Share News

కన్సల్టెన్సీల క‘హాని’లు

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:15 AM

వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ఓ వ్యక్తి విజయవాడలో కన్సల్టెన్సీని ప్రారంభించాడు. ఆ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకుని అభ్యర్థులు బయటకు వస్తున్నారు తప్ప ఉపాధి మాత్రం దొరకడంలేదు. కొద్దినెలలుగా అభ్యర్థులు దీనిపై గొడవ చేస్తున్నారు. ఉపాధి కల్పించలేనప్పుడు చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కన్సల్టెన్సీ యజమానిని పోలీసులు పిలిపించి విచారించారు. ఉత్తరాదికి చెందిన మరో కన్సల్టెన్సీకి ఉపాధి నిమిత్తం డబ్బులు చెల్లించానని వివరించాడు. పోలీసులు ఆ కన్సల్టెన్సీ సంస్థపై కేసు నమోదు చేశారు. అప్పటికే మోసం జరిగిందని తెలిసినా విజయవాడలో కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న వ్యక్తి మాత్రం అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఆపలేదు. బాధితులు ఇప్పటికీ ఆ కన్సల్టెన్సీ అధినేత చుట్టూ తిరుగుతున్నా న్యాయం మాత్రం జరగడం లేదు.

కన్సల్టెన్సీల క‘హాని’లు

శిక్షణ, ఉపాధి పేరుతో బెజవాడలో వెలుస్తున్న కన్సల్టెన్సీలు

అభ్యర్థుల నుంచి రూ.లక్షల వసూలు

తూతూమంత్రంగా శిక్షణ.. ఉపాధి చూపకుండా దాటవేత

పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు

పలుకబడితో ముందుకు సాగని దర్యాప్తు

వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ఓ వ్యక్తి విజయవాడలో కన్సల్టెన్సీని ప్రారంభించాడు. ఆ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకుని అభ్యర్థులు బయటకు వస్తున్నారు తప్ప ఉపాధి మాత్రం దొరకడంలేదు. కొద్దినెలలుగా అభ్యర్థులు దీనిపై గొడవ చేస్తున్నారు. ఉపాధి కల్పించలేనప్పుడు చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కన్సల్టెన్సీ యజమానిని పోలీసులు పిలిపించి విచారించారు. ఉత్తరాదికి చెందిన మరో కన్సల్టెన్సీకి ఉపాధి నిమిత్తం డబ్బులు చెల్లించానని వివరించాడు. పోలీసులు ఆ కన్సల్టెన్సీ సంస్థపై కేసు నమోదు చేశారు. అప్పటికే మోసం జరిగిందని తెలిసినా విజయవాడలో కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న వ్యక్తి మాత్రం అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఆపలేదు. బాధితులు ఇప్పటికీ ఆ కన్సల్టెన్సీ అధినేత చుట్టూ తిరుగుతున్నా న్యాయం మాత్రం జరగడం లేదు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

నగరంలోని ఎంజీ రోడ్డులో ఓ వ్యక్తి ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించి ప్రఖ్యాత పేరు ప్రతిష్టలు ఉన్న యూనివర్సిటీల నుంచి పట్టాలు ఇప్పిస్తామని చెప్పాడు. చెప్పినట్టుగానే ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించి కోర్సు కాలాన్ని పూర్తి చేశాడు. దఫదఫాలుగా రూ.లక్షలు వసూలు చేశాడు. పరీక్షలు నిర్వహించి తర్వాత నకిలీ ధ్రువీకరణపత్రాలు జారీ చేశాడు. విషయం బయటకు పొక్కేసరికి బోర్డు తిప్పేశాడు. దీంతో ఇందులో చేరిన అభ్యర్థులు లబోదిబోమన్నారు.

విజయవాడలో జాబ్‌ కన్సల్టెన్సీలు చేస్తున్న నిర్వాకాలకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి నిరుద్యోగులు ఏదో ఒక రంగంలో శిక్షణ పొంది ఉపాధిని చూసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ అవసరాలను తామే తీర్చుతామంటూ కొందరు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. జాబ్‌ కన్సల్టెన్సీల పేరుతో బోర్డులు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు మొదలుపెడుతున్నారు. రకరకాల ఆఫర్లు ప్రకటించి అభ్యర్థులను ఆకర్షిస్తున్నారు. డబ్బులు ఖర్చయినా ఉపాధి లభిస్తుందన్న గంపెడంత ఆశలో అభ్యర్థులు ఉంటున్నారు. చివరికి అభ్యర్థుల ఆశలన్నీ అడియాశలు అవుతున్నాయి. అప్పులు చేసి కన్సల్టెన్సీలో చేరిన వారికి అప్పులకు మించి పెరుగుతున్న వడ్డీలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో కొన్ని కన్సల్టెన్సీల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఉపాధిని చూపించే విషయంలో ఉత్తరాది కన్సల్టెన్సీల పేరు చెప్పి రోజులు గడిపేస్తున్నారు.

ఫిర్యాదులతోనే సరి..

కన్సల్టెన్సీల నిర్వాహకులు ఒక్కో శిక్షణకు ఒక్కో విధంగా ప్యాకేజీని అమలు చేస్తున్నారు. కొన్ని రకాల శిక్షణలకు రూ.50 వేలు, మరికొన్ని రకాల శిక్షణలకు రూ.లక్ష, ఇంకొన్ని రకాల శిక్షణలకు రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. విద్యకు, ఉపాధికి విజయవాడ కేంద్రంగా ఉండడంతో వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి కన్సల్టెన్సీల్లో చేరుతున్నారు. కన్సల్టెన్సీల్లో చెల్లించడానికి డబ్బులు లేనివారు అప్పులు చేసి మరీ చేరుతున్నారు. శిక్షణ పూర్తయ్యే సరికి కన్సల్టెన్సీ బూటకమని తెలుసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. శిక్షణ పూర్తవ్వగానే ఇంటికి పంపేస్తున్నారు. ఉపాధి అవకాశాలు వచ్చిన వెంటనే సమాచారం ఇస్తామని చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా ఉపాధి అవకాశాలు రాకపోయే సరికి శిక్షణ పొందిన వాళ్లంతా నిర్వాహకులను నిలదీస్తున్నారు. అప్పటికే మొత్తం డబ్బులు వసూలు చేసిన నిర్వాహకులు ఘరానాగా సమాధానం చెబుతున్నారు. చెల్లించిన డబ్బులు అడిగితే రేపు మాపు అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. బాధితులు ఫోన్లు చేసినా ఆన్సర్‌ చేయడం లేదు. కార్యాలయంలో ఉన్న సిబ్బందిని అడిగితే తమకు ఏమీ తెలియదని సమాధానం ఇస్తున్నారు. దీంతో విసుగుపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ కన్సల్టెన్సీల నిర్వాహకులకు వెనుక రాజకీయ, వివిధ రకాల బలాలు ఉండడంతో పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నా కేసులు నమోదు చేయడం లేదు. కొన్ని స్టేషన్లలో కేసులు నమోదు చేసినా నిర్వాహకులను విచారణకు పిలవడం లేదు. దీంతో పోలీసు స్టేషన్లలో తమకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని బాధితులు కోల్పోతున్నారు.

Updated Date - Jul 16 , 2025 | 01:15 AM