Share News

ఆ మండలం మాకొద్దు

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:46 PM

‘ప్రాణాలైనా అర్పిస్తాం కానీ పెద్దహరివాణం మండలంలో మాత్రం మా గ్రామాలను కలిపితే చూస్తూ ఊరుకునేది లేదు..’

   ఆ మండలం మాకొద్దు
ఆదోని ఆర్‌అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వద్ద కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ఎదుట 16 గ్రామాల ప్రజల నిరసన

కలెక్టర్‌ ఎదుట 16 గ్రామాల ప్రజలు నిరసన

ఢణాపురంలో రెండు గంటల పాటు రాస్తారోకో

ఆదోని జిల్లా కోసం కొనసాగుతున్న నిరసనలు

ఆదోని రూరల్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘ప్రాణాలైనా అర్పిస్తాం కానీ పెద్దహరివాణం మండలంలో మాత్రం మా గ్రామాలను కలిపితే చూస్తూ ఊరుకునేది లేదు..’ అంటూ ఆదోని మండలంలోని 16 గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆదోని పర్యటనకు వచ్చిన కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ఎదుట మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌ ఎదుట బైఠాయించి ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ప్రజాభిప్రాయం లేకుండానే తమ గ్రామాలను పెద్దహరివాణం మండలంలో ఏలా కలుపుతారని కలెక్టర్‌ను నిలదీశారు. ఒకప్పుడు పెద్దహరివాణం గ్రామస్థులు తమ గ్రామాన్ని కర్ణాటకలో కలపాలని డిమాండ్‌ చేశారని, ఆ గ్రామం మొత్తం కన్నడ మాట్లాడుతారని, కర్ణాటక రాష్ర్టానికి కూత వేటు దూరంలో ఉండే పెద్దహరివాణంలో తమ గ్రామాలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఆదోనికి దగ్గరగా ఉండే చాగి, ఢణాపురం, నారాయణపురం, బసాపురం, గణేకల్‌, కడితోట, పాడేగల్లు తదితర గ్రామాలను 35 కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్దహరివాణంలో కలపాలని ఎవరు సలహాలు ఇచ్చారంటూ కలెక్టర్‌తో పాటు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌కుమార్‌లను నిలదీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ సిరి మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. గ్రామాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి ప్రభుత్వానికి తెలియజేస్తామని కలెక్టర్‌ భరోసానిచ్చారు. ప్రజాభీష్టం మేరకే మండలాల ఏర్పాటు, గ్రామాల విలీనం ఉంటుందన్నారు. అయితే తమ గ్రామాల్లో ఎలాంటి సమావేశాలు జరగలేదని, తమను సంప్రదించకుండానే పెద్దహరివాణంలోకి తమ గ్రామాలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. తమ గ్రామాలను కొత్త మండలంలోకి చేర్చవద్దంటూ కలెక్టర్‌ను ప్రాధేయపడ్డారు. అనంతరం ఢణాపురం రోడ్డుపై రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనల్లో నాయకులు గోపాల్‌ రెడ్డి, శ్రీకాంత రెడ్డి, గణేకల్‌ విరుపాక్షి, చాగి మాల రాము, ఢణాపురం ఈరన్న, మల్లి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆదోని జిల్లా కోసం చేస్తున్న రిలే దీక్షలు బుధవారం నాటికి 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసనలకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌, ఆదోని ఇనచార్జి మల్లప్ప తదితరులు మద్దతు పలికారు.

Updated Date - Dec 03 , 2025 | 11:46 PM