Share News

మచిలీపట్నంలో ఉద్రిక్తత

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:46 AM

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేయవద్దంటూ మచిలీపట్నంలో వైసీపీ నాయకులు శుక్రవారం నిర్వహించిన ర్యాలీ తోపులాటలు, వాగ్వాదాలతో ఉద్రిక్తతకు దారి తీసింది.

మచిలీపట్నంలో ఉద్రిక్తత

- ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేయవద్దంటూ వైసీపీ ర్యాలీ

- అనుమతిలేదని అడ్డుకున్న పోలీసులు

- వాగ్వాదానికి దిగిన వైసీపీ నేతలు పేర్ని, కైలా, సింహ్రాది, దేవినేని

- వైసీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేయవద్దంటూ మచిలీపట్నంలో వైసీపీ నాయకులు శుక్రవారం నిర్వహించిన ర్యాలీ తోపులాటలు, వాగ్వాదాలతో ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తొలుత భాస్కరపురం గాడెల్లి డేవిడ్‌ ఇంటి నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మెడికల్‌ కళాశాల వరకు ర్యాలీగా బయలుదేరారు. వారు వెళ్లకూడదని పోలీసు ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నందున కళాశాల వద్ద ఆందోళన చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి వస్తున్న దేవినేని అవినాష్‌ కారును అడ్డుకున్నారు. అవినాష్‌ మూడు స్తంభాల సెంటర్‌ నుంచి కాలినడకన భాస్కరపురానికి వెళ్లారు. పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్‌, కైలే అనిల్‌కుమార్‌, మొండితోక జగన్మోహనరావు, బందరు నియోజకవర్గం ఇన్‌చార్జి పేర్ని కిట్టు, పెడన నియోజక వర్గం ఇన్‌చార్జి ఉప్పాల రాము, మాజీ మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటి మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ డిప్యూటి మేయర్‌ లంకా సూరిబాబు తదితరులు రాడార్‌ కేంద్రానికి చేరుకున్నారు. రాడార్‌ కేంద్రం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున బారీకేడ్లు పెట్టడంతో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం వైసీపీ నాయకులు రోడ్డుపై బైటాయించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో వైసీపీ నాయకులు మాట్లాడారు. సీఎం చంద్రబాబు మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు వారికి అప్పచెబితే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ప్రజా ఉద్యమాలు చేస్తుంటే పోలీసులతో అడ్డుకోవడం సబబు కాదన్నారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన కళాశాలల్లో ఇప్పుడు తరగతులు నడుస్తున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్ని మెడికల్‌ కళాశాలలు వచ్చాయో, జగన్‌ హయాంలో ఎన్ని వచ్చాయో అందరికీ తెలుసన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:46 AM