Share News

ప్రాణాలు కబళించిన కారు

ABN , Publish Date - Dec 24 , 2025 | 01:05 AM

ద్విచక్ర వాహనంపై మచిలీపట్నం వెళ్లి వస్తున్న ఇద్దరు పంచాయతీ ఉద్యోగులను కారు మృత్యువురూపంలో వచ్చి కబళించింది. కారు టైరు పగిలిపోవటంతో అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో ఒకరు ఘటనా స్థలంలో, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఇద్దరికీ వివాహాలై ఏడాదైనా నిండకుండా మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చల్లపల్లి మండలం కొత్తమాజేరు బట్టీల వద్ద 216 జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రాణాలు కబళించిన కారు

-చల్లపల్లి మండలం మాజేరు వద్ద రోడ్డు ప్రమాదం

- టైరు పగిలి అదుపు తప్పి బైక్‌ను ఢీకొన్న కారు

- బైక్‌పై ప్రయాణిస్తున్న ఇరువురు దుర్మరణం

- మృతులు ఇద్దరూ పులిగడ్డ పంచాయతీలో తాత్కాలిక ఉద్యోగులు

- రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం

- వివాహమై ఒకరికి మూడు నెలలు.. మరొకరికి ఏడాది

చల్లపల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

ద్విచక్ర వాహనంపై మచిలీపట్నం వెళ్లి వస్తున్న ఇద్దరు పంచాయతీ ఉద్యోగులను కారు మృత్యువురూపంలో వచ్చి కబళించింది. కారు టైరు పగిలిపోవటంతో అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో ఒకరు ఘటనా స్థలంలో, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఇద్దరికీ వివాహాలై ఏడాదైనా నిండకుండా మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చల్లపల్లి మండలం కొత్తమాజేరు బట్టీల వద్ద 216 జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.. అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామ పంచాయతీలో టెండరు పద్ధతిలో పనిచేస్తున్న సిరివెళ్ల భాగ్యరాజు (24), కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న చెన్ను రాఘవ (25) కార్యాలయం పని నిమిత్తపై మచిలీపట్నంలోని డీపీవో కార్యాలయానికి వెళ్లి తిరిగివస్తున్నారు. గుడివాడకు చెందిన దొడ్డ లోకేశ్వర్‌ భార్య, రెండేళ్ల బాబుతో కలిసి కారులో మోపిదేవి గుడికి వెళ్లి తిరిగి మచిలీపట్నం మీదుగా గుడివాడకు బయలుదేరారు. మధ్యాహ్నం సమయంలో మాజేరు చెక్‌ పోస్టు సమీపంలో కారు ముందువైపు కుడిటైరు పగిలిపోవటంతో కారు అదుపుతప్పి రోడ్డుకు కుడివైపునకు దూసుకువెళుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇరువురూ ఎగిరిపడ్డారు. వారిలో భాగ్యరాజు అక్కడికక్కడే మృతిచెందగా, రాఘవకు చేయి తెగిపోవటంతోపాటు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. కాగా, భాగ్యరాజు మృతదేహాన్ని శవపరీక్ష కోసం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఎయిర్‌ బ్యాగ్స్‌ ఓపెన్‌ కావటంతో కారులోని వారు క్షేమంగా బయటపడ్డారు. చల్లపల్లి ఎస్‌ఐ కె.వై.దాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌ నడుపుతున్న వ్యక్తుల్లో ఒకరు హెల్మెట్‌ కూడా పెట్టుకున్నట్లు సంఘటనా ప్రదేశంలో పడి ఉన్న హెల్మెట్‌ను చూస్తే తెలుస్తోంది.

కొత్త పెళ్లికొడుకు ఒకరు.. తండ్రి కాబోతున్న మరొకరు

ఇద్దరి మృతితో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనా ప్రదేశంలో మృతి చెందిన సిరివెళ్ల భాగ్యరాజు స్వగ్రామం కోడూరు మండలం పిట్టల్లంక. వివాహమై మూడు నెలలైనా కాలేదు. ఈ ఏడాది అక్టోబరు 7వ తేదీన భాగ్యరాజు వివాహం కాగా, పులిగడ్డ పంచాయతీ కార్యాలయంలో రెండు నెలల క్రితమే ఉద్యోగంలో చేరాడు. మరో మృతుడు పులిగడ్డ గ్రామానికి చెందిన చెన్ను రాఘవ. పంచాయతీలో తాత్కాలిక పద్ధతిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. రాఘవకు వివాహమై ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదు. రాఘవ భార్య నాలుగు నెలల గర్భిణీ అని సమాచారం. కొన్నినెలల్లో తండ్రి కావాల్సిన వ్యక్తి ఇలా అర్ధాంతరంగా కన్నుమూయటం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది.

Updated Date - Dec 24 , 2025 | 01:05 AM