుపర్చేందుకు అమలు చేయాల్సిన షెడ్యూల్స్ 1, 2, 3, 4, 5ను ఉద్యోగులు గాలికి వదిలేస్తున్నారు. దీంతో తనిఖీలకు నోచుకోని బస్సులు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మొరాయిస్తున్నాయి. ఎలక్ర్టికల్ షార్ట్ సర్క్యూట్, బ్యాటరీలు పనిచేయకపోవటం, ప్రమాదాలకు గురి కావటం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
- తనిఖీలకు నోచుకోని ఆర్టీసీ బస్సులు
- షెడ్యూల్స్ 1, 2, 3, 4, 5 అమలులో తీవ్ర నిర్లక్ష్యం
- వేధిస్తున్న స్పేర్ పార్ట్స్ కొరత!
- మొక్కుబడిగా సీఎంఈ చెకింగ్
- కండీషన్‌లో లేని బస్సులతో ప్రయాణికుల అవస్థలు
రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎన్టీఆర్, కృష్ణా రీజియన్ల పరిధిలోని గ్యారేజీల పనితీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్సుల కండీషన్‌ను మెరుగుపర్చేందుకు అమలు చేయాల్సిన షెడ్యూల్స్ 1, 2, 3, 4, 5ను ఉద్యోగులు గాలికి వదిలేస్తున్నారు. దీంతో తనిఖీలకు నోచుకోని బస్సులు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మొరాయిస్తున్నాయి. ఎలక్ర్టికల్ షార్ట్ సర్క్యూట్, బ్యాటరీలు పనిచేయకపోవటం, ప్రమాదాలకు గురి కావటం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఉమ్మడి జిల్లాలో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, ఇబ్రహీంపట్నం, గవర్నర్ పేట-1, గవర్నర్‌పేట-2, విద్యాధరపురం, ఆటోనగర్, గన్నవరం, ఉయ్యూరు, గుడివాడ, అవనిగడ్డ, మచిలీపట్నం బస్ డిపోల పరిధిలోని గ్యారేజీ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్యారేజీ నుంచి రోడ్డు మీదకు వెళ్లి తిరిగి గ్యారేజీలకు వచ్చిన బస్సులను పరీక్షించటానికి ఐదు షెడ్యూల్స్‌ను గ్యారేజీ విభాగం నిర్వహించాల్సి ఉంటుంది. షెడ్యూల్ - 1, 2, 3, 4, 5 అనేవి క్రమం తప్పకుండా నిర్వహిస్తేనే ఆ బస్సు కండీషన్ బాగుంటుంది. బయట ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవటం, మొరాయించటం, అంతర్గత ఎలక్ర్టికల్ షార్ట్ సర్క్యూట్స్, బ్యాటరీలు దిగిపోవటం వంటివి జరగవు. కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సులను చూస్తుంటే ఎక్కడ ఆగిపోతాయో ఎవరికీ తెలియదు. బస్సులు ఆగిపోతే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే హై ఎండ్ బస్సులైన సూపర్ లగ్జరీ, ఇంద్ర, అమరావతి, వెన్నెల, స్లీపర్ వంటి బస్సులు కూడా ఆగిపోతుండటం, మొరాయించటం చూస్తే షెడ్యూల్స్ మాల్‌ప్రాక్టీస్ ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
ఐదు షెడ్యూల్స్ అమలు ఇలా..
- గ్యారేజీల్లో ఐదు షెడ్యూల్స్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలి.
- షెడ్యూల్-1 : బస్సు గ్యారేజీ నుంచి బయటకు వెళ్లి తిరిగి గ్యారేజీకి వచ్చిన వెంటనే దానిని పిట్ మీదకు ఎక్కించి ప్రతి అంశాన్ని చెక్ చేసి ఏమైనా సమస్యలు గుర్తిస్తే వాటిని సరిచేయాల్సి ఉంటుంది.
షెడ్యూల్-2 : ప్రతి వారం బస్సుల ఎయిర్ క్లీనర్ చెక్ చేసి మార్చాలి. ఆయిల్స్ చెక్ చేసి కొరత ఉంటే నింపాలి. గ్రీజు పెట్టాలి. వీటితో పాటు షెడ్యూల్ - 3లో చేసే పనులు కూడా చేయాల్సి ఉంటుంది.
షెడ్యూల్ - 3 : ప్రతి 3 నెలలకు లేదా 20 వేల కిలోమీటర్లు తిరిగిన ప్రతి బస్సును కూడా పూర్తిగా తనిఖీ చేయాలి. ఇంజిన్‌ను పరీక్షించాలి. ఇంజిన్ వాల్వ్స్ పనితీరును గుర్తించాలి. బ్రేకులను పరీక్షించాలి. క్లచ్ ప్లేట్ల మందాన్ని అంచనా వేసి మార్చాలి.
షెడ్యూల్-4: బస్సు 60 వేల కిలోమీటర్లు తిరిగిన ప్రతిసారీ కూడా ఇంజిన్ టెస్ట్ నిర్వహించాలి. గేర్ బాక్స్ సిస్టమ్‌ను పరిశీలించి అవసరమైతే కొత్తది ఏర్పాటు చేయాలి. క్లచ్ ప్లేట్స్ ఖచ్చితంగా మార్చాలి. ఇంజిన్ వాల్వ్స్ ఇతర అన్నింటినీ పరిశీలించాల్సి ఉంటుంది.
చేయకపోయినా.. చేసినట్టుగా చూపి..
బస్సులకు విధిగా నిర్వహించాల్సిన షెడ్యూల్స్‌ను చేయకుండానే చేసినట్టుగా చూపిస్తున్నారు. షెడ్యూల్స్ చెకింగ్ రిజిస్టర్స్, ఇతర రికార్డుల్లో జరిగిపోయినట్టుగా చూపిస్తున్నారు. బస్సులను చెక్ చేయకుండానే షెడ్యూల్స్ జరిగినట్టుగా చూపటం వల్ల మాల్ ప్రాక్టీస్ జరుగుతోంది. ఈ మాల్ ప్రాక్టీసు వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆర్టీసీకి కూడా నష్టం జరుగుతోంది.
అందుబాటులో లేని స్పేర్ పార్ట్స్
గ్యారేజీల్లో స్పేర్ పార్ట్స్ కొరత వేధిస్తోంది. తగిన విధంగా ఆయిల్ అందుబాటులో లేదు. టూల్స్ లేవు. బస్సుల కనీస మెయింట్‌నెన్స్‌కు సంబంధించి స్పేర్ పార్ట్స్ కూడా లేకపోవడంతో దీన్ని సాకుగా తీసుకుని గ్యారేజీల ఉద్యోగులు షెడ్యూల్స్‌ను సక్రమంగా నిర్వహించటం లేదు. ఆర్టీసీ బస్సులకు నిర్ణీత సమయంలో షెడ్యూల్స్ నిర్వహిస్తున్నారా లేదా అన్నది పరిశీలించటానికి వీలుగా డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (సీఎంఈ) క్రమం తప్పకుండా డిపోలకు వచ్చి తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరు గ్యారేజీలకు వచ్చినా స్పేర్ పార్ట్స్ కొరతను దృష్టిలో పెట్టుకుని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. సీఎంఈ స్థాయి అధికారులు కూడా పట్టించుకోక పోవటం వల్ల షెడ్యూల్స్ మాల్ ప్రాక్టీస్ మరింతగా పెరిగిపోతోంది.