Share News

AP Education Department: డిసెంబరు 10 నుంచి టెట్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 03:17 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. అక్టోబరు 24 నుంచి నవంబరు 23 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడిం చింది.

AP Education Department: డిసెంబరు 10 నుంచి టెట్‌

  • షెడ్యూల్‌ విడుదల.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

  • డిసెంబరు 3 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌

  • జనవరి 19న ఫలితాలు విడుదల

  • నేడు నోటిఫికేషన్‌ ఇవ్వనున్న పాఠశాల విద్యాశాఖ

అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. అక్టోబరు 24 నుంచి నవంబరు 23 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడిం చింది. డిసెంబరు 10 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబరు 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. జనవరి 19న ఫలితాలు విడుదల చేయనున్నారు. టెట్‌ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేస్తారు.

ఇవీ మార్గదర్శకాలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈసారి టెట్‌లో ప్రధానంగా రెండు కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీ మార్కుల్లో 5 శాతం సడలింపు ఇస్తున్నారు. ఇకపై పూర్తిగా ఎన్‌సీటీఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. స్కూల్‌ అసిస్టెంట్‌కు సంబంధించిన 2ఏ, 2బీ పేపర్లు టెట్‌ రాసే అభ్యర్థులకు డిగ్రీలో 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45శాతం మార్కులు ఉండాలి. 2011 నుంచి టెట్‌ అమల్లోకి వచ్చింది. అంతకంటే ముందు ఉద్యోగాలు పొందిన టీచర్లు కచ్చితంగా టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు ఇన్‌-సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రాసే అవకాశాన్ని పాఠశాల విద్యాశాఖ కల్పించింది. అయితే ప్రభుత్వ మేనేజ్‌ మెంట్ల టీచర్లకు, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని టీచర్లకు ఇంటర్మీడియట్‌, డిగ్రీలో కనీస మార్కుల నిబంధన వర్తించదు. ఇక 2011 జూలై 29 కంటే ముందు బీఈడీ లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో అడ్మిషన్‌ పొంది ఉంటే వారికి అర్హత మార్కుల శాతంతో సంబంధం లేదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కాగా, 2011కు ముందు కోర్సులు పూర్తిచేసిన వారికి సంబంధిత అర్హత కోర్సు(డిగ్రీ, ఇంటర్‌)లో ఓసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40శాతం మార్కులు ఉండాలి. టెట్‌ నిర్వహణకు పాఠశాల విద్య కమిషనర్‌ నేతృత్వంలో కమిటీని నియమించింది.


రెండు భాషల్లో ప్రశ్నపత్రం

  • 150 ప్రశ్నలతో 150 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ నిర్వహిస్తారు.

  • ప్రశ్నాపత్రం ఇంగ్లిష్‌తో పాటు ఎంపిక చేసుకున్న భాషలో ఉంటుంది.

  • టెట్‌లో ఉత్తీర్ణతకు ఓసీలకు 60శాతం, బీసీలకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 40 శాతం మార్కులు రావాలి.

  • ఇప్పటికే టెట్‌ అర్హత సాధించినవారు మార్కుల మెరుగుదల కోసం మళ్లీ పరీక్ష రాయవచ్చు. టెట్‌ సర్టిఫికెట్‌కు జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది.

  • టీఆర్‌టీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఇస్తారు.

  • 2017కు ముందు స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌, స్కూల్‌ అసిస్టెంట్‌- లాంగ్వేజస్‌కు కలిపి ఉమ్మడిగా టెట్‌ ఉండేది. ఉమ్మడి పేపర్‌లో టెట్‌ అర్హత సాధించినవారు ఇప్పుడు ఎస్‌ఏ-సోషల్‌, ఎస్‌ఏ-లాంగ్వేజస్‌కు వేర్వేరుగా పరీక్ష రాసుకోవచ్చు.

Updated Date - Oct 24 , 2025 | 03:19 AM