వ్యర్థాలను కొనే స్వచ్ఛ రథాలు వచ్చేశాయ్
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:16 AM
ప్రజల నుంచి వ్యర్థాలను కొనుగోలు చేసే స్వచ్ఛ రథాలు గ్రామాలకు వచ్చేశాయి. జిల్లాకు తొమ్మిది రథాలను అధికారులు కేటాయించారు. ఇవీ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన 14 గ్రామాల్లో తిరగనున్నాయి. మచిలీపట్నంలో స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్థాల కొనుగోలును జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ బుధవారం ప్రారంభించారు.
-జిల్లాకు 9 రథాలు కేటాయింపు
-పైలెట్ ప్రాజెక్టుగా 9 మండలాల్లోని 14 గ్రామాలు ఎంపిక
-బందరులో ప్రారంభించిన డీపీవో అరుణ
-నగదుకు బదులుగా నిత్యావసరాల విక్రయం
మచిలీపట్నం టౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వ్యర్థాలను కొనుగోలు చేసే స్వచ్ఛ రథాలు గ్రామాలకు వచ్చేశాయి. జిల్లాకు తొమ్మిది రథాలను అధికారులు కేటాయించారు. ఇవీ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన 14 గ్రామాల్లో తిరగనున్నాయి. మచిలీపట్నంలో స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్థాల కొనుగోలును జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ బుధవారం ప్రారంభించారు. స్వచ్ఛ రథాల వద్ద ప్రజల నుంచి వ్యర్థాలను కొనుగోలు చేసి, వారికి ఇవ్వాల్సిన నగదుకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. బందరు మండలం పోతేపల్లి తదితర గ్రామాల్లో స్వచ్ఛ రథాలు తిరుగుతున్నాయి. అవనిగడ్డ మండలం అవనిగడ్డ, బాపులపాడు మండలంలో బాపులపాడు, గన్నవరం మండలంలో గన్నవరం, బుద్ధవరం, కేసరపల్లి, గుడ్లవల్లేరు మండలంలో గుడ్లవల్లేరు, కంకిపాడు మండలంలో కంకిపాడు, పునాదిపాడు, ఈడ్పుగల్లు, మచిలీపట్నం మండలంలో పోతేపల్లి చుట్టు పక్కల గ్రామాలు, నాగాయలంక మండలంలో నాగాయలంక, చల్లపల్లి మండలంలో చల్లపల్లి, పెనమలూరు మండలంలో పెనమలూరు, గంగూరు గ్రామాల్లో తొమ్మిది స్వచ్ఛరథాలు పర్యటిస్తాయి. ఈ రథాలకు స్ర్కాప్ డీలర్లను నియమించారు.
వ్యర్థాల ధరలు ఇలా..
కిలో చొప్పున ఇనుము రూ.20, న్యూస్‌పేపర్లు రూ.15, పుస్తకాలు రూ.10, అట్టపెట్టెలు రూ.10, ప్లాస్టిక్ బాటిల్స్ రూ.20, గాజు బాటిల్స్ రూ.2, స్టీల్ వస్తువులు రూ.40, అల్యూమినియం వస్తువులు రూ.120కి కొనుగోలు చేస్తున్నారు. అలాగే స్వచ్ఛ రథం విక్రయించే నిత్యావసరాల ధరలు కిలో గోధుమ పిండి రూ.60, కొబ్బరి నూనె బాటిల్ రూ.18, సర్ప్ ప్యాకెట్ రూ.12, బట్టల సబ్బు రూ.10, వంటి సబ్బు రూ.10, టీ పౌడర్ రూ.3, పేస్ట్ రూ.10, కిలో పెద్ద ఉల్లిపాయలు రూ.23, టూతబ్రష్ రూ.11, పెన్ను రూ.3, పెన్సిల్ రూ.5, వేరుశనగ గుళ్లు పావుకిలో రూ.32, మినపగుళ్లు పావుకిలో రూ.30, కందిపప్పు పావుకిలో రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు.