Share News

చంపి వైరా నదిలో పడేసిన తండ్రి

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:28 AM

మైలవరంలో సంచలనం రేపిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. మైలవరం పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు వివరాలను సీఐ దాడి చంద్రశేఖర్‌ శనివారం మీడియాకు వెల్లడించారు.

 చంపి వైరా నదిలో పడేసిన తండ్రి

- మైలవరం మైనర్‌ బాలిక కేసును ఛేదించిన పోలీసులు

- వివరాలు వెల్లడించిన సీఐ దాడి చంద్రశేఖర్‌

మైలవరం రూరల్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):

మైలవరంలో సంచలనం రేపిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. మైలవరం పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు వివరాలను సీఐ దాడి చంద్రశేఖర్‌ శనివారం మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మైలవరంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న చిందే బాజికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కుమార్తెలు. రెండో భార్య నాగేంద్రమ్మకు గాయత్రీ(14) అనే కుమార్తె ఉంది. స్థానిక బాలికల హైస్కూల్లో 7వ తరగతి చదివి మానేసింది. నాగమ్మ, ఆమె కుమార్తెలతో కలిసి గాయత్రీ శాంతినగర్‌లో నివాసం ఉంటుంది. బాజికి నూజివీడు జైలులో పరిచయమైన నూజివీడుకు చెందిన రోహిత అనే వ్యక్తిని ఉల్లిపాయల వ్యాపారం కోసం బాజి తోడుగా తెచ్చుకున్నాడు. రోహితతో గాయత్రీ చనువుగా ఉండటాన్ని గమనించిన బాజి పలుమార్లు కుమార్తె గాయత్రీని మందలించాడు. ఆగస్టు 31వ తేదీన మరోమారు మందలించగా, గాయత్రీలో మార్పు రాకపోగా ఎదురు సమాధానం చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాజి ఇనుప రాడ్డుతో గాయత్రీని కొట్టగా తీవ్రగాయమై ఆమె చనిపోయింది. గాయత్రీ మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఆటోలో తీసుకెళ్లి మధిర - సిరిపురం బ్రిడ్జిపై నుంచి వైరా నదిలో పడేశాడు. ఆ తర్వాత తాను మందలిస్తే గాయత్రీ ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని స్థానికులు, బంధువులను నమ్మించాడు. ఈ క్రమంలో తిరువూరు, తెలంగాణలోని భద్రాచలం ఏజెన్సీలోని వెంకటాపురంలో బాజి తలదాచుకున్నాడు. ఈ క్రమంలో తన చెల్లెలు నాగేంద్రమ్మ కుమార్తె చిందే గాయత్రీ కనిపించడం లేదని ఈ నెల 3న పినపాకకు చెందిన పోతర్లంక స్వప్న అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తండ్రిపై అనుమానం వ్యక్తం చేసింది. మొదటి భార్య నాగమ్మ, ఆమె కుమార్తెలు కూడా కనిపించకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. బాజిని అదుపులోకి తీసుకుని విచారించగా, తానే కుమార్తెను చంపినట్టు ఒప్పుకున్నాడు. బాజిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు డ్రోన్‌తో నదిలో గాలించినా ఆచూకీ లభించలేదు. కేసు దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించిన ఎస్సై కె.సుధాకర్‌, ఇతర సిబ్బందిని సీఐ అభినందించారు. కాగా, మే 30వ తేదీన గంజాయి కేసులో భర్తతో కలిసి జైలుకు వెళ్లిన నాగేంద్రమ్మ ఇంకా జైలులోనే ఉంది.

Updated Date - Sep 14 , 2025 | 01:28 AM