ఉత్తమ అవార్డుల రగడ!
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:28 AM
జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక వ్యవహారంపై తీవ్రస్థాయిలో రగడ నడుస్తోంది. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరుకాని టీచర్‌ను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయడంపై భగ్గుమంటున్నారు. దొడ్డిదారిన ఎంపిక చేయడంతో పాటు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి ఎంపిక కోసం కూడా అతని పేరును పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపడంపై డీఈవో అధికారులను నిలదీస్తున్నారు. ఈ అంశంపై కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.
- జిల్లాలో వివాదాస్పదంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
- 14న టీచర్లను ఇంటర్వ్యూ చేసిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం
- ఇంటర్వ్యూకు హాజరుకాని వ్యక్తి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక
- ఈ అంశంపై డీఈవో కార్యాలయ అధికారులతో టీచర్ల వాగ్వాదం
- విచారణకు ఆదేశించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి
- కోడూరు ఎంఈవో అక్రమాలపై మీకోసంలో ఫిర్యాదు
జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక వ్యవహారంపై తీవ్రస్థాయిలో రగడ నడుస్తోంది. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరుకాని టీచర్‌ను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయడంపై భగ్గుమంటున్నారు. దొడ్డిదారిన ఎంపిక చేయడంతో పాటు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి ఎంపిక కోసం కూడా అతని పేరును పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపడంపై డీఈవో అధికారులను నిలదీస్తున్నారు. ఈ అంశంపై కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసేందుకు డీఈవో కార్యాలయ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 14వ తేదీన ఎంపిక చేసిన టీచర్‌లకు ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఇంటర్వ్యూలు నిర్వహించింది. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన స్కూల్ అసిస్టెంట్లు ఏడుగురు, సెకండరీ గ్రేడ్ టీచర్లు ఏడుగురిని ఎంపిక చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా డీఈవో కార్యాలయంలో అసలు ఇంటర్వ్యూకు హాజరు కాని ఒక టీచర్ పేరును జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కోసం గుట్టుచప్పుడు కాకుండా పంపారు. ఈ విషయం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై కొందరు ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయానికి వచ్చి డీఈవోను ప్రశ్నించారు. దీంతో డీఈవోకు, ఉపాధ్యాయులకు మధ్య ఈ అంశంపై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అయినా ఉపాధ్యాయులు ఈ అంశాన్ని విడిచి పెట్టకుండా గత రెండు, మూడు రోజులుగా డీఈవో కార్యాలయానికి వచ్చి నిలదీస్తూనే ఉన్నారు. దీంతో ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి అధికం అయ్యింది. సంబంధిత ఫైల్‌ను బయటపెడితే తెర వెనుక జరిగిన వ్యవహారం వెలుగులోకి వస్తుందని డీఈవో కార్యాలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. చివరకు డీఈవో కార్యాలయ అధికారులు ఈ ఫైల్ కనపడటం లేదని తేల్చి చెప్పడంతో ఈ అంశం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీఈవో కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆరా తీయడంతో డీఈవో కార్యాలయ అధికారులు ఈ అంశాన్ని తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారు.
తెరవెనుక ఏం జరిగింది?
ఇంటర్వ్యూలకు హాజరు కాని టీచర్‌ను ఏకంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో పేరు చేర్చడమే కాకుండా, రాష్ట్ర స్థాయి అవార్డు కోసం పంపడంలో తెరవెనుక నగదు పెద్దమొత్తంలో చేతులు మారిందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఓ మండలానికి చెందిన విద్యాశాఖాధికారి ఇంటర్వ్యూ జరిగిన రోజు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండి ఈ వ్యవహారం నడిపించారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. డీఈవోకు తెలియకుండా ఈ జాబితాల తయారీ జరగలేదని కూడా అంటున్నారు. జిల్లాలోని ఒక మోడల్ పాఠశాలలో పనిచేసే టీచర్‌కు రావాల్సిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పక్కదారి పట్టించేందుకు, ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో పేర్లు మార్పు చేశారని పలువురు టీచర్‌లు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కలెక్టర్ విచారణకు ఆదేశించాలని కోరుతున్నారు.
ఎంఈవోపై ఉపాధ్యాయుల ఫిర్యాదు
కోడూరు ఎంఈవోపై పలువురు ఉపాధ్యాయులు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు ఎంఈవో చేస్తున్న అక్రమాలపై సాక్షాధారాలతో 150 పేజీల బుక్‌లెట్‌ను అందజేశారు. తనకు అనుకూలమైన ఉపాధ్యాయులు ఐదారు నెలల పాటు పాఠశాలలకు రాకున్నా జీతాల బిల్లులు చేశారని ఆరోపించారు. ఈ ఎంఈవోనే గతేడాది, ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక విషయంలోనూ చక్రం తిప్పుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదరు ఎంఈవోపై విచారణ చేయిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.