Share News

బాలుడి ఆచూకీ లభ్యం

ABN , Publish Date - Aug 01 , 2025 | 11:25 PM

ఉలిందకొండ పోలీస్‌ స్టేషన పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో అదృశ్యమైన మోక్షిత ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది.

   బాలుడి ఆచూకీ లభ్యం
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

స్నేహితుడి సాయంతో కొడుకును దాచిపెట్టిన తల్లి

తన చెల్లెలిపైనే నేరారోపణ

24 గంటల్లోనే అదృశ్యం కేసు ఛేదించిన పోలీసులు

కర్నూలు క్రైం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఉలిందకొండ పోలీస్‌ స్టేషన పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో అదృశ్యమైన మోక్షిత ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. తల్లే తన స్నేహితుడి సాయంతో కొడుకును దాచిపెట్టి హైడ్రామాకు తెరతీసింది. తన చెల్లెలిపైనే నేరారోపణ చేసి పోలీసులను సైతం బోల్తా కొట్టింది. 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం రూరల్‌ సీఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ ఎస్‌ఐ ధనుంజయ, నాగులాపురం ఎస్‌ఐ శరతకుమార్‌రెడ్డితో కలిసి డీఎస్పీ శుక్రవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం తన కొడుకు మోక్షిత ఇంటి నుంచి స్కూలు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తండ్రి సురేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తల్లి కూడా బంధువులతో వచ్చి పోలీస్‌స్టేషన ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేసింది. పోలీసులు చర్యలు తీసుకోవాలని తమ కొడుకును రక్షించాలని శ్లోకాలు పెట్టింది. దీంతో ఆశ్చర్యానికి గురైన పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే తల్లినే అసలు సూత్రధారి అని తేలింది.

స్నేహితుడితో కలిసి డ్రామా

సురేష్‌, తన బార్య విజయలక్ష్మితో కలిసి స్కందలో నివాసం ఉంటుంన్నారు. విజయలక్ష్మి స్నేహితుడు వెల్దుర్తి మండలం మల్లెపల్లె చెందిన మనోహర్‌నాయుడు అనేవ్యక్తి వీరి ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. విజయలక్ష్మి తన స్నేహితుడు మనోహర్‌ నాయుడుతో కలిసి ఈ డ్రామా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. విజయలక్ష్మికి తన సొంత చెల్లెల్ల మధ్య కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు కారణంగా ఎలాగైనా వారిని భయపెట్టి డబ్బులు రాబట్టాలని పతకం పన్నింది. ఈవిషయాన్ని మనోహర్‌ నాయుడుకు తెలిపింది. మనోహర్‌ నాయుడు గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్తున్న మోక్షిత వద్దకు వెల్లి మాయమాటలు చెప్పి తనతో పాటు తీసుకెళ్లాడు. కంబలపాడు గ్రామంలో తనకు తెలిసిన వారి ఇంట్లో ఆ బాలుడిని ఉంచి మళ్లీ వస్తానని చెప్పి వచ్చేశాడు. ఆ తర్వాత విజయలక్ష్మితో కలిసి డ్రామా మొదలుపెట్టారు. ఏమీ తెలియని తండ్రి సురేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి విజయలక్ష్మి కూడా తన సొంత చెల్లెలిపైనే ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించింది. తీరా డ్రామా బయటపడటంతో మనోహర్‌ నాయుడును అదుపులోకి తీసుకుని బాలుడిని సురక్షితంగా తండ్రి వద్దకు చేర్చారు. మనోహర్‌నాయుడును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నామని, తల్లి పాత్రపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

Updated Date - Aug 01 , 2025 | 11:25 PM