Public Exams: మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:17 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి శుక్రవారం షెడ్యూలు విడుదల చేశారు.
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి శుక్రవారం షెడ్యూలు విడుదల చేశారు. గతేడాది తరహాలోనే రోజు మార్చి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. 16 నుంచి 30వ తేదీ వరకు రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. 30న కాంపోజిట్ కోర్సు విద్యార్థులకు, ఓఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. ఆ రోజుతో టెన్త్ పబ్లిక్ పరీక్షలు ముగుస్తాయి. రెగ్యులర్ విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45వరకు, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పరీక్షలు 11.30గంటల వరకే జరుగుతాయి. ఇప్పటివరకూ 6,38,893 మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరు కాకుండా గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఇతర ప్రైవేటు విద్యార్థులు సుమారు 30వేల మంది పరీక్షలు రాస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మూల్యాంకనం అనంతరం మార్కుల లెక్కింపులో పొరపాట్లు వచ్చినందున, ఈసారి మార్కుల నమోదులో కొన్ని మార్పులు చేశారు.