Share News

Education Department: టీచర్లకూ టెట్‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:49 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక ప్రతిపాదన చేసింది. ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనుకునేవారితో పాటు టెట్‌ అర్హత లేని ఇన్‌ సర్వీస్‌ టీచర్లు కూడా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

 Education Department: టీచర్లకూ టెట్‌

  • ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సిందే

  • సుప్రీంకోర్టు తీర్పు అమలుకు చర్యలు

  • త్వరలో నోటిఫికేషన్‌ విడుదలకు కసరత్తు

  • (అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక ప్రతిపాదన చేసింది. ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనుకునేవారితో పాటు టెట్‌ అర్హత లేని ఇన్‌ సర్వీస్‌ టీచర్లు కూడా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. నిరుద్యోగులు, టీచర్లు ఇద్దరూ టెట్‌ రాసేందుకు వీలుగా త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయడానికి కసరత్తు చేస్తోంది. టీచర్లంతా తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని కొద్ది నెలల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టింది. అయితే దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది. 2011లో టెట్‌ అమల్లోకి వచ్చింది. అంతకుముందు టీచర్‌ ఉద్యోగాలు పొందిన వారంతా తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు రెండేళ్లలో టెట్‌ సర్టిఫికెట్‌ పొందాలని ఆదేశించింది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న టీచర్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్‌ ఉండాలని పేర్కొంది. దీంతో టెట్‌తో సంబంధం లేకుండా ఉద్యోగాలు పొంది ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారంతా ఇప్పుడు అందులో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఏర్పడింది. పదోన్నతి అవసరం లేదనుకుంటే ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారు మినహాయింపును పొందవచ్చు. కాగా, టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి(ఎన్‌సీటీఈ)ని కొందరు టీచర్లు ఆశ్రయించారు. అయితే వీరి వినతిని ఎన్‌సీటీఈ తిరస్కరించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై కొందరు టీచర్లు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. ఒకవేళ అక్కడ టీచర్లకు మినహాయింపు లభిస్తే రాష్ట్రంలోనూ ఆ వెసులుబాటు దక్కుతుంది. లేనిపక్షంలో టెట్‌ లేని టీచర్లంతా కచ్చితంగా అందులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

Updated Date - Oct 22 , 2025 | 04:50 AM