Share News

దాత ఆశయం ఆవిరి

ABN , Publish Date - May 23 , 2025 | 12:55 AM

తోట్లవల్లూరు ప్రజల అవసరాల కోసం జమిందారు గ్రామ పంచాయతీకి ఇచ్చిన 34 సెంట్ల స్థలం ఆక్రమణలకు గురైంది. దానంగా ఇచ్చిన స్థలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తి తన సొంతమని కోర్టులో దావా వేయగా పంచాయతీ గెలిచింది. కేసు గెలిచిన తర్వాత తనకెందుకన్నట్టు నిర్లక్ష్యంగా ఉండటంతో స్థానికులు ఆక్రమించి వ్యాపారాలు చేయటం, వాహనాలను పార్కింగ్‌ చేయటం సాగిస్తున్నారు. దీనిపై గ్రామానికి చెందిన చింతా రాజా స్పందించి స్థలాన్ని రక్షించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శికి గురువారం వినతి పత్రం అందించారు.

దాత ఆశయం ఆవిరి

-ప్రజా అవసరాలకు 34 సెంట్ల స్థలం పంచాయతీకి అప్పగింత

-ప్రైవేటు వ్యక్తి దావాపై కోర్టులో కేసు గెలిచిన పంచాయతీ

-ఆ తర్వాత స్థలం భద్రత గాలికి వదిలేసిన అధికారులు

-అడుగు పెట్టేందుకు వీల్లేకుండా వెలిసిన ఆక్రమణలు

-చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి వినతి

తోట్లవల్లూరు ప్రజల అవసరాల కోసం జమిందారు గ్రామ పంచాయతీకి ఇచ్చిన 34 సెంట్ల స్థలం ఆక్రమణలకు గురైంది. దానంగా ఇచ్చిన స్థలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తి తన సొంతమని కోర్టులో దావా వేయగా పంచాయతీ గెలిచింది. కేసు గెలిచిన తర్వాత తనకెందుకన్నట్టు నిర్లక్ష్యంగా ఉండటంతో స్థానికులు ఆక్రమించి వ్యాపారాలు చేయటం, వాహనాలను పార్కింగ్‌ చేయటం సాగిస్తున్నారు. దీనిపై గ్రామానికి చెందిన చింతా రాజా స్పందించి స్థలాన్ని రక్షించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శికి గురువారం వినతి పత్రం అందించారు.

తోట్లవల్లూరు, మే 22 (ఆంధ్రజ్యోతి):

తోట్లవల్లూరు పూర్వం జమిందారుల ఏలుబడిలో ఉండేది. జమిందారు బొమ్మదేవర నాగన్ననాయుడు వంశీకులు పాలించారు. వేల ఎకరాలు జమిందారు ఆధీనంలో ఉండేవి. జమిందారులు పాలనా సౌలభ్యం కోసం 1900వ సంవత్సంలో తోట్లవల్లూరును నార్తువల్లూరు, సౌత వల్లూరు గ్రామాలుగా విభజించారు. వారి కోటల ఎదుట విశాలమైన 34 సెంట్ల స్థలం ఉండేది. అయితే కాలక్రమంలో జమిందారులు కనుమరుగు కావటంతో వారి కుటుంబీకులు కోటలను తొలగించి సుమారు 40 ఎకరాల లేఅవుట్‌ వేసి గ్రామస్తులకు విక్రయించారు. కోట ఎదుట ఉన్న 34 సెంట్ల స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగాను, లే అవుట్‌ స్థలాలను కొనుగోలు చేసిన ప్రజల రాకపోకల నిమిత్తం పంచాయతీకి దానంగా ఇచ్చారు. అయితే ఈ 34 సెంట్ల స్థలంపై గ్రామంలోని ఓ వ్యక్తి కోర్టులో కేసు వేసి తన స్థలంగా వాదించాడు. దీంతో గ్రామ పంచాయితీ, లే అవుట్‌ స్థలాల ప్రజలు ఉమ్మడిగా కోర్టుకు వెళ్లారు. ఈ కేసు ఇరుపక్షాల మధ్య చాలా కాలం నడవగా చివరికి పంచాయతీకి, లే అవుట్‌ స్థలాల ప్రజలకు అనుకూలంగా 2020 జనవరి 10వ తేదీన 1112/2008 ద్వారా విజయవాడ సీనియర్‌ సివిల్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు పత్రాలు లే అవుట్‌ స్థలాల ప్రజల వద్ద ఉన్నాయి. ఈ 34 సెంట్లను పబ్లిక్‌ స్థలంగా ఉంచాలని, స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని, ఎవ్వరూ ఆక్రమణలకు పాల్పడ కూడదని, స్థలాన్ని పంచాయతీ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశిస్తు కోర్టు తీర్పు ఇచ్చిందని కోర్టులో విజయం సాధించిన చింతా రాజా తెలిపారు.

ఆక్రమణల పర్వం

పంచాయతీ గెలిచిన 34 సెంట్ల స్థలం కోట్లాది రూపాయల విలువ చేస్తుంది. బంగారంతో సమానంగా మారింది. గతంలో ఆర్టీసీ బస్సులు ఈ స్థలంలో నిలిపి ప్రయాణికులను తీసుకెళ్లేవారు. గ్రామస్తులు కబడ్డీ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఈ స్థలంలో నిర్వహించేవారు. ఆర్టీసీ బస్సులకు తగిన నిలువ నీడ లేకపోవటంతో పక్కనే ఉన్న పొట్లూరి రమేష్‌ తన 12 సెంట్ల స్థలాన్ని ఉయ్యూరు ఆర్టీసీ డిపోకు రిజిస్టర్‌ చేశారు. అయితే ప్రజోపయోగాల కోసం పంచాయతీకి ఇచ్చిన స్థలం చుట్టూ ఆక్రమణలు వెలుస్తున్నాయి. కూరగాయల దుకాణం, ప్రైవేటు వాహనాల పార్కింగ్‌ అడ్డదిడ్డంగా చేస్తుండటంతో కనీసం ఆర్టీసీ బస్సు స్వేచ్ఛగా ఈ స్థలంలోకి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్‌టి రామారావు సీఎంగా ఉన్నపుడు మద్యనిషేదం విధించారు. ఆ సమయంలో మద్యంతో పట్టుబడిన రాషే్ట్రతర లారీని పోలీసులు పట్టుకుని సీజ్‌ చేసి ఈ స్థలంలో పెట్టారు. ఈ లారీ పాడుపడిపోయి చాలా స్థలాన్ని ఆక్రమించింది. దీంతో 34 సెంట్ల స్థలం ప్రజలకు ఉపయోగం లేకుండా మారింది.

కార్యదర్శికి వినతి పత్రం అందజేత

జమిందారు లే అవుట్‌ స్థల యజమాని చింతా రాజా గురువారం తోట్లవల్లూరు పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ను కలిసి 34 సెంట్ల పబ్లిక్‌ స్థలాన్ని కోర్టుతీర్పుకు అనుగుణంగా రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ స్థలం నుంచే పీహెచ్‌సీకి వెళ్లే రోడ్డు ఉందని, దానిని కూడా సీసీరోడ్డుగా అభివృద్ధి చేసేందుకు పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయాలని కోరారు. వినతి పత్రంతో పాటు కోర్టు తీర్పు నకళ్లను కార్యదర్శికి అందించినట్టు రాజా తెలిపారు.

Updated Date - May 23 , 2025 | 12:55 AM