బకాయిల బండ!
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:18 AM
నగర పాలక సంస్థ ఆర్థిక పరిస్థితిపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు కొండలా పెరిగిపోయాయి. సంవత్సర కాలంలో ఏకంగా రూ.143 కోట్లకు చేరాయి. కార్పొరేషన్ ఆదాయ వనరులు చూస్తే అంతంతమాత్రమే. దీంతో బకాయిల చెల్లింపు అధికారులకు తలనొప్పిగా మారింది.
- అగమ్య గోచరంగా కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి
- కాంట్రాక్టర్లకు చెల్లించాల్సింది రూ.143.42 కోట్లు
- 2024, డిసెంబరు నుంచి ఉన్న బకాయిలు
- నెలకు కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం రూ.20 కోట్లలోపే..
- దీంతో ఒక్కసారిగా చెల్లించే పరిస్థితి లేనట్టే!
- ఏడాది పాటు నెలనెలా ఇవ్వాలన్నా రూ.12 కోట్లు కావాలి
- కాంట్రాక్టర్లకే రూ.12 కోట్లు చెల్లిస్తే.. జీతాలు, ఇతర చెల్లింపులకు కటకట
నగర పాలక సంస్థ ఆర్థిక పరిస్థితిపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు కొండలా పెరిగిపోయాయి. సంవత్సర కాలంలో ఏకంగా రూ.143 కోట్లకు చేరాయి. కార్పొరేషన్ ఆదాయ వనరులు చూస్తే అంతంతమాత్రమే. దీంతో బకాయిల చెల్లింపు అధికారులకు తలనొప్పిగా మారింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. క్యాపిటల్ ఆదాయ వనరులు తప్పితే.. సాధారణ ఆదాయ వనరులు పెద్దగా లేవు. ఉన్నా ఆ వనరుల ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉండటంతో అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బిల్లులను కూడా కార్పొరేషన్ చెల్లించలేకపోతోంది. కాంట్రాక్టర్లకు రూ.143.42 కోట్ల మేర బకాయిలు పడింది. డిసెంబరు, 2024 నుంచి ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏడాదికే రమారమీ నూట యాభై కోట్లు చెల్లించాల్సి రావటం గమనార్హం. కార్పొరేషన్ మొత్తం 215 మంది కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు బకాయిలు పడిన వాటిలో 14వ ఆర్థిక సంఘం నిధులతో ఇద్దరు కాంట్రాక్టర్లు రూ.2.09 కోట్ల పనులు చేపట్టారు. కిందటేడాది చివర్లో చేపట్టిన ఈ పనులకు ఇప్పటి వరకు చెల్లింపులు జరపలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.24 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. ఈ పనులను మొత్తం 18 మంది కాంట్రాక్టర్లు చేశారు. ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టారు. వీటితో పాటు గోదావరి గ్రాండ్ మహా ప్రాజెక్ట్ (జీజీఎంపీ) గ్రాంట్స్‌తో కూడా నగరంలో రూ.2.07 కోట్ల వ్యయంతో పనులను చేపట్టారు. ఈ పనులను మొత్తం ఐదుగురు కాంట్రాక్టర్లు చేశారు. హౌసింగ్ గ్రాంట్స్ ద్వారా రూ.66 లక్షల వ్యయంతో పనులు చేపట్టారు. ఇద్దరు కాంట్రాక్టర్లు ఈ పనులు చేశారు. ఇవి కాకుండా జనరల్ వర్క్స్‌కు సంబంధించి అత్యధికంగా రూ.103.47 కోట్ల మేర పనులు జరిగాయి. కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి ఈ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. అత్యధికంగా 250 మంది కాంట్రాక్టర్లు పనులు చేశారు. ఇవి కాకుండా జనరల్ సీ బిల్స్ మరో రూ.11.30 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. వీటికి సంబంధించి 94 మంది కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు ఈ ఒక్క ఏడాదిలోనే మొత్తంగా రూ.143.42 కోట్లు బకాయి పడటం అన్నది చాలా పెద్ద విషయంగా మారింది.
ఆదాయ, వ్యయాలు ఇలా..
కార్పొరేషన్ ఆదాయ, వ్యయాలు చూస్తే కీలకమైన నెలల్లో కూడా ఆందోళన కలిగించే విధంగా ఉంటున్నాయి. నెలకు సగటున సాధారణ పన్నుల ద్వారా రూ.9 కోట్ల మేర వసూళ్లు అవుతున్నాయి. ఇతర పనుల ద్వారా మరో రూ.4 కోట్ల మేర వసూలు చేస్తున్నారు. ఇతరత్రా జమలు చూస్తే మరో రూ.6 కోట్ల మేర వసూళ్లు అవుతున్నాయి. మొత్తంగా రూ.19 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య ఆదాయం ఉంటోంది. ఇక ఖర్చులు చూస్తే ఉద్యోగుల జీతభత్యాలు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యుల గౌరవ వేతనాలు, కన్వేయన్సు, అలవెన్సులు, కాంట్రాక్టు లేబర్ జీతాలు వంటి వాటికి రూ.2 కోట్ల మేర చెల్లించాల్సి వస్తోంది. ఇవి కాకుండా ఠంఛనుగా ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ చెల్లింపులు, జీఎస్టీ చెల్లింపులు, ఆదాయపు పన్ను చెల్లింపులు, వాహనాల అద్దె చెల్లింపులు, వెహికల్ డిపో, సెక్షన్ (సీ), క్లాప్ వెహికల్స్, హెల్త్ సెక్షన్ (సీ), లీగల్ సెల్, ఇంజనీరింగ్ సెక్షన్ (సీ), ఎస్టేటు సెక్షన్, హార్టీకల్చర్ సెక్షన్ (సీ), సెక్రటరీ సెల్ (సీ), ఎలిమెంటరీ - సెకండరీ స్కూల్ కంటింజెంట్ స్టాఫ్ చార్జీలు, బిల్లులు, అద్దెలు వంటి వాటికి రూ.10 కోట్ల మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవి కాకుండా కాంట్రాక్టర్లకు నెలకు సగటున రూ.6 కోట్ల మేర మాత్రమే చెల్లింపులు జరుపుతున్నారు. ఈ లెక్కన రూ. 18 కోట్ల పైబడి ఖర్చులు ఉంటున్నాయి. మిగులు రూ.2 కోట్ల మేర ఉంటోంది. ఈ లెక్కన చూస్తే అత్యవసరంగా ఏమైనా ఖర్చు పెట్టాల్సి వస్తే కార్పొరేషన్ వెతుక్కునే పరిస్థితి నెలకొంది.
నిధులకు మించి పనులు
కార్పొరేషన్ జనరల్ ఫండ్స్‌కు.. చేస్తున్న పనులకు పొంతన ఉండటంలేదు. నిధులు తగిన విధంగా లేకపోయినా.. పనులు మాత్రం అంచనాకు మించి చేపడుతున్నారు. దీంతో ఆ పనులకు డబ్బులు చెల్లించాల్సిన విషయంలో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రూ.143 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. వీటిని కాంట్రాక్టర్లకు ఒక్కసారిగా సర్దుబాటు చేయాలంటే సాధ్యమయ్యే పనికాదు. ఏడాది పొడవునా నెలకు రూ.12 కోట్ల మేర అయినా కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. నెలకు ఇంత మొత్తాన్ని కూడా కార్పొరేషన్‌కు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఒక వేళ ఇంత మొత్తంలో కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాల్సి వస్తే జీతాలు, బిల్స్, అద్దెలు, ఇతర ఖర్చులు బకాయి పడిపోతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏడాది తిరిగే సమయానికి చేపట్టే జనరల్ వర్క్స్ బిల్లులు మళ్లీ రూ.100 కోట్లు దాటే పరిస్థితి ఉంటుంది. దీంతో కార్పొరేషన్‌కు కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లింపు అనేది పెద్ద తలనొప్పిగా మారింది.
క్యాపిటల్ గ్రాంట్స్ ఇప్పుడు పెద్దగా లేవు
కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి క్యాపిటల్ గ్రాంట్స్ గతంలో వచ్చేవి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఫేజ్ - 1, ఫేజ్ - 2, రే వంటి పథకాల ద్వారా కార్పొరేషన్‌కు రూ. వేల కోట్ల నిధులు వచ్చేవి. వాటితో స్థానికంగా చాలా పనులు చేపట్టేవారు. కార్పొరేషన్ వాటా 30 శాతంగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్రం 20 శాతం చొప్పున గ్రాంట్స్‌గా ఇచ్చేవి. దీంతో కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ ద్వారా పెద్దగా పనులు చేపట్టే అవకాశం ఉండేది కాదు. నిధులు పుష్కలంగా ఉండేవి. అదనంగా అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆ స్థాయిలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా నిధులు రావటం లేదు. జల్ జీవన్ మిషన్ (జేజేఎం)ను కార్పొరేషన్లకు ఇచ్చినా రక్షిత మంచినీటి పథకాలను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఈ పథకాన్ని కాస్తా ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నడిపించటం వల్ల అవినీతి పెరిగిపోయి.. పనుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
------------------------------------------------------------------------------------------------------------
- కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇలా :
----------------------------------------------------------------------------------------------------------
క్ర.సం గ్రాంట్ బకాయిలు
----------------------------------------------------------------------------------------------------------
1. 14వ ఆర్థిక సంఘం రూ. 2,09,73,761
2. 15వ ఆర్థిక సంఘం రూ. 23,81,94,072
3. జీజీఎంపీ రూ.2,07,45,846
4. హౌసింగ్ రూ.65,96,993
5. జనరల్ వర్క్స్ బిల్స్ రూ. 103,46,86,360
6. జనరల్ సీ బిల్స్ రూ.11,30,38,580
-----------------------------------------------------------------------------------------------------------
మొత్తం రూ. 143,42,35,612
-----------------------------------------------------------------------------------------------------------