ఇప్పటికింతే!
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:27 AM
ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో నియోజకవర్గాల చేర్పులు, మార్పులు ప్రస్తుతానికి లేనట్టే. గత కొద్ది రోజులుగా ఎడతెగని చర్చకు దారితీసిన ఈ అంశాలను ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నియోజకవర్గాల విలీన అంశాలను తాను చూసుకుంటానని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండటంతో పాటు రానున్న జనగణన, నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఈ చేర్పులు, మార్పుల అంశాలను చూద్దామన్నట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు యథాతధంగానే ఉండనున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు ‘ఎవరిదారి వారిది’ అన్నట్టుగా వ్యవహరించటం కూడా ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
- గన్నవరం, పెనమలూరు, నూజివీడు, కైకలూరుపై నిర్ణయం వాయిదా
- ఉమ్మడి కృష్ణా సంగతి తాను చూసుకుంటానన్న సీఎం చంద్రబాబు
- స్థానిక సంస్థల ఎన్నికలు, జనగణన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం
- నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలో అంతిమ నిర్ణయానికి అవకాశం
ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో నియోజకవర్గాల చేర్పులు, మార్పులు ప్రస్తుతానికి లేనట్టే. గత కొద్ది రోజులుగా ఎడతెగని చర్చకు దారితీసిన ఈ అంశాలను ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నియోజకవర్గాల విలీన అంశాలను తాను చూసుకుంటానని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండటంతో పాటు రానున్న జనగణన, నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఈ చేర్పులు, మార్పుల అంశాలను చూద్దామన్నట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు యథాతధంగానే ఉండనున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు ‘ఎవరిదారి వారిది’ అన్నట్టుగా వ్యవహరించటం కూడా ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
గత వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా జిల్లాల విభజన జరిగింది. దీనిపై అప్పట్లోనే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం తప్పులను సరిదిద్ది, ప్రజల అభీష్టం మేరకు చేర్పులు, మార్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా నియోజకవర్గాలలోని ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో మంత్రుల కమిటీకి తమ అభిప్రాయాలతో కూడిన అభ్యర్థనలను అందజేశారు. ప్రజాభీష్టం ఒకలా ఉంటే.. ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు మరోలా ఉండటం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో గందరగోళానికి తావివ్వకూడదని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే కేబినెట్ సబ్ కమిటీ మంత్రులతో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యవహారం తాను చూసుకుంటానని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. దీంతో గన్నవరం, పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాలను ఎటు కలపాలన్న అంశాన్ని భవిష్యత్తులో ముఖ్యమంత్రే నిర్ణయించనున్నారు. ప్రస్తుతానికి అయితే నియోజకవర్గాల మార్పులు, చేర్పుల అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశారు.
గ్రేటర్ విజయవాడ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం!
గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న డిమాండ్ రావటానికి ప్రధాన కారణాలలో విజయవాడ గ్రేటర్ అంశం కూడా ఉంది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు గ్రేటర్ విజయవాడ ప్రతిపాదిత జాబితాలో ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం మండలం, విజయవాడ రూరల్ మండలం, పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు, కంకిపాడు మండలాల పరిధిలోని గ్రామాలు గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదన జాబితాలో ఉన్నాయి. రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో గుంటూరు, విజయవాడ భవిష్యత్తులో జంట నగరాలుగా అభివృద్ధి చెందుతూ అమరావతితో అనుసంధానం కావటానికి అవకాశం ఉంది. ఈ రెండు నగరాలతో కూడా కలిపి అమరావతి సీఆర్‌డీఏ పరిధిలో అతిపెద్ద రాజధానిగా అవతరించటం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు నగరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ విజయవాడ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. గ్రేటర్ విజయవాడకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరింది. మొత్తం 75 గ్రామాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి వారు నివేదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటమే మిగిలి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రభుత్వం గ్రేటర్ విజయవాడపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాలు వేర్వేరు జిల్లాల్లో ఉన్నప్పటికీ కూడా విశాఖ తరహాలో గ్రేటర్ విజయవాడ దిశగా ప్రభుత్వం ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
డివిజన్లలో మార్పుల్లేవ్
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి డివిజన్ల మార్పులు జరగలేదు. దీనిని బట్టి చూస్తే.. ప్రస్తుతానికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదన్న సంకేతాలు వెలువడ్డాయి. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను విలీనం చేయాలనుకుంటే.. గన్నవరం రెవెన్యూ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేసేవారు. అలాంటిదేమీ లేకపోవటంతో ఈ రెండు నియోజకవర్గాలను విలీనం చేసే ఉద్దేశ్యం ప్రస్తుతానికి లేదన్నది అర్థమవుతోంది.
ఆ మూడు నియోజకవర్గాలపై ఇప్పటికీ ఆశలు
నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న అంశంపై తాను పరిశీలించి న్యాయం చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను మాత్రమే కలిపితే కొత్త రెవెన్యూ డివిజన్ అవసరం అవుతుంది. అదే నూజివీడు నియోజకవర్గాన్ని కూడా కలిపితే అవసరం ఉండదు. ఎందుకంటే నూజివీడు వేరే జిల్లాలో ఉన్నా.. రెవెన్యూ డివిజన్‌గా ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే నూజివీడును ఎన్టీఆర్‌లో కలిపితే రెవెన్యూ డివిజన్‌గా కూడా అదే ఉంటుంది కాబట్టి .. కొత్త రెవెన్యూ డివిజన్ అవసరం లేదన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. సీఎం చంద్రబాబు గన్నవరం, పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని ప్రజలు భావిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే నాకు అభ్యంతరం లేదు
-పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్
జిల్లాల చేర్పులు, మార్పుల నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలిపే విషయంలో తనకు అభ్యంతరాలు ఉన్నాయని ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. కృష్ణాజిల్లా పునర్విభజన విషయంలో తనను మంత్రివర్గ ఉపసంఘం సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాను కూడా ఇంతవరకు ఈ విషయంపై ఎక్కడా చర్చించలేదని తెలిపారు. మెజారిటీ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను ఆహ్వానిస్తానని చెప్పారు. పునర్విభజన విషయంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉందని వ్యాఖ్యానించారు.