ZPTC By Election: ఉద్రిక్తతల మధ్య ఒంటిమిట్ట ఉపఎన్నిక
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:31 AM
ఉద్రిక్తతల మధ్య మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి అన్ని పోలింగ్ కేంద్రాల్లో...
రాయచోటి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఉద్రిక్తతల మధ్య మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి అన్ని పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ కొన్నిచోట్ల టీడీపీ ఏజెంట్లను బెదిరించారు. ఈ సమాచారం అందుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని టీడీపీ ఏజెంట్లకు ధైర్యం చెప్పారు. వైసీపీ మూకలకు వార్నింగ్ ఇచ్చారు. రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. చిన్నకొత్తపల్లె పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన టీడీపీ సానుభూతిపరులను వైసీపీ ఏజెంట్లు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం అందుకుని అక్కడికి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వెళ్లారు. మంత్రి రావడంతో టీడీపీ సానుభూతి పరులు తమను ఇబ్బంది పెడుతున్న వైసీపీ ఏజెంట్లపైకి తిరగబడ్డారు. సాలాబాదు బూత్‌లో వైసీపీ నాయకులు ఏకపక్షంగా ఓటింగ్ చేసుకుంటున్నట్లసమాచారం రావడంతో అక్కడికి మంత్రి చేరుకుని అడ్డు చెప్పారు. మంత్రి అనుచరులు ఓటింగ్‌ను అడ్డుకున్నారు. మంటపంపల్లె పోలింగ్ కేంద్రంలో టీడీపీకి పట్టు ఉంది. అయితే ఇక్కడ వైసీపీ ఏజెంట్లు ఓటింగ్ మందకొడిగా సాగేలా చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో మంత్రి మండిపల్లె అక్కడికి చేరుకుని పోలింగ్ అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ నాయకులకు కొద్దిపాటి ఘర్షణ జరిగింది. ఒంటిమిట్లలో పోలింగ్ 81.53 శాతంగా నమోదైంది.