Share News

సంబరం నేడే

ABN , Publish Date - Sep 22 , 2025 | 01:06 AM

ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి శరన్నవరాత్రి మహోత్సవాలకు వేళయ్యింది. తొలిరోజు కనకదుర్గమ్మ శ్రీబాలాత్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. దర్శనాల్లో ఇబ్బందులు తలెత్తకుండా 500 దర్శన టికెట్లు రద్దు చేసి, రూ.300, రూ.100, ఉచిత క్యూలు మాత్రమే ఈ సారి అమలు చేస్తున్నారు. ఆరు వేల మంది పోలీసులు, 500 కెమెరాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వశాఖలు సమన్వ యంతో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి.

సంబరం నేడే

ఉదయం 8.30 గంటలకు దుర్గమ్మ తొలి దర్శనం

శ్రీబాలాత్రిపురసుందరిగా అలంకారం

వీఐపీలకు 7-9, 3-5 గంటలకు దర్శనాలు

ఆలయంలో, అన్నదానం వద్ద హెడ్‌కౌంట్‌ కెమెరాలు

దసరా విధుల్లో చేరిన పోలీసులు

పారిశుద్ధ్య పనులకు 1400 మంది కార్మికులు

ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి శరన్నవరాత్రి మహోత్సవాలకు వేళయ్యింది. తొలిరోజు కనకదుర్గమ్మ శ్రీబాలాత్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. దర్శనాల్లో ఇబ్బందులు తలెత్తకుండా 500 దర్శన టికెట్లు రద్దు చేసి, రూ.300, రూ.100, ఉచిత క్యూలు మాత్రమే ఈ సారి అమలు చేస్తున్నారు. ఆరు వేల మంది పోలీసులు, 500 కెమెరాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వశాఖలు సమన్వ యంతో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి శరన్నవరాత్రి మహోత్సవాల ఆరంభానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో తొలి అలంకారంతో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సోమవారం నుంచి ఇంద్రకీలాద్రిపై 11 రోజులపాటు శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజున అమ్మవారు శ్రీబాలాత్రిపురసుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 8-8.30 గంటల మధ్యలో అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత తొలి దర్శనం చేసుకుంటారు. శరన్నవరాత్రుల్లో తొలి రోజున ఇంద్రకీలాద్రిపై రెండు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించనున్నారు. శివాలయానికి వెళ్లే మార్గంలో దాతల సహకారంతో నిర్మించిన నిత్యపూజల మందిరం, రెండో యాగశాలను మంత్రులు ప్రారంభిస్తారు. వీఐపీ కేటగిరిలో వచ్చే వారికి ఉదయం 7-9, మధ్యాహ్నం 3-5 గంటల్లో సమయాలను కేటాయించారు. ఆ సమయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంతమంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు, ఎంతమంది అన్నదానంలో ప్రసాదంలో స్వీకరించారు అన్న లెక్కలను తేల్చడానికి హెడ్‌కౌంట్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి పై నుంచి దిగువ వరకు మొత్తం పరిసరాలను 500 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు. ఇందు కోసం మోడల్‌ గెస్ట్‌హౌస్‌ అధునాతన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, మహామండపంలో దేవస్థాన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. మోడల్‌ గెస్ట్‌హౌస్‌లో మూడు ఎల్‌ఈడీ వీడియో వాల్స్‌ను సిద్ధం చేశారు.

ఫ్రేమ్‌ మోడల్‌ క్యూ లైన్లు

ఈ ఏడాది అధికారులు క్యూలైన్ల డిజైన్లలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన క్యూల డిజైన్లకు భిన్నంగా ఈ ఏడాది ఏర్పాట్లు చేశారు. ఇనుప గడ్డర్లను భూమిలో పాతి వాటికి ఇనుప కంచెను అల్లుతూ వెళ్లేవారు. వాటి వల్ల భక్తులకు స్వల్ప గాయాలు అయ్యేవి. ఈసారి వాటిని తొలగించి ఫ్రేమ్‌ మోడల్‌ క్యూలను ఏర్పాటు చేశారు. ఇనుప కంచె స్థానంలో బారికేడ్లుగా ఉండే ఫ్రేమ్‌లను ఏర్పాటు చేశారు. ఇంత వరకు ఏర్పాటు చేసిన క్యూల్లోకి వెళ్లిన భక్తులు అత్యవసరం సమయంలో బయటకు వచ్చే మార్గం ఉండేది కాదు. క్యూలో కటింగ్‌ వచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు క్యూలైన్లలో ప్రతి 50 మీటర్లకు ఒక అత్యవసర ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ అత్యవసర ద్వారం ఉందని భక్తులకు తెలిసేలా ఆ గేటుకు ఎరుపు రంగు వేశారు. అదేవిధంగా అత్యవసర ద్వారం ఉందని ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేశారు. రూ.300, రూ.100, ఉచిత క్యూలు మాత్రమే ఈసారి అమలు చేస్తున్నారు. రూ.500 టికెట్‌ను శరన్నవరాత్రుల్లో రద్దు చేశారు. వినాయకుడి ఆలయం నుంచి క్యూలోకి ప్రవేశించిన భక్తులు ప్రశాంతంగా ముందుకు కదిలేందుకు అధికారులు లలితా సహస్ర నామాలను మైకుల ద్వారా వినిపించాలని నిర్ణయించారు. వినాయకుడి ఆలయం వద్ద, క్యూల మధ్యలో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. మహామండపం ఆరో అంతస్తులో జరిగే పూజలు, యాగశాలలో జరిగే హోమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వాటిని ఈ స్ర్కీన్లపై భక్తులకు వీక్షించేలా చేస్తారు. దర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఏ కారణంగా క్యూలైన్లు ఆగాయన్న సమాచారాన్ని వాటిపై ప్రదర్శిస్తారు. ప్రసాదాల విక్రయాలకు కనకదుర్గ నగర్‌లో అధికారులు 12 లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఒక కౌంటర్‌ను వృద్ధులకు, మరో కౌంటర్‌ను వికలాంగులకు కేటాయించారు.

రథం సెంటర్‌లో ప్రత్యేక ఎఫ్‌వోబీ

వినాయకుడి ఆలయం, కుమర్మిపాలెం వైపు నుంచి క్యూల్లోకి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత శివాలయం వైపున ఉన్న మెట్ల ద్వారా కిందికి దిగుతారు. వాళ్లంతా కనకదుర్గనగర్‌లోకి వచ్చి ప్రసాదాలను కొనుగోలు చేసి రహదారి మీదకు వస్తారు. ఇలా వచ్చిన భక్తుల్లో చాలా మంది కాళేశ్వరరావు మార్కెట్‌ వైపునకు వెళ్తారు. మరికొంతమంది కెనాల్‌ రోడ్డులోకి వెళ్తారు. కుమ్మరిపాలెం వైపున వాహనాలను పార్క్‌ చేసిన భక్తులు అక్కడికి వెళ్లాలంటే కిలోమీటరు దూరంలో ఉన్న వినాయకుడి ఆలయం వద్దకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వెనక్కి రావాలి. భక్తులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఈసారి రథం సెంటర్‌ వద్ద క్యూలైన్ల పై భాగం నుంచి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. కుమ్మరిపాలెం వైపునకు వెళ్లే భక్తులు రహదారి దాటడానికి క్యూలైన్లు అడ్డుగా ఉన్నా ఈ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి పై నుంచి కెనాల్‌ రోడ్డులోకి వెళ్లవచ్చు.

విధుల్లోకి భారీగా సిబ్బంది

ఇంద్రకీలాద్రిపై 11 రోజులపాటు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో విధులు నిర్వర్తించేందుకు ఆయా శాఖలు రాష్ట్రం నలుమూలల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకొచ్చాయి. దేవదాయ శాఖలో వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న 500 మంది అధికారులు, సిబ్బందికి ఇంద్రకీలాద్రిపై అధికారులు విధులు కేటాయించారు. ఇంద్రకీలాద్రి పై నుంచి భక్తులు సంచరించే అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వాహణకు 1400 మంది కార్మికులను వీఎంసీ నియమించింది. వాళ్లంతా మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తారు. బందోబస్తు కోసం పోలీసు అధికారులు మొత్తం ఆరు వేల మంది అధికారులు, సిబ్బందిని రంగంలోకి దింపారు. ఇందులో ఐదు వేల మంది పోలీసులు ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని వారు కాగా మిగిలిన 1000 మందిని ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చారు. బందోబస్తు విధులకు వచ్చిన వారికి ఆదివారం సాయంత్రం డ్యూటీ పాయింట్లు కేటాయించారు.

Updated Date - Sep 22 , 2025 | 01:06 AM