అశ్వవాహనంపై ఆదిదంపతులు
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:56 PM
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన శ్రీశైలం క్షేత్రంలో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
రమావాణీసేవిత రాజరాజేశ్వరి అలంకరణలో భ్రమరాంబికాదేవి
పట్టువసా్త్రలు సమర్పించిన దేవదాయ శాఖ మంత్రి ఆనం
శ్రీశైలం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన శ్రీశైలం క్షేత్రంలో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు రమావాణీ సేవిత రాజరాజేశ్వరి అలంకరణలో దర్శనమిచ్చారు. రాత్రి మల్లికార్జునస్వామితో కలసి అమ్మవారు అశ్వవాహనంపై విహరించారు. రమావాణీ సేవిత రాజరాజేశ్వరి అలంకరణలో అమ్మవారు చుతుర్భుజాలను కలిగిన పాశం, అంకుశం, పద్మం, చెరుకుగడను కలిగి ఉన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం కుమారి పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా రెండు నుంచి పదేళ్లలోపు బాలికలకు పూలు, పండ్లు, నూతన వసా్త్రలు సమర్పించారు. రాత్రి ఆది దంపతులు అశ్వవాహనంపై విహరిస్తుండగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అక్కమహదేవి అలంకారం మండపం నుంచి గ్రామోత్సవం కొనసాగింది.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు: దసరా ఉత్సవాల్లో భాగంగా నిత్య కళారాధన వేదిక వద్ద పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన జయప్రదరామమూర్తి బృందం వేణుగానం, ఉమా శ్రీరామ్ బృందం భక్తిరంజిని, రాయచోటికి చెందిన కె.ప్రమీల హరికథా కాలక్షేపం ఆకట్టుకున్నాయి.
పట్టువసా్త్రలు సమర్పించిన మంత్రి ఆనం
దసర మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువసా్త్రలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్ద పట్టు వస్ర్తాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. మంత్రి వెంట శ్రీశైలం పాలకమండలి చైర్మన రమేష్ నాయుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్‌లాల్, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన, ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు స్వామిఅమ్మవార్లకు పట్టు వస్ర్తాలను సమర్పించారన్నారు. అటువంటి అవకాశం తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు.
1 ఎస్‌ఎల్‌యం 4- హెలిప్యాడ్‌లో ప్రారంభమైన పనులు
హెలిప్యాడ్ పనుల పరిశీలన
శ్రీశైలం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌డీవో నాగజ్యోతి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు సున్నిపెంటలో గల హెలిప్యాడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులపై పలు సూచనలు చేశారు. నాలుగు నుంచి ఐదు వరకు హెలిప్యాడ్ గ్రౌండ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. పారిశుధ్య పనుల్లో లోపాలు లేకుండా సరిచూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి పనులను త్వరగా పూర్తి చేయించాలన్నారు.