Konaseema District: క్లాస్‌లో టెన్త్ విద్యార్థిని మృతి
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:15 AM
ఆ విద్యార్థిని తరగతి గదిలో మొదటి బెంచ్‌లో కూర్చొని పాఠాలు వింటోంది. ఈ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది.
క్లాసు జరుగుతుండగా ఘటన
కోనసీమ జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విషాదం
రామచంద్రపురం(ద్రాక్షారామ)/రాయవరం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆ విద్యార్థిని తరగతి గదిలో మొదటి బెంచ్‌లో కూర్చొని పాఠాలు వింటోంది. ఈ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. గమనించిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆ విద్యార్థిని మరణించిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషాద ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి (15) రామచంద్రపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. శనివారం పాఠశాలకు హాజరైంది. తరగతి గదిలో క్లాసు జరుగుతుండగా మొదటి బెంచ్‌లో కూర్చున్న సిరి 9.45 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా బెంచి పైనుంచి కింద పడిపోయింది. దీంతో ఉపాధ్యాయుడు, తోటి విద్యార్థులు పైకి లేపగా.. అప్పటికే ఆమెలో చలనం లేదు. దీంతో యాజమాన్యం హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ నుంచి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సిరి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సిరి మృతిపై తల్లిదండ్రులు సుజాత, వెంకటరెడ్డి పిర్యాదుతో రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సిరి మృతికి కారణం ఏంటనేది తెలియరాలేదు. బెంచిపై కూర్చొన్న సిరి.. ఒకసారి దగ్గి మెడ ముందుకు వాల్చడం, తర్వాత ఒక్కసారిగా బెంచిపై నుంచి కిందకి పడిపోవడం సీసీ కెమెరాలో రికార్డయింది. కుమార్తె మృతితో బాధిత తల్లితండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.