పేదల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యాదాత అస్తమయం
ABN , Publish Date - Jun 07 , 2025 | 01:15 AM
చల్లపల్లి రాజా తనయుడు, మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యుడు శ్రీమంతు రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ (86) శుక్రవారం ఉదయం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని స్వగృహంలో కన్నుమూశారు.
- కోయంబత్తూరులోని స్వగృహంలో వృద్ధాప్యంతో చల్లపల్లి రాజా తనయుడు అంకినీడు ప్రసాద్ కన్నుమూత
- ఎంపీగా, ఆలయాలకు ట్రస్టీగా, హైస్కూల్ కరస్పాండెంట్‌గా విశేష సేవలు
- మంత్రి నారా లోకేశ్ సంతాపం
చల్లపల్లి/వన్‌టౌన్/విజయవాడ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):
చల్లపల్లి రాజా తనయుడు, మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యుడు శ్రీమంతు రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ (86) శుక్రవారం ఉదయం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. అంకినీడు ప్రసాద్ అప్పుడప్పుడూ చల్లపల్లి కోటకు వచ్చి కొన్నాళ్లు ఇక్కడ ఉండేవారు. చల్లపల్లిలోని శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్(ఎస్‌ఆర్‌వైఎస్‌పీ) హైస్కూల్ అండ్ కళాశాలకు ఆయన కరస్పాండెంట్‌గా ఉన్నారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేశారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాలైన మోపిదేవి సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయం, పెదకళ్లేపల్లి దుర్గా నాగేశ్వరస్వామి ఆలయం, శ్రీకాకుళం శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయం, యార్లగడ్డ శివాలయానికి ట్రస్టీగా కొనసాగుతున్నారు.
బందరు ఎంపీగా సేవలు
1967లో భారత పార్లమెంటుకు నాల్గవసారి జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అంకినీడు ప్రసాద్ 60 వేల పైచిలుకు ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. 1967-72 మధ్య బందరు ఎంపీగా ప్రజలకు సేవలు అందించారు.
రేపు మచిలీపట్నంలో అంత్యక్రియలు
అంకినీడు ప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం మచిలీపట్నం శివగంగలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కోయంబత్తూరు నుంచి ఆయన భౌతికకాయాన్ని శనివారం ఉదయం హైదరాబాద్‌కు, అక్కడ నుంచి రోడ్డుమార్గంలో మధ్యాహ్నానికి చల్లపల్లి తీసుకురానున్నారు. ప్రజల సందర్శనార్థం చల్లపల్లి రాజా హైస్కూల్‌లో భౌతికకాయాన్ని ఉంచి రాత్రికి శివగంగ తీసుకువెళతారు. ఆదివారం ఉదయం శివగంగలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంకినీడు ప్రసాద్ కుమార్తె అమెరికా నుంచి ఆదివారం ఉదయం శివగంగకు చేరుకుంటారు.
పేదల విద్యాభివృద్ధికి విశేష కృషి : మంత్రి నారా లోకేశ్
రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ మృతి పట్ల రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక సందేశంలో విద్య, రాజకీయ, సామాజిక రంగాలలో అంకినీడు ప్రసాద్ చేసిన విశేష సేవలను కొనియాడారు. చల్లపల్లిలో ఎస్‌ఆర్‌వైఎస్‌పి జూనియర్ కళాశాల కరస్పాండెంట్‌గా పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. జమిందార్ వ్యవస్థలో ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచిన చరిత్ర చల్లపల్లి జమీందారు, ఆయన వంశీయులకే సొంతమని పేర్కొన్నారు. మోపిదేవి, శ్రీకాకుళం, పెదకళ్లేపల్లి, యార్లగడ్డ, శివగంగ ప్రాంతాలలో దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన మరణం చల్లపల్లి ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎమ్మెల్యేలు బుద్ధప్రసాద్, యార్లగడ్డ సంతాపం
అంకినీడు ప్రసాద్ మృతిపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రగాఢ సంతాపం తెలిపారు. జమిందారు వ్యవస్థలోనూ, ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ ప్రజలకు సేవ చేసిన ఘనచరిత్ర చల్లపల్లి జమిందారు వంశీయుల సొంతమన్నారు. అంకినీడు ప్రసాద్ మృతి చల్లపల్లి ప్రాంతానికి తీరనిలోటని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ప్రసాద్ బహద్దూర్ మరణం తమ కుటుంబానికి, సమాజానికి తీరని లోటన్నారు. 2007లో వీరంకిలాకులో తాము ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, 2015లో ఉయ్యూరులో చారిటబుల్ ట్రస్ట్ కార్యకలాపాలను ఆయనే ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ప్రజాసేవ, నిస్వార్థ సహకారంతో అందరికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.