Teacher Eligibility Test: టెట్ రాసేద్దాం
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:27 AM
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను రాయాలని రాష్ట్రంలోని వేలాది మంది టీచర్లు నిర్ణయం తీసుకున్నారు.
32 వేల మంది ఇన్‌సర్వీస్ టీచర్ల దరఖాస్తు
సుప్రీంకోర్టులో ఉపశమనంపై సందేహం
మొత్తంగా దరఖాస్తులు 2.58 లక్షలు
అత్యధికంగా మహిళలే
అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను రాయాలని రాష్ట్రంలోని వేలాది మంది టీచర్లు నిర్ణయం తీసుకున్నారు. 32 వేల మందికి పైగా ఇన్‌సర్వీసు టీచర్లు టెట్‌కు దరఖాస్తు చేయగా.. మొత్తంగా 2,58,638 అప్లికేషన్లు వచ్చాయి. ఇన్‌సర్వీసు టీచర్లకు కూడా టెట్ తప్పనిసరని పేర్కొంటూ సుప్రీంకోర్టు గత సెప్టెంబరులో ఇచ్చిన తీర్పుపై ఏపీతో పాటు పలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో టెట్ నుంచి మినహాయింపు లభిస్తుందని దేశవ్యాప్తంగా టీచర్లు ఎదురుచూస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం.. గత నెల టెట్ నోటిఫికేషన్ జారీచేసింది. వచ్చే నెల నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే మినహాయింపు లభిస్తుందో లేదోనన్న సందేహంతో 32 వేల మంది టీచర్లు టెట్ రాసేందుకు సిద్ధపడ్డారు. టెట్ దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగిసింది. మొత్తం 32,016 మంది ఇన్‌సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేశారు.
2 వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్!
వచ్చే ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 16వేలకు పైగా పోస్టులు భర్తీచేసినా.. కొత్తగా ఏర్పడే ఖాళీలతో 2 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో టెట్‌కు దరఖాస్తులు పెరిగాయి. కాగా, ఇప్పటికే టీచర్ ఉద్యోగాల్లో ఉన్నవారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తేదీ నుంచి రెండేళ్లలో టెట్ అర్హత సాధించాల్సి ఉంది.
ఉత్తీర్ణత శాతం పెంపునకు ‘సంకల్ప్’
ఇంటర్ విద్యాశాఖ 50 రోజుల ప్రణాళిక
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపు లక్ష్యంతో ఇంటర్ విద్యాశాఖ ‘సంకల్ప్’ పేరుతో 50 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. సోమవారం నుంచే ఈ ప్రణాళికను అమలు చేయనుంది. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ఆధారంగా వారిని 3 రకాలుగా వర్గీకరిస్తారు. 50రోజుల ప్రణాళికలో రోజూ ఉదయం నుంచి 12.40 గంటల వరకు రెగ్యులర్ సిలబస్ బోధిస్తారు. మధ్యాహ్నం పునశ్చరణ, అసైన్‌మెంట్లు, స్లిప్‌టెస్ట్‌లు నిర్వహిస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం సమయాన్ని స్లాట్లుగా విభజించి.. ఏ కేటగిరీలో ఉన్న విద్యార్థులకు మొత్తం సిలబ్‌సను రివిజన్ చేస్తా రు. బీ, సీ కేటగిరీల్లో ఉన్న విద్యార్థులకు ఒక పెద్ద ప్రశ్న, రెండు చిన్న ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకునేలా బోధిస్తారు.