పర్యాటకులకు పరీక్ష!
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:23 AM
ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌కు వెళ్లే మార్గం అధ్వానంగా ఉండడంతో రాకపోకలకు పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రోడ్డు నిర్మించిన తరువాత ఐదేళ్లు సదరు కాంట్రాక్టర్ నిర్వహణ చేపట్టాల్సి ఉండగా, కనీసం పట్టించుకోలేదు. దీంతో రోడ్డు గతుకులు, కోతకు గురై ప్రమాదకరంగా తయారైంది.
అధ్వానంగా వంజంగి రహదారి
కాంట్రాక్టర్ కనీస నిర్వహణ చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి
పట్టించుకోని ఇంజనీరింగ్ అధికారులు
నెల రోజుల్లో ప్రారంభంకానున్న పర్యాటక సీజన్
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌కు వెళ్లే మార్గం అధ్వానంగా ఉండడంతో రాకపోకలకు పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రోడ్డు నిర్మించిన తరువాత ఐదేళ్లు సదరు కాంట్రాక్టర్ నిర్వహణ చేపట్టాల్సి ఉండగా, కనీసం పట్టించుకోలేదు. దీంతో రోడ్డు గతుకులు, కోతకు గురై ప్రమాదకరంగా తయారైంది.
మండల కేంద్రం పాడేరు నుంచి వంజంగి హిల్స్‌కు చేరుకునేందుకు ఆరు కిలోమీటర్ల వరకు తారురోడ్డు ఉంది. కాగా అక్కడి నుంచి వంజంగి హిల్స్ కూడలి, కొత్తవలస గ్రామానికి 2020లో రూ.2 కోట్ల 19 లక్షల వ్యయంతో ఐదు కిలోమీటర్ల మేర తారురోడ్డు వేశారు. పర్యాటకులు వంజంగి గ్రామం నుంచి కొండపైకి వెళ్లాలంటే ఈ రోడ్డు మార్గమే కీలకం. 2020లో రోడ్డు పూర్తికావడం, అప్పుడే వంజంగి మేఘాల కొండలు వెలుగులోకి రావడంతో చక్కని రోడ్డుపై పర్యాటకుల రాకపోకలు సాఫీగానే సాగాయి. అయితే 2022 నుంచి రోడ్డు గతుకులు, కోతకు గురైంది. దీంతో ప్రయాణం కష్టంగా మారింది.
నిర్వహణ లేమితో..
వంజంగి గ్రామం నుంచి హిల్స్ కూడలి మీదుగా కొత్తవలస గ్రామం వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల రోడ్డును 2020లో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనలో భాగంగా నిర్మించారు. అప్పటి వరకు ఆ ప్రాంతానికి ఎటువంటి రోడ్డు మార్గం లేదు. పీఎంజీఎస్‌వైలో తారురోడ్డు నిర్మించిన తరువాతనే వంజంగి మేఘాల కొండ వెలుగులోకి వచ్చింది. అయితే ఐదేళ్ల క్రితం రోడ్డు నిర్మించడం మినహా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డుకు ఎటువంటి నిర్వహణ చేపట్టిన దాఖలాలు లేవు. వంజంగి హిల్స్ పర్యాటకంగా ప్రాచుర్యం పొందినప్పటికీ, ఈ మార్గం అభివృద్ధికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో రోడ్డు పాడవడంతో పాటు వర్షాలకు రోడ్డు అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్డు ఇరుకుగా మారడంతో ఎదురుగా ఏదైనా వాహనం వస్తే తప్పుకోలేని పరిస్థితి నెలకొంది. అలాగే ఈ మార్గంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వాహనాలు అదుపు తప్పి లోయలోకి పోయే ప్రమాదముంది. వాస్తవానికి పీఎంజీఎస్‌వై నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ ఐదేళ్ల పాటు రోడ్డు నిర్వహణ పనులు చూడాలి. కానీ కాంట్రాక్టర్, ఇంజనీర్లు కుమ్మక్కుకావడంతో దీనిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్ ప్రారంభంకానుండడంతో త్వరితగతిన ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.