Share News

Teacher Eligibility Test Impact: లక్ష మంది టీచర్లపై టెట్‌ ఎఫెక్ట్‌

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:09 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) అందరికీ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్రంలో లక్ష మందికి పైగా టీచర్లపై ప్రభావం చూపుతోంది. వీరిలో దాదాపు 31 వేలమంది ప్రస్తుతం టెట్‌ రాశారు.

Teacher Eligibility Test Impact: లక్ష మంది టీచర్లపై టెట్‌ ఎఫెక్ట్‌

  • టెట్‌ లేని ఉపాధ్యాయులు 1,27,802

  • ఐదేళ్లలోపు రిటైరయ్యేవారు 23,207

  • వీరికి టెట్‌ నుంచి మినహాయింపు

  • పదోన్నతి కావాలంటే రాయాల్సిందే

  • తప్పనిసరిగా రాయాల్సిన వారు 1,04,595

  • ప్రస్తుతం రాసినవారు 30,938

  • మిగిలిన 73,657 మంది పరిస్థితి ఏంటి?

  • మినహాయింపు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు

  • సడలింపు లభించకపోతే పరిస్థితి ఏంటి?

  • వివరాలు కేంద్రానికి పంపిన విద్యా శాఖ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) అందరికీ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్రంలో లక్ష మందికి పైగా టీచర్లపై ప్రభావం చూపుతోంది. వీరిలో దాదాపు 31 వేలమంది ప్రస్తుతం టెట్‌ రాశారు. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారిని మినహాయిస్తే మరో 74 వేలమంది పరిస్థితి ఏంటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఇన్‌ సర్వీసు టీచర్లకు మినహాయింపు లభిస్తుందా? ఒకవేళ మినహాయింపు లభించకపోతే వారి పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్‌ సర్వీస్‌ టీచర్ల టెట్‌ వివరాలను పంపాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను కోరింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరాలను కేంద్రానికి పంపింది. రాష్ట్రంలో 1.51 లక్షల మంది టీచర్లు ఉన్నారు. వారిలో 1,27,802 మంది 2012కు ముందు డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందారు. 2011లో దేశవ్యాప్తంగా టెట్‌ అమల్లోకి వచ్చింది. ఏపీలో మాత్రం 2012లో మొదటిసారి టెట్‌ నిర్వహించారు. అంటే.. 1.27 లక్షల మంది టీచర్లు ఇప్పుడు టెట్‌ అర్హత సాధించాల్సిన అవసరం ఏర్పడింది. వారిలో 23,207 మందికి సర్వీసు ఐదేళ్లలోపే ఉంది. వారికి టెట్‌ నుంచి సుప్రీంకోర్టు మినహాయింపునిచ్చింది. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్‌ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో వారిలోనూ పదోన్నతికి సమీపంలో ఉన్నవారికి టెట్‌ అవసరం వచ్చింది. ఇక 1,04,595 మంది తప్పనిసరిగా టెట్‌ అర్హత సాధించాల్సి ఉంది. వారిలో 30,938 మంది మినహాయింపు లభించినా, లభించకపోయినా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం టెట్‌ రాశారు.


మరో 74 వేలమంది మినహాయింపుపై ఆశతో టెట్‌ జోలికి వెళ్లలేదు. టీచర్లందరికీ టెట్‌ తప్పనిసరి అని ఈ ఏడాది సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి రెండేళ్లలోపు టెట్‌ లేని టీచర్లంతా అర్హత సాధించాలని స్పష్టం చేసింది. వచ్చే జనవరిలో డీఎస్సీ నిర్వహిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తాజాగా టెట్‌ నిర్వహించింది. ఇప్పుడు టెట్‌ రాయనివారు మళ్లీ నోటిఫికేషన్‌ వరకు ఆగాలి. మినహాయింపు లభించకపోతే రెండోసారి అయినా టీచర్లు టెట్‌ రాయాల్సి వస్తుంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వడంతో 23,207మంది టీచర్లు మాత్రం కాస్త ప్రశాంతంగా ఉన్నారు. ఇన్‌సర్వీసు టీచర్లకు టెట్‌ మినహాయింపు కోరుతూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేసింది. ఈ ప్రయత్నాలు ఫలించి మినహాయింపు లభిస్తే దేశవ్యాప్తంగా లక్షల మంది టీచర్లు ఊపిరి పీల్చుకుంటారు.


ఈ వయసులో ఎలా రాయగలం?

2012కు ముందు టీచర్‌ ఉద్యోగాలు పొందినవారంటే.. వారి కనీస సర్వీసు 15 ఏళ్లు. ఇరవై ఏళ్లకు పైగా టీచర్లుగా కొనసాగుతున్నవారు చాలామంది ఉన్నారు. వారిలో చాలా మంది వయసు 50 ఏళ్లు దాటింది. ఈ వయసులో కొత్తగా టెట్‌ రాయడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌కు ఒకే పేపరుతో టెట్‌ జరుగుతుంది. కానీ ఈ సబ్జెక్టులకు టీచర్లు వేర్వేరుగా ఉంటారు. వారి సంబంధిత సబ్జెక్టు నుంచి 20 మార్కులకే ప్రశ్నలు వస్తాయి. టెట్‌ అర్హత సాధించాలంటే 150 మార్కులకు ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు రావాలి. వృత్తిపరంగా ఇన్నేళ్ల అనుభవం ఉన్న టీచర్లు టెట్‌ ఎందుకు ఉత్తీర్ణత సాధించలేరని కొందరు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయంతో ఇన్‌సర్వీసు టీచర్లు టెట్‌ అర్హత సాధించాలని తీర్పులో పేర్కొంది.

టెట్‌కు 2.48 లక్షల మంది హాజరు

ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ఆదివారం ముగిశాయని టెట్‌ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. టీచర్లు, బీఈడీ, డీఈడీ అభ్యర్థులు మొత్తం 2,71,698 మంది దరఖాస్తు చేసుకోగా, 2,48,427(91.43శాతం) మంది పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని పేపర్ల ప్రాథమిక కీ విడుదల చేశామని, మిగిలిన పేపర్ల కీని 26వ తేదీన విడుదల చేస్తామని వివరించారు. అభ్యర్థులు ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే టెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలుపవచ్చని సూచించారు. వ్యక్తిగతంగా, లేఖల రూపంలో వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేశారు.

Updated Date - Dec 22 , 2025 | 05:10 AM