Share News

తీరనున్న సాగు కష్టాలు

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:45 PM

కరువు సీమ రైతుల్లో సాగు కష్టాలు తీరనున్నాయి. తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలకు వరద పోటెత్తింది.

   తీరనున్న సాగు కష్టాలు
కేసీ కెనాల్‌కు పూజలు చేసి నీటిని విడుదల చేస్తున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు దస్తగిరి, గిత్తా జయసూర్య

శ్రీశైలం, తుంగభద్రలకు ఉరకలేస్తున్న వరద

కాలువలకు సాగునీరు విడుదల

ఇప్పటికే టీబీపీ ఎల్లెల్సీకి 1500 క్యూసెక్కులు విడుదల

కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు

15న హంద్రీనీవాకు కృష్ణాజలాల ఎత్తిపోతకు సన్నాహాలు

కరువు రైతుల్లో ఆనందోత్సవం

కర్నూలు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరువు సీమ రైతుల్లో సాగు కష్టాలు తీరనున్నాయి. తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుంది. పంట కాలువల గేట్లు ఎత్తి సాగునీరు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యాం నుంచి టీబీపీ ఎల్లెల్సీకి నీటిని వదిలారు. ఆదివారం సుంకేసుల బ్యారేజీ నుంచి కేసీ కాలువకు నీటిని విడుదల చేశారు. హంద్రీ నీవా కాలువకు ఈ నెల 15 నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోసేందుకు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. జలాశయాలు దాటి.. కాలువల్లో చేరిన నీరు ఆయకట్టు వైపు అడుగులు వేస్తున్నాయి. వరినాట్లుతో పాటు వివిద పంటల సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. కరువు రైతుల మోమున సాగు ఆశలు వికసిస్తున్నాయి.

జిల్లా పశ్చిమ ప్రాంతం ప్రధాన నీటి వనరు తుంగభద్ర ఎల్లెల్సీ కాలువ. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్‌లో 43,515 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో 35వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని నిర్ణయం తీసుకున్నారు. సీమ రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతుంది. 1625.32 అడుగుల లెవల్‌లో 77.54 టీఎంసీలు నిల్వ చేశారు. ఎగువ నుంచి 42,844 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతుంది. 35వేల క్యూసెక్కులు నదికి విడుదల చేశారు. అదే క్రమంలో తుంగభద్ర దిగువ కాలువకు 2,500 క్యూసెక్కులు విడుదల చేయగా.. గుండ్లకేరీ నుంచి 1500 క్యూసెక్కులు వదులుతున్నారు. జిల్లా సరిహద్దుకు కాలువ నీరు చేరుతుండటంతో రైతులు ఆనందంతో మురిసిపోతున్నారు. 18వ తేదీ నుంచి పంట కాలువలకు నీరు విడుదల చేసేందుకు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు.

కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల:

సుంకేసుల బ్యారేజీ నుంచి కేసీ కాలువకు ఆదివారం నీటిని విడుదల చేశారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, గిత్తా జయసూర్య, కేసీ కెనాల్‌ ప్రాజెక్టు కమిటీ చైర్మన రామలింగారెడ్డి, కేసీసీ సబ్‌ డివిజన డీఈఈ ప్రసాద్‌రావులు ప్రత్యేక పూజలు చేసి కాలువ గేట్లు ఎత్తి 500 క్యూసెక్కులు వదిలారు. క్రమక్రమంగా పెంచి 2,500 క్యూసెక్కులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నంద్యాలలో జరిగిన ఐఏబీ సమావేశంలో కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో పూర్తి ఆయకట్టు 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని తీర్మానించారు. అందులో భాగంగానే పూర్తి స్థాయికి నీటిని విడుదల చేస్తామని డీఈఈ ప్రసాద్‌రావు తెలిపారు. అయితే తుంగభద్ర గేట్లు మరమ్మతుల దృష్ట్యా ఖరీఫ్‌కు మాత్రమే నీళ్లు ఇస్తామని ఐఏబీలో తీర్మాణించడంతో రబీ సాగు ప్రశ్నార్థకమైంది.

15న హంద్రీనీవాకు కృష్ణాజలాలు :

శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, పూర్తి స్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ఆదివారం 883.30 అడుగుల లెవెల్‌లో 206.09 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఎగువ నుంచి 1,28,426 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో స్పిల్‌వే ద్వారా 27,295 క్యూసెక్కులు, పవర్‌ హౌస్‌ ద్వారా 68,330 క్యూసెక్కులు దిగువ సాగర్‌కు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 20వేల క్యూసెక్కులు సీమ కాలువలకు మళ్లిస్తున్నారు. శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ఈ నెల 15 నుంచి నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవా కాలువకు కృష్ణాజలాలు ఎత్తిపోసేందుకు ఎస్‌ఈ పాండురంగయ్య ఆధ్వర్యంలో ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. కెనాల్‌ విస్తరణ పనులు చేయడంతో ఈ ఏడాది పూర్తి స్థాయిలో 3,850 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అయితే పత్తికొండ కుడి, ఎడమ కాలువలు అసంపూర్తిగా వదిలేయడంతో 65వేల ఎకరాలకు సాగునీరు అందని దైన్య పరిస్థితిగా మారింది.

Updated Date - Jul 13 , 2025 | 11:45 PM