Inter Admissions: ఇంటర్‌పై టెన్త్ ఫలితాల దెబ్బ
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:41 AM
పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గుదల ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై ప్రభావం చూపింది. 2024-25 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అన్ని రకాల యాజమాన్య కాలేజీల్లో మొత్తంగా 24,125 అడ్మిషన్లు తగ్గాయి.
అడ్మిషన్లపై ఉత్తీర్ణత తగ్గుదల ప్రభావం
ఈ ఏడాది తగ్గిన 24,125 అడ్మిషన్లు
ప్రైవేటు కాలేజీల్లో భారీగా తగ్గుదల
ప్రభుత్వ కాలేజీలపై ప్రభావం స్వల్పమే
అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గుదల ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై ప్రభావం చూపింది. 2024-25 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అన్ని రకాల యాజమాన్య కాలేజీల్లో మొత్తంగా 24,125 అడ్మిషన్లు తగ్గాయి. అయితే ఈ నెలాఖరు వరకు అడ్మిషన్లకు గడువు ఉంది. పాలిటెక్నిక్‌లలో, ఆర్జీయూకేటీల్లో సీట్లు లభించని వారు ఇంటర్‌లో చేరే అవకాశం ఉంటుంది. అయితే అది సల్పంగానే ఉంటుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2024లో టెన్త్‌లో 86.69 శాతం ఉత్తీర్ణతతో 5.34 లక్షల మంది పాస్ అయ్యారు. 2025లో ఉత్తీర్ణత 81.14 శాతానికి (4.98 లక్షల మంది) పడిపోయింది. సుమారు 35 వేల విద్యార్థులు తగ్గడంతో ఆ ప్రభావం ఇంటర్ విద్యపై పడింది. ముఖ్యంగా ప్రైవేటు కాలేజీల్లో భారీగా దాదాపు 24 వేల అడ్మిషన్లు తగ్గాయి. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం పెద్దగా ప్రతికూల ప్రభావం కనిపించలేదు. 2024కు, ఈ ఏడాదికి వెయ్యి అడ్మిషన్ల మేర వ్యత్యాసం ఉన్నా.. ఈ నెలాఖరుకు అది కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సీబీఎ్‌సఈ కాలేజీలు, కేజీబీవీలు, గిరిజన సంక్షేమ కాలేజీలు, ఏపీఆర్‌జేసీలు, మోడల్ స్కూల్స్‌లో గతేడాదితో పోలిస్తే అడ్మిషన్లు పెరిగాయి.
ఉత్తీర్ణత తగ్గింది... మార్కులు పెరిగాయి
ఈ ఏడాది పది ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గినా, మార్కులు మాత్రం పెరిగాయి. వేల సంఖ్యలో విద్యార్థులకు 550 మార్కులు దాటాయి. 1,680 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 65.36 శాతం మంది విద్యార్థులు ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులకు మార్కులు భారీగా రావడంతో ఎక్కువ మందిని కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించారు. మెరుగైన మార్కులు వచ్చాయని, ఐఐటీల్లో సీట్లు పొందుతారనే ఆలోచన తల్లిదండ్రుల్లో పెరిగింది. ఫలితంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గాయి.