రైతు బేజారు!
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:46 AM
పండించిన రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందించాలనే లక్ష్యంతో జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు బజార్లు అధ్వానంగా తయారయ్యాయి. నాసిరకం కూరగాయలు తెచ్చి విక్రయిస్తూ, పట్టికలో నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తూ, తూకాల్లో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను బేజారెత్తిస్తున్నాయి. అసలైన రైతుల కన్నా దళారులు, నకిలీ రైతులతో నిండిపోయాయి. రైతు బజార్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
- జిల్లాలోని రైతు బజార్లలో ఇష్టారాజ్యం
- నాసిరకం కూరగాయలు తెచ్చి విక్రయాలు
- పట్టికలోని ధరల కంటే అధికంగా వసూలు
- రైతుల కన్నా దళారులవే అధికంగా దుకాణాలు
- తూకాల్లో భారీగా తేడాలు
- దుకాణాల్లో నకిలీ రైతుల హడావిడి
- పట్టించుకోని ఎస్టేట్, తూనికలు, కొలతలశాఖ అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు
పండించిన రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందించాలనే లక్ష్యంతో జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు బజార్లు అధ్వానంగా తయారయ్యాయి. నాసిరకం కూరగాయలు తెచ్చి విక్రయిస్తూ, పట్టికలో నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తూ, తూకాల్లో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను బేజారెత్తిస్తున్నాయి. అసలైన రైతుల కన్నా దళారులు, నకిలీ రైతులతో నిండిపోయాయి. రైతు బజార్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలోని రైతు బజార్లలో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఇది తమ పని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రైతుల ముసుగులో ఏళ్లతరబడి తిష్టవేసి సిండికేట్‌లుగా మారిన కొందరు వ్యాపారులే కూరగాయల ధరలను నిర్ణయించి విక్రయాలు జరుపుతున్నారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను సరైన ధరలకు విక్రయించేలా చూడాల్సిన రైతుబజార్ ఎస్టేట్ అధికారులు మిన్నకుండిపోతున్నారు. జేసీతో పాటు ఆర్డీవోలు, తహసీల్దార్‌లు, రైతు బజార్లలో వినియోగదారుల కమిటీ సభ్యులు, మార్కెటింగ్ విభాగం అధికారులు ఎవ్వరూ నెలల తరబడి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతుబజార్లలో నకిలీ రైతుల ముసుగులో ఉన్న కొందరు వ్యాపారులు నిర్ణయించిన ధరలనే అమలు చేస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాసిరకం కూరగాయలు
రైతు బజార్‌ల పక్కనే ఉన్న బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన కూరగాయలు లభిస్తుంటే ఇక్కడ మాత్రం అత్యంత నాసిరకం కూరగాయలను విక్రయిస్తున్నారు. వంకాయలు, బెండకాయలు, బంగాళ దుంపలు తదితర కూరగాయలు కొనుగోలు చేస్తే అందులో సగం పాడైనవే ఉంటున్నాయి. మచిలీపట్నంలో రెండు, ఉయ్యూరు. చల్లపల్లి, పెడన, కూచిపూడి, పామర్రు, గన్నవరం, కంకిపాడు, గుడివాడలో ఒక్కోటి చొప్పున రైతు బజార్లు ఉన్నాయి. ఎస్టేట్ అధికారులు వీటిని పర్యవేక్షించాల్సి ఉంది. తెల్లవారు జాము ఐదు గంటల నుంచే కూరగాయల విక్రయాలు ప్రారంభమవుతాయి. ఎస్టేట్ అధికారులు విధుల్లోకి వచ్చేలోపే రైతుల ముసుగులో ఉన్న దళారులు కూరగాయల ధరలు నిర్ణయించేసి విక్రయాలు జరిపేస్తారు. ధరల పట్టికల్లో ఉదయం ఏడు, ఎనిమిది గంటలకు వివిధ రకాల కూరగాయల ధరలను సూచిస్తూ బోర్డ్డులపై రాసే సమయానికి సగం వ్యాపారం పూర్తవుతోంది.
అపరిశుభ్ర వాతావరణంలో అమ్మకాలు
జిల్లాలో మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల, తోట్లవల్లూరు, కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు తదితర మండలాల్లో కూరగాయల తోటలలో పండించే నాణ్యమైన కూరగాయలను కార్పొరేట్ స్థాయి వ్యాపార సంస్థలకు విక్రయించేస్తున్నారు. నాసిరకం కూరగాయలను మాత్రం రైత ుబజార్లకు తరలించి విక్రయాలు జరుపుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న రైతుబజార్లలో నాసిరకం కూరగాయలను కొనుగోలు చేసి అనారోగ్యం పాలవ్వాల్సి వస్తోందని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లలో ఏం జరుగుతోంది, ఎలాంటి కూరగాయలు విక్రస్తున్నారనే అంశంపై ఇటీవల కాలంలో అధికారులు సమావేశాలు నిర్వహించి ఎస్టేట్ అధికారులకు తగు సూచనలు ఇచ్చిన దాఖలాలు లేవు. తహసీల్దార్‌లు తమను ప్రసన్నం చేసుకున్న వారిని రైతులుగా, కౌలు రైతులుగా చూపి రైతు బజార్లలో కూరగాయలు విక్రయించేందుకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. అనుమతులు తీసుకున్న వారు ఒకరైతే కూరగాయలు విక్రయుంచే వారు మరొకరు ఉండటం సర్వసాధారణమైంది. ఉల్లి, టమాటాల ధరలు పెరిగినపుడు మాత్రం తక్కువ ధరలకే వీటిని రైతుబజార్లలో విక్రయిస్తున్నట్లుగా అధికారులు ప్రకటనలు జారీ చేసి, తమ పని అయిపోయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రైతు బజార్లను నెలకోసారైనా ఆకస్మికంగా తనిఖీ చేసి వాస్తవాలు తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
నిద్ర మత్తులో తూనికలు, కొలతలశాఖ
జిల్లాలో తూనికలు, కొలతలశాఖ అఽధికారులు నిద్రమత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు బజార్లతోపాటు బహిరంగ మార్కెట్‌లోనూ తూకంలో పలు మోసాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఏదైనా ఒక దుకాణానికి వెళ్లి శాంపిళ్లను సేకరించడం, అనంతరం సంబంధిత వ్యాపారులను తమ కార్యాలయానికి వచ్చి మాట్లాడుకోవాలని చెప్పడం ఆనవాయితీగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.