Share News

‘ఫిట్‌నెస్‌’పై పోరు

ABN , Publish Date - Dec 08 , 2025 | 01:06 AM

భారీ వాహనాలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన ఫిట్‌నెస్‌ చార్జీల ప్రభావం సామాన్యుడిపై పడనుంది. ఒకే సారి పది రెట్లకుపైగా చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఇచ్చిన ఉత్తర్వులపై ఉమ్మడి కృష్ణాజిల్లాలోని లారీ యజమానులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు నిరసనగా ఈ నెల తొమ్మిదో తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లారీలను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర లారీ యజమానుల సంఘం ఆదివారం ప్రకటించింది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లాలో ధాన్యం తరలింపు నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, నిర్మాణ రంగ సామగ్రి రవాణా నిలిపివేస్తామని జిల్లాలోని లారీ యజమానులు స్పష్టం చేస్తున్నారు.

‘ఫిట్‌నెస్‌’పై పోరు

- గత నెలలో చార్జీలు భారీగా పెంచిన కేంద్రం

- నిరసనగా లారీల బంద్‌కు లారీ యజమానుల సంఘం పిలుపు

- 9వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్న యజమానులు

- జిల్లాలో నిలిచిపోనున్న ఐదు వేల లారీలు

- నిత్యావసర సరుకుల రవాణాకు ఏర్పడనున్న ఆటంకం

- ఫలితంగా ధరలు పెరిగే అవకాశం

- నిర్మాణ రంగంపైనా పెనుప్రభావం

భారీ వాహనాలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన ఫిట్‌నెస్‌ చార్జీల ప్రభావం సామాన్యుడిపై పడనుంది. ఒకే సారి పది రెట్లకుపైగా చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఇచ్చిన ఉత్తర్వులపై ఉమ్మడి కృష్ణాజిల్లాలోని లారీ యజమానులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు నిరసనగా ఈ నెల తొమ్మిదో తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లారీలను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర లారీ యజమానుల సంఘం ఆదివారం ప్రకటించింది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లాలో ధాన్యం తరలింపు నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, నిర్మాణ రంగ సామగ్రి రవాణా నిలిపివేస్తామని జిల్లాలోని లారీ యజమానులు స్పష్టం చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ):

దేశంలో 13 ఏళ్లకు పైబడిన భారీ వాహనాలకు గతంలో రూ.1,340 ఉండే ఫిట్‌నెస్‌ చార్జీలను ఏకంగా రూ.33,040కి పెంచుతూ గత నెల 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఒకే సారి పెద్ద మొత్తంలో పెంచిన చార్జీలను చెల్లించలేక ఇప్పటికే జిల్లాలో చాలా వరకు లారీలు స్వచ్ఛందంగా నిలిచిపోయాయి. ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని లారీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరుకు రవాణాను నిలిపివేసి నిరసన తెలిపేందుకు సమాయత్తమవుతున్నారు.

జిల్లాలో నిలిచిపోనున్న ఐదు వేల లారీలు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రస్తుతం 10,200 లారీలు ఉన్నాయి. వీటిలో 5,150 లారీలు 13 ఏళ్లకు పైబడినవే. సాధారణంగా కొత్త లారీలు నేషనల్‌ పర్మిట్‌ను కలిగి ఉంటాయి. అవి స్థానికంగా సరుకును రవాణా చేయవు. 13 ఏళ్లు పైబడిన లారీలే స్థానికంగా సరుకు రవాణా చేస్తుంటాయి. ప్రస్తుతం రైతుల నుంచి ధాన్యాన్ని మిల్లర్‌లకు, మిల్లర్‌ల నుంచి బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాముల వరకు, పలు రకాల పంట ఉత్పత్తులను కోల్డ్‌ స్టోరీజీలకు రవాణా చేస్తుంటాయి. ఇవే కాకుండా పోర్టులు, రైల్వే యార్డ్‌ల నుంచి సరుకును స్థానిక వ్యాపారుల వరకు, మార్కెట్‌లకు కూరగాయలు, గుడ్లు, పాలు, బియ్యంతో పాటు నిర్మాణ రంగానికి అవసరమైన ఐరన్‌, ఇటుకలు, సిమెంట్‌, సాగుకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు తదితరాల రవాణా బాధ్యతను ఈ తరహా లారీలు నిర్వర్తిస్తుంటాయి. ప్రజలకు అవసరమయ్యే ప్రతి వస్తువును ఉత్పత్తిదారుల నుంచి వ్యాపారుల వరకు 13 ఏళ్లు పైబడిన లారీల ద్వారానే రవాణా జరుగుతుంది. గుంటూరు జిల్లాలోని మందడం, ఉండవల్లి తదితర ప్రాంతాల నుంచి ప్రతి రోజూ లారీలు కూరగాయలను విజయవాడ నగరానికి తీసుకొస్తాయి. విశాఖపట్నం నుంచి ప్రతి రోజూ వందకుపైగా లారీలు ఐరన్‌ను తీసుకొస్తాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ల నుంచి రేషన్‌ షాపులకు బియ్య, పంచదార, గోదాములను ఈ లారీలే సరఫరా చేస్తాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి పాలను సేకరించి, మిల్క్‌ ప్రాజెక్ట్‌లకు తీసుకెళ్లడం, అక్కడ నుంచి పాల ప్యాకెట్‌లను తిరిగి ప్రజల చెంతకు చేర్చడంలోనూ కీలకంగా వ్యవహరిస్తాయి. అంతేకాకుండా నగరంలోని పేరుగాంచిన ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలకు చెందిన లారీలు సైతం 15 ఏళ్లకు పైబడినవే ఉన్నాయి. లారీల బంద్‌తో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే దుస్తులు, పాదరక్షులు, ఇతర వస్తువుల రవాణా ఆగిపోతుంది.

రోజుకు రూ.20 కోట్లకుపైగా నష్టం:

లారీలు నిలిచిపోవడంంతో రోజుకు రూ.20 కోట్లకుపైగా ప్రజలు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా నష్టపోతారని లారీ యజమానులు చెబుతున్నారు. వస్తువుల కొరత ఏర్పడి ఽపెరిగే ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆర్థికంగా కుంగదీస్తాయి. అరకొరగా దొరికే కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం ప్రజలు క్యూలో నిలబడే పరిస్థితులు తలెత్తుతాయి. నిర్మాణ రంగం పనులు నిలిచిపోయే అవకాశం ఉండటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. రైతుల ధాన్యం కల్లాల్లోనే నిలిచిపోయే ప్రమాదం ఉంది. రవాణా శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఒక్కో లారీపై 23 కుటుంబాలు ప్రత్యక్ష్యంగా ఆధారపడి ఉంటాయి. లారీ యజమాని నుంచి డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు ఎన్నో సరుకు ఎగుమతి, దిగుమతి చేసే ముఠా కూలీల కుటుంబాలు ఉపాధి కోల్పోతాయి.

Updated Date - Dec 08 , 2025 | 01:06 AM