కళలకు ఆదరణ అవసరం
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:14 AM
అంతరించిపోతున్న జానపద కళలకు అన్ని వర్గాల నుంచి ఆదరణ అవసరమని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్య అన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్య
అలరించిన కర్నూలు ఉత్సవ్-2025 ప్రదర్శనలు
కర్నూలు కల్చరల్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): అంతరించిపోతున్న జానపద కళలకు అన్ని వర్గాల నుంచి ఆదరణ అవసరమని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్య అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో వారం రోజులు జరిగే కర్నూలు ఉత్సవ్-2025లో మూడో రోజు సోమవారం సాయంత్రం సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండయ్య తొలుత తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు చిత్ర పటాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించే దిశగా వారం రోజుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. సభాధ్యక్షతన వహించిన కళారత్న పత్తి ఓబులయ్య మాట్లాడుతూ నిత్య కల్యాణం పచ్చతోరణంగా వార రోజుల పాటు టీజీవీ కళాక్షేత్రం కళాప్రదర్శనలతో మారుమోగుతోందని అన్నారు. కళలకు ఎప్పటికీ ప్రేక్షక ఆదరణ ఉంటుందనేందుకు ఈ వేడుకలు నిరూపిస్తున్నాయని అన్నారు. ఈ సమావేశంలో ఆకాశవాణి విశ్రాంత వ్యాఖ్యాత డాక్టర్ వి.పోతన, కార్యక్రమ కో కన్వీనర్లు జీవీ శ్రీనివాసరెడ్డి, గాండ్ల లక్ష్మన్న, కళాక్షేత్రం ప్రతినిధులు మహమ్మద్ మియా, పి.రాజారత్నం, ఇనాయతుల్లా, కె.వి.రమణ, జి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలరించిన పద్య నాటకాలు, నృత్య ప్రదర్శనలు
కర్నూలు ఉత్సవ్-2025లో సోమవారం ఉదయం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాటక రంగ కళాకారులు ప్రదర్శించిన పద్య నాటకాలు అసాంతం ప్రేక్షకులను అలరింపజేశాయి. ఎవరికి వారు పోటాపోటీగా ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పోటీల్లో కళాకారుల పద్యాలతో టీజీవీ కళాక్షేత్రం మారుమోగింది. శ్రీకృష్ణ తులాభారం, చింతామణి, బాలనాగమ్మ, గయోపాఖ్యానం తదితర నాటకాలు పోటీ పడ్డాయి. అనంతరం రవీంద్ర పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన తెలుగు తల్లి వైభవం శాస్త్రీయ నృత్య రూపకాలు, మహమ్మద్ మియా, సుజాత, ఖాజావలి బృందం ఆలపించిన జానపద గీతాలు అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నాట్యాచార్యులు జి. నారాయణస్వామి, విజయలక్ష్మి, మల్లేశ్వరి, కరీముల్లా, ప్రదీప్, రోహిత, ఆంజనేయులు, సాయిచరణ్‌లను శాలువలతో ఘనంగా సత్కరించారు.