‘బెల్టు’ తెరిచారు..
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:43 AM
మద్యం అమ్మకాలను పెంచేందుకు తెగబడ్డారు. దుకాణాలకు ఎక్సైజ్ శాఖ టార్గెట్లు నిర్ధేశించడంతో అక్రమ మార్గాలకు తెరలేపారు.
విచ్ఛలవిడిగా దుకాణాలు
కమీషన పెంచని ప్రభుత్వం
వంద కోట్లు టార్గెటే లక్ష్యం
పావులు కదుపుతున్న ఎక్సైజ్ శాఖ
మితిమీరిన రాజకీయ జోక్యం
రూ.75 కోట్లు దాటిన అమ్మకాలు
అవకతవకలకు అవకాశమే లేదు: డీసీ
కర్నూలు అర్బన, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): మద్యం అమ్మకాలను పెంచేందుకు తెగబడ్డారు. దుకాణాలకు ఎక్సైజ్ శాఖ టార్గెట్లు నిర్ధేశించడంతో అక్రమ మార్గాలకు తెరలేపారు. జిల్లాలో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలను తెరిచి అమ్మకాలకు తెగబడు తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా గ్రామాలు, పట్టణాల్లో అమ్మకాలు చేపడుతున్నా మని దుకాణదారులే చెబుతున్నారు. ప్రభుత్వం టెండర్ ప్రక్రియకు ముందు చెప్పిన కమీషన పెంచకపోవడంతో అమ్మకాలు చేపడితే తప్ప దక్కించుకున్న టెండర్ గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేవని తెగేసి చెబుతున్నారు. ఈక్రమంలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ఈనెలకు వంద కోట్ల టార్గెట్ లక్ష్యంగా నిర్ధేశించడం, ప్రొహిబిషన అండ్ ఎక్సైజ్ శాఖ ఎలాగైన అమ్మకాల్లో లక్ష్యాన్ని పూర్తిచేయాలని పావులు కదుపుతోంది. టెండర్ ప్రక్రియలో మద్యం దుకాణాలను దాదాపుగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అనుచరులు దక్కించుకున్నారు. వారి అడ్డగోలు అమ్మకాలు, బెల్టుషాపులకు అడ్డుకట్ట వేయలేక ఎక్సైజ్, పోలీస్ శాఖలు తలలు పట్టుకుంటోంది. విచ్ఛలవిడిగా బెల్టుషాపులను ఏర్పాటుచేశారు. ఎక్కడ పడితే అక్క డ దుకాణాల వద్ద టెంట్లు వేసి సిట్టింగ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అనధికారికంగా టార్గెట్లు విధించడంతో చేసేదేమీ లేక అమ్మకాలు అను కున్న లక్ష్యం చేరితే చాలు అన్న తీరులో కాలం వెల్లదీస్తున్నామని ఓసీఐ చెప్పడం కొసమెరుపు. ప్రతిరోజు బెల్టుషాపుల ద్వారా రూ.1.40 కోట్ల దాకా వ్యాపారం సాగుతు న్నట్లు ఎక్సైజ్‌శాఖ అఽధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని 109 మద్యం దుకాణాలు, 28బార్లు, 4 టూరిజం, క్లబ్బులాంటి వాటి ద్వారా బుధవారం నాటికి రూ. 76 కోట్ల మద్యం అమ్మకాలు జరిగనట్లు అధికారులు తెలిపారు.
నాణ్యమైన మద్యం విక్రయాలు..
ఎన్నికల హమీలో భాగంగా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని ప్రైవేట్ షాపుల ద్వారా విక్రయిస్తోంది. జిల్లాలో మొత్తం 109 బ్రాందీ షాపులు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే విక్రయాలు జరపాల్సి ఉంటుంది. అక్కడ మందు తాగేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకూడదు. అన్ని రకాల మద్యం బ్రాండ్లను ఎమ్మార్పీ ధరలకు మాత్రమే విక్రయించాలి. అంటే అక్కడ కొనుగోలు చేయడం. ఇంటికి వచ్చి తాగాలి. ఇందుకు గాను ప్రభుత్వం 14 శాతం లైసెన్సుదారులకు కమీషన ఇస్తుంది.
మాముళ్ల మత్తులో నియంత్రణాధికారులు..
బ్రాందీ షాపు కేవలం అమ్మకాలే జరగాల్సి ఉంటే అక్కడ పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఆడ్డగోలుగా తాపిస్తున్నా.. పోలీసు, ఎక్సైజ్ ఽశాఖలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మద్యం అమ్మకాలు సక్రమంగా జరగడం, కల్తీ లేకుండా చూడడం, ఇతర ప్రాంతాల నుంచి మద్యం సరఫరా రాకుండా చూడడం కోసం ఎక్సైజ్ శాఖ లో ఎనఫోర్స్ మెంట్, టాస్క్‌ఫోర్సు, స్టేట్ టాస్క్‌ఫోర్సు బృందాలు ఉంటాయి. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మకాలు జరిగేలా చూడాలి. జిల్లాలో ఆ పరిస్థితి లేదు. నెలనెలా ఎక్సైజ్, సివిల్ పోలీసులు భారీగా ముడుపులు తీసుకుని బ్రాందీ షాపుల యాజమానులకు పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా బ్రాందీ షాపులు బార్లను తలపిస్తున్నాయి. సిట్టింగ్‌ల కోసం రేకుల షెడ్లు, దిమ్మెలు, కూర్చునేందుకు సీట్లు ఏర్పాటుచేసి తాపిస్తున్నారు. అయినా పోలీసులకు అవి కనిపించడం లేదు. షాపు స్థాయిని బట్టి ప్రతి నెలా రూ.వేలల్లో వసూళ్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి.
భయాందోళనలో జనాలు
కర్నూలు నగర శివారులో గంజాయి బ్యాచలు, మందుబాబులతో జనం భయాం దోళనకు గురవుతున్నారు. గతంలో తాలుకా సీఐ గంజాయి బ్యాచపై కేసులు నమోదు చేసినా పరిస్థితుల్లో మార్పులేదు. దీనికి తోడు మద్యం దుకాణాల వద్ద తాగుబోతులు మద్యం మత్తులో నిత్యం హల్‌చల్ చేస్తున్నారు. దీంతో ఫ్యామిలీస్ అటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దూపాడు వద్ద దేవుడి పేరుతో మద్యం దుకాణాలు ఏర్పాటుచేసి మద్యం దుకాణాల్లో సిట్టింగ్‌లు ఏర్పాటుచేశారు. పంట పొలాలు నాశనమవుతున్నాయని కమ్యూనిస్టు పార్టీల నాయకులు గ్రామస్థులతో కలిసి ఎక్సైజ్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
నిర్ధేశించిన ధరలకే అమ్మకాలు..
మద్యం అమ్మకాల్లో తేడా వస్తే ఉపేక్షించం. దుకాణాల్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నిర్ధేశించిన ధరలకే అమ్మకాలు జరగాలి. బెల్టుషాలు కనిపిస్తే కఠినచర్యలు చేపడ తాం. ఇప్పటికే ఎన్నో కేసులు నమోదు చేశాం.
- శ్రీదేవి, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ