Share News

వీడిన వ్యక్తి అదృశ్యం మిస్టరీ

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:09 AM

తన భర్త కనిపించడంలేదని భార్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు ఆస్తులవిషయంలో తలెత్లిన వివాదంలో దాయాదుల చేతిలో హత్యకు గురైనట్లు గుర్తించారు.

   వీడిన వ్యక్తి అదృశ్యం మిస్టరీ
లంకాయపల్లి చెరువులో స్వాధీనం చేసుకున్న ఎముకలు, పుర్రె

ఆస్తుల విషయంలో దాయాదుల మధ్య వివాదం

అడ్డు తొలగించుకోవాలని హత్యకు పథకం రచించిన బంధువులు

చక్కరాళ్ల గ్రామ సర్పంచకు రూ1.30 లక్షలకు కాంట్రాక్టు

మద్యం తాగడానికి తీసుకెల్లి హత్య చేసిన కిరాయి ముఠా

మృతదేహాన్ని ప్యాపిలి వద్ద లంకాయపల్లిలో పూడ్చిపెట్టిన దాయాదులు

పత్తికొండ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తన భర్త కనిపించడంలేదని భార్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు ఆస్తులవిషయంలో తలెత్లిన వివాదంలో దాయాదుల చేతిలో హత్యకు గురైనట్లు గుర్తించారు. పత్తికొండ మండలంలోని చక్కరాళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలను పత్తికొండ సిఐ జయన్న ఆదివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. చక్కరాళ్ల గ్రామానికి చెందిన లింగాయపల్లి పద్మనాభరెడ్డికి (37) క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామానికి చెందిన శిరీషతో వివాహయింది. రాతిదూలం పోటీలలో ఎద్దులను తొలడం వృత్తిగా చేసే పద్మనాభరెడ్డి ఆ వృత్తి కోసం నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండేవాడు. తన భర్త పద్మనాభరెడ్డి ఈ ఏడాది మే 13 నుంచి కనిపించడం లేదని ఆయన భార్య ఈ నేపథ్యంలో ఆగస్టు 28న ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వ్యక్తి అదృశ్యం కింద పత్తికొండ పోలీస్‌స్టేషనలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. గ్రామంలో అనుమానితులతో పాటు ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తులను స్టేషనకు పిలిపించి విచారణ చేశారు. గ్రామంలో స్థలం విషయంలో దాయాదులతో మే 5వ తేది పద్మనాభరెడ్డికి వివాదం జరిగినట్లు ఆ వివాదంలో దాయాదులు రాజశేఖర్‌రెడ్డి, రామక్రిష్టారెడ్డి మరికొందరితో కలసి ఆయనపై దాడిచేసినట్టు విచారణలో గ్రామస్థులు తెలపడంతో ఆవ్యక్తుల కోసం పోలీసులు గాలింపుచేపట్టారు. భయపడ్డ నిందితులు రాజశేఖర్‌రెడ్డి, రామక్రిష్టారెడ్డితో పాటు గ్రామ సర్పంచ శ్రీరాములు శనివారం గ్రామ వీర్వో తలారి క్రిష్ణ వద్దలొంగిపోయి తామే పద్మనాభరెడ్డిని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను ఆయన పత్తికొండ సీఐ జయన్నకు అప్పగించారు. విచారణలో నిందుతులు హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

హత్యకు పథకం ఇలా..

గ్రామంలో తనకు సంబందించిన 40సెంట్ల స్థలాన్ని హతుడు పద్మనాభరెడ్డి సెంటు రూ .40వేల చొప్పున గ్రామస్థులు కొందరికి విక్రయించాడు. అందుకోసం వారి వద్ద నుంచి రూ. 1.30 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నీ ఇప్పటికే అమ్ముకున్నావని ఈస్థలాన్ని అమ్మేందుకు తాము అంగీకరించబోమని దాయాదులు రాజశేఖర్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి అడ్డుకున్నారు. దీంతో మే 5న వారిమద్య వివాదం జరిగింది. ఈవివాదంలో రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డిలో మరికొందరితో కలసి ఇనుపరాడ్డుతో దాడిచేసి తీవ్రంగా గాయపడిని పద్మనాభరెడ్డిని ఆటోలో ఆయన తండ్రి ఉండే రాంపురం గ్రామంలో వదిలివేశారు. గాయాలనుండి తేరుకున్న పద్మనాభరెడ్డి తనపై దాడిచేసిన వారిని వదలబోనని కొందరు గ్రామస్థులతో చెప్పడంతో అతనినుండి తమకు హాని ఉందని భావించిన దాయాదుల హత్యచేయాలని నిర్ణయించుకుని ఇందుకోసం గ్రామ సర్పంచ శ్రీరాములు (వైసీపీ)కు రూ 1..30 లక్షలు కాంట్రాక్టు ఇచ్చారు. దీంతో పద్మనాభరెడ్డిని హత్యచేసేందుకు పథకం రిచించిన సర్పంచ శ్రీరాముడు తమ్ముడు సిద్ధరాముడుతోపాటు గంపఆయ్యన్న, ఎద్దులదొడ్డి శ్రీరాములు, ప్రసాద్‌తో పాటు మరికొందరు రాంపురం సమీపంలో ఉన్న సుంకులమ్మ దేవాలయం వద్ద మద్యంసేవించేందుకు పద్మనాభరెడ్డిని తీసుకెల్లి రాళ్లతో కాళ్లపై దాడిచేసి లుంగీని గొంతుకు బిగించి హత్యచేసి మృతదేహాన్ని అక్కడే వదిలివెల్లిపోయారు. అయితే మృతదేహాన్ని ఆక్కడే వదిలేస్తే ఎలా అని కాంట్రాక్టు ఇచ్చిన దాయాదులు ప్రశ్నించారు. మీరు ఇచ్చిన డబ్బుకు అంతకంటే పనిచేయలేమని సర్పంచ శ్రీరాములు వారికి సమాధానం ఇవ్వడంతో రాజశేఖర్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి పద్మనాభరెడ్డి మృతదేహాన్ని ప్యాపిలి సమీపంలో లంకాయపల్లి చెరువులో గడ్డిపొదలనడుమ పూడ్చివేసి దానిపై రాళ్లుపెట్టారు. విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం పత్తికొండ తహసీల్దార్‌, డోన అగ్నిమాఫకశాఖ సిబ్బంది, పోరెన్సిక్‌ సిబ్బందిల సమక్షంలో లంకాయపల్లి చెరువులో పద్మనాభరెడ్డి పుర్రె, ఎముకలను వెలికితీశారు. నంద్యాల మెడికల్‌ కళాశాల ఫ్రొఫెసర్‌ హరికృష్ణ ఆద్వర్యంలో శవపంచానామా నిర్వహించామని, పుర్రె, ఎముకలు గుర్తుపట్టలేని పరిస్థితులలో ఉండడంతో వాటిని డీఎనఏ పరీక్షలకు పంపుతున్నామని సీఐ జయన్న తెలిపారు. ఈ హత్యకు సంబంధించి రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సర్పంచ శ్రీరాములును కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. ఈహత్యకేసుకు సంబంధించి మరో 11 మందిని అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు.

Updated Date - Sep 22 , 2025 | 12:09 AM