Share News

Paper Evaluation Time: ఒక్కో పేపర్‌కు 12 నిమిషాలు

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:35 AM

పదో తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంపై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Paper Evaluation Time: ఒక్కో పేపర్‌కు 12 నిమిషాలు

  • కనీసం అంత టైం దిద్దాల్సిందే.. టెన్త్‌ మూల్యాంకనంపై నిర్ణయం

  • రోజుకు గరిష్ఠంగా 40 పేపర్లు.. పొరపాట్లు రాకుండా చర్యలు

  • ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లు.. 20 శాతం మందికి అవకాశం?

అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంపై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026 పబ్లిక్‌ పరీక్షల అనంతరం జరిగే మూల్యాంకనంలో ప్రతి పేపర్‌ను టీచర్లు కనీసం 12 నిమిషాల పాటు దిద్దాలని పేర్కొంది. గరిష్ఠ సమయం 15 నిమిషాలుగా నిర్ణయించింది. అలాగే ఇప్పటివరకు రోజుకు 40 పేపర్లను అన్ని రోజులకు కలిపి సగటు తీసుకునే విధానం ఉండగా, ఇక నుంచి ప్రతిరోజూ 40 పేపర్లు దాటకూడదని తెలిపింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి. విజయరామరాజు సోమవారం అధికారులతో నిర్వహించిన వెబ్‌ ఎక్స్‌ సమావేశంలో దీనిపై స్పష్టతనిచ్చారు. 2025 పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకనంలో పొరపాట్లు వచ్చాయి. మార్కుల నమోదులో జరిగిన పొరపాట్లు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఈసారి ముందస్తు చర్యలు చేపట్టారు. ఇకనుంచి పేపర్లు దిద్దే సమయంపై కచ్చితత్వం ఉండేలా మార్పులు చేశారు. ఉదాహరణకు వారం పాటు మూల్యాంకనం జరిగితే ఒక టీచర్‌ కొన్ని రోజులు తక్కువ పేపర్లు, కొన్ని రోజులు ఎక్కువ పేపర్లు దిద్దుతున్నారు. ఒక్కో పేపర్‌ను నాలుగైదు నిమిషాల్లో దిద్దేస్తున్నారు. ఫలితంగా పొరపాట్లు వస్తున్నాయని భావించిన పాఠశాల విద్యాశాఖ ఇకపై తప్పనిసరిగా 12 నిమిషాల సమయం పేపర్‌కు కేటాయించాలని స్పష్టంచేసింది. ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ విధానానికి కూడా స్వస్తి పలికింది. ఒకవేళ ఏవైనా కారణాలతో ఒకరోజు ఒక టీచర్‌ 40 కంటే తక్కువ పేపర్లు దిద్దితే ఆ లోటును తర్వాత రోజు భర్తీ చేసుకునే అవకాశం ఇక ఉండదు. కాగా, డిసెంబరు 15 తర్వాత పదో తరగతి విద్యార్థులను ఇతరత్రా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయొద్దని డైరెక్టర్‌ ఆదేశించారు. డిసెంబరు 6 నుంచి టెన్త్‌ విద్యార్థులకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. అలాగే 2026 పబ్లిక్‌ పరీక్షల్లో ఇన్విజిలేటర్లుగా 20 శాతం మంది ప్రైవేటు టీచర్లను తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది.


  • బీఈడీ-ఎస్జీటీలకు బ్రిడ్జి కోర్సు తప్పనిసరి

  • ఆరు నెలల కోర్సు పూర్తిచేయాలి: విద్యాశాఖ

అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): బీఈడీ అర్హతతో ఎస్జీటీలుగా నియమితులైనవారు తప్పనిసరిగా ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2018-23 మధ్య కాలంలో బీఈడీతో ఎస్జీటీలుగా నియమితులైన టీచర్లు డిసెంబరు 25 వరకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని సూచించింది. కాగా, ఎస్జీటీ ఉద్యోగాలకు డీఈడీ చేసినవారు మాత్రమే అర్హులని గతేడాది సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బీఈడీ చదివిన వారు స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు పరిమితం కావాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా అప్పటికే బీఈడీతో ఎస్జీటీలుగా నియమితులైనవారు బ్రిడ్జి కోర్సు పూర్తిచేయాలని ఎన్‌సీటీఈ ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్రిడ్జి కోర్సుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబరు 24 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దానిపై ఇప్పటివరకూ నిర్లక్ష్యం ప్రదర్శించిన రాష్ట్ర ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ వారం తర్వాత తీరిగ్గా ఇప్పుడు ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - Dec 02 , 2025 | 04:37 AM