సామాన్యుడి ‘సన్నబియ్యం’
ABN , Publish Date - May 07 , 2025 | 11:22 PM
ఒకప్పుడు కర్నూలు, నంద్యాల సోనా రకాల సన్నబియ్యం ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేవి కాదు.
క్వింటా రూ.4,400 నుంచి రూ.4,800
గతేడాదితో పోల్చితే తగ్గిన ధరలు
ప్రభుత్వం ప్రోత్సాహంతో పెరిగిన దిగుబడి
మంచి దిగుబడితో రైతుల్లో హర్షం
నంద్యాల ఎడ్యుకేషన, మే 7 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు కర్నూలు, నంద్యాల సోనా రకాల సన్నబియ్యం ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేవి కాదు. అలాంటి పరిస్థితులను రూపుమాపాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం సాగును ప్రోత్సహిస్తూ తీసుకున్న పటిష్ట చర్యలతో రైతుల వెన్నంటి నిలిచింది. అటు రైతుకు దిగుబడి పెంచేలా ఊతమిస్తూనే ఇటు వినియోగదారునికి సోనా రకం బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్ధేశ్యంతో కేంద్రప్రభుత్వం దేశ సరిహద్దులు దాటకుండా గీత గీసింది. సప్లై పెరగడంతో డిమాండ్ తగ్గుతుందనే భయంతో మిల్లర్లు సైతం రేట్లు తగ్గించేశారు. డిమాండ్ కంటే ఎక్కువగా బియ్యం మార్కెట్‌కు చేరుకోవడంతో ధరలు అదుపులోకి వచ్చేశాయి. గత ఏడాది క్వింటా నంద్యాల సోనా బియ్యం రూ.6,200 నుంచి రూ.6,800 ధర ఉండేది. కానీ ఈ ఏడాది రూ.4,800 నుంచి రూ.5వేల వరకు విక్రయిస్తున్నారు. అలాగే కర్నూలు సోనా రకం గత ఏడాది రూ.5,800 నుంచి రూ.6వేల వరకు ధర ఉండేది. కానీ ఈ ఏడాది రూ.4,100 నుంచి రూ.4,400 వరకు నాణ్యతను బట్టి విక్రయిస్తున్నారు.
ఫ ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన దిగుబడి
ఉమ్మడి జిల్లాలో వరిసాగుకు తోడు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండటంతో ఈ ఏడాది ఖరీఫ్‌లోను, రబీలోను పంట అధిక దిగుబడి వచ్చింది. అప్పుడప్పుడూ ప్రకృతి కన్నెర్ర చేసినా పెద్దగా నష్టం జరగలేదు. గత ఏడాది ఖరీఫ్(2023)లో కర్నూలు జిల్లాలో 12,622 హెక్టార్లలో వరి సాగుచేయగా ఈ ఏడాది ఖరీఫ్(2024)లో 13,511 హెక్టార్లలో సాగుచేశారు. అలాగే రబీలో గత ఏడాది(2024) 303 హెక్టార్లలో వరి సాగుచేయగా ఈ ఏడాది(2025) రబీలో 726 హెక్టార్లలో వరి సాగుచేశారు. నంద్యాల జిల్లాలో ఖరీఫ్(2023)లో 47,314 హెక్టార్లలో వరి సాగుచేయగా, ఈ ఏడాది(2024) ఖరీఫ్‌లో 67,896 హెక్టార్లలో సాగుచేశారు. రబీలో గత ఏడాది 937 హెక్టార్లలో వరి సాగుచేయగా ఈ ఏడాది 1,200 హెక్టార్లలో సాగుచేశారు. 78 కిలోల వడ్ల బస్తా ధర రూ.2వేల నుంచి రూ.2,200 వరకు ఉంది. గత ఏడాదికి ఈ ఏడాది వేసిన సాగు విస్తీర్ణంలో భారీ తేడా ఉండడం కూడా ఒక కారణమని వ్యాపారులు భావిస్తున్నారు. మార్కెట్‌లో సన్నబియ్యం విరివిగా లభిస్తుండటంతో ధరలు గణనీయంగా పడిపోయాయి.
ఫ పంట పెరగడం వల్లే ధరలు తగ్గాయి
- మేడా లక్ష్మయ్య, నంద్యాల జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన అధ్యక్షుడు
నంద్యాల, కర్నూలు సోనా పంట సాగు, దిగుబడి పెరగడంతో ఈ ఏడాది ధరలు తగ్గాయి. పెద్ద రైతులు గోదాముల్లో నిల్వలు కూడా చేశారు. మార్కెట్ నిలకడగానే ఉంది. గత ఏడాది రూ.6వేల నుంచి రూ.6,500 వరకు కూడా విక్రయించాము. ఈ ఏడాది క్వింటా రూ.4,400 నుంచి రూ.4,800 వరకు విక్రయిస్తున్నాం.
ఫ మంచి దిగుబడి వచ్చింది
- యోగేశ్వర్, రైతు, బిల్లలాపురం
ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ మంచి దిగుబడి వచ్చింది. సకాలంలో ఎరువులు, నీళ్లు అందుబాటులో ఉండడం వల్ల మంచి దిగుబడి రావడానికి సాధ్యమైంది. ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులు కూడా పంటలను సందర్శించి సలహాలు, సూచనలిచ్చారు. ఎకరాకు పంట 35 బస్తాల నుంచి 40 బస్తాలు దిగుబడి వచ్చింది.
ఫ ధర నిలకడగా ఉంది.
- నాగన్న, రైతు, పెద్దకొట్టాల
ఈ సంవత్సరం వడ్ల ధర నిలకడగా ఉంది. పెట్టుబడి అధికంగా ఉన్నప్పటికీ మంచి దిగుబడులు రావడంతో రైతులు నష్టపోలేదు. రబీలో కొంత ఇబ్బందులు పడినప్పటికీ నీటివిడుదలలో ప్రజాప్రతినిధులు, అధికారులు చూపిన చొరవతో పంటలను కాపాడుకున్నాము.