Share News

కంది రైతు విలవిల

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:05 PM

ప్రస్తుతం సాగు చేసిన కంది పంట ఆశాజనకంగా కనిపించినా అధిక వర్షాలతో పంటకు కాయ ఈగ, శనగపచ్చ పురుగు, మారుకా మచ్చపురుగు సోకింది.

   కంది రైతు విలవిల
పూత పట్టిన కంది పంట

అధిక వర్షాలతో పంటకు ఆశించిన పురుగులు

రాలిపోతున్న పూత

దిగుబడులు తగ్గిపోతాయని ఆందోళన

జిల్లాలో 95,262 ఎకరాల్లో కంది పంట సాగు

గోనెగండ్ల, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం సాగు చేసిన కంది పంట ఆశాజనకంగా కనిపించినా అధిక వర్షాలతో పంటకు కాయ ఈగ, శనగపచ్చ పురుగు, మారుకా మచ్చపురుగు సోకింది. కంది రైతు విలవిలలాడుతున్నాడు. కంది పంటకు ఈ ఏడాది గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశలో జిల్లా వ్యాప్తంగా 95, 262 ఎకరాల్లో సాగుచేశారు. గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు, మంత్రాలయం మండలాల్లో బావులు, బోర్ల కింద దాదాపు 8000 ఎకరాల్లో కందిని వేశారు. చాలామంది రైతులు వేరుశనగతో పాటు ఇతర పంటలో కూడా అంతర్‌పంటగా కూడా వేశారు. గోనెగండ్ల, కులుమాల, అలువాల, పెద్దమరివీడు, చిన్నమరివీడు, వేముగోడు, పుట్టపాశం, పెద్దనేలటూరు, చిన్ననేలటూరు, తిప్పనూరు, హెచ్‌ కైరవాడితో పాటు పలు గ్రామాల్లో కంది పంటను సాగుచేశారు. ప్రస్తుతం సోకిన పురుగుకు ఎన్ని మందులు పిచికారి చేసినప్పటికీ అదుపులోకి రావడంలేదు. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. శనగపచ్చ పురుగు, కాయ ఈగ, జీడపురుగు, మారుకామచ్చ తెగులు ఎక్కువగా ఉండటంతో పూత మొత్తం రాలిపోతుంది. దిగుబడులు తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకునేలా వ్యవసాయశాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.

మారుకామచ్చ పురుగు

ఈ పురుగు ఎక్కువగా సోకినట్లు తెలుస్తుంది. ఈ పురుగు రెక్కలు పురుగు గుడ్లనుంచి పొదిగిన లార్వాలు ఆకులు, పూత మరియు కాయలను లోపల నుంచి తిని నష్టం చేస్తాయి. ఈ పురుగు నివారణకు ఏమమెక్టినబెంజోఎట్‌ 0.3 గ్రాములు లేదా నోవాలురాన మిల్లీ లీటర్‌ లేదా ఆంప్టిగో 1 మిల్లీ లీటర్‌ ను ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

కాయ ఈగ

ఈ పురుగు కనబడకుండా చాలా నష్టం నలుగజేస్తుంది. తన గుడ్లును కాయ చర్మం తొలిచి అక్కడ పెడుతుంది. వాటి నుంచి పొదిగిన పిల్ల పురుగులు లోపల నుంచి కాయలను తిని నష్టం కలిగిస్తాయి. ఈపురుగు నివారణకు ముందస్తుగా అసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా థయాక్లోఫ్రిడ్‌ 0.7 గ్రాములు ఒక లీటర్‌ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

శనగపచ్చ పురుగు

ఈ పురుగు లార్వాలు కాయలపై రంధ్రం చేసుకొని లోపలికి వెళ్లి తిని నష్టం కలిగిస్తాయి. ఈ పురుగు నివారణకు ఏమమేస్టిన బెంజోఎట్‌ 0.3 గ్రాములు లేదా స్పినోసాడ్‌ 0.3 మిల్లీ లీటర్లు ఒక లీటర్‌ నీటిలో మరియు 2శాతం బెల్లం ద్రావణం కలుపుకొని సాయంత్రం వేళల్లో పిచాకారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అధికారులు సలహాలివ్వాలి

పురుగులతో పూత మొత్తం రాలిపోతుంది. ఎన్నిమందులు పిచికారి చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అధికారులు పంటలను పరిశీలించి సలహాలివ్వాలి. ఏ మందు పిచికారి చేయాలి ఎంత చేయాలనే విషయాన్ని వివరించాలి.

ఫ మాబు, రైతు, గోనెగండ్ల

సకాలంలో పిచికారి చేయాలి

రైతులు సకాలంలో పురుగును గుర్తించి మందులు పిచికారి చేయాలి. గోనెగండ్ల మండలంలో కంది పంటకు దోమ, శనగపచ్చ పురుగు సోకింది. కంది పంట ఏపుగా పెరిగింది. మామూలు పద్ధతిలో కాకుండా డ్రోన ద్వారా పిచికారి చేస్తే మందు, ద్రావణం మొక్క పైభాగంలో చేరుతాయి. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడి బాగా వస్తుంది.

ఫ మహుమ్మద్‌ ఖాద్రీ, ఏడీఏ, ఎమ్మిగనూరు.

Updated Date - Oct 22 , 2025 | 11:05 PM