Share News

Health Department Scam: టెండర్లలో గూడుపుఠాణి

ABN , Publish Date - Sep 01 , 2025 | 05:34 AM

ఆరోగ్య శాఖలో టెండర్ల ప్రక్రియ ప్రహసనంలా మారింది. ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య, సర్జికల్‌ పరికరాల కోసం పిలిచే టెండర్లలో కంపెనీల ప్రతినిధులతో కుమ్మక్కై ఏపీఎంఎస్ఐడీసీ (ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌) అధికారులు...

Health Department Scam: టెండర్లలో  గూడుపుఠాణి

  • ఆరోగ్య శాఖలో ప్రహసనంలా మారిన ప్రక్రియ

  • నచ్చిన సంస్థకు కట్టబెట్టడానికి అధికారుల పాట్లు

  • పరికరాలు, మందుల కంపెనీలతో ముందే బేరాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆరోగ్య శాఖలో టెండర్ల ప్రక్రియ ప్రహసనంలా మారింది. ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య, సర్జికల్‌ పరికరాల కోసం పిలిచే టెండర్లలో కంపెనీల ప్రతినిధులతో కుమ్మక్కై ఏపీఎంఎస్ఐడీసీ (ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌) అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య పరికరాల కోసం ప్రభుత్వం ఏటా దాదాపు రూ.2 వేల కోట్ల వరకూ బడ్జెట్‌ కేటాయిస్తోంది. ఈ నిధులతో ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా కార్పొరేషన్‌ టెండర్లు పిలిచి ఎల్‌-1గా వచ్చిన కంపెనీల నుంచి కావాల్సిన మందులు, పరికరాలు సేకరించడం కొన్నేళ్ల నుంచి జరుగుతున్నదే. అయితే ఇప్పుడు ఈ టెండర్ల ప్రక్రియ పూర్తిగా దారితప్పింది. ఈ ఏడాది జూన్‌లో డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులకు పిడియాట్రిక్‌ వెంటిలేటర్లు, సాధారణ వెంటిలేటర్లు, అనస్థీషియా వర్క్‌ స్టేషన్‌, ఓ.టి. లైట్లు కావాలని కార్పొరేషన్‌కు లేఖ రాశారు. దాదాపు రూ.20 కోట్లు విలువైన ఈ వస్తువుల కోసం కార్పొరేషన్‌లోని ఎక్విప్‌మెంట్‌ విభాగం టెండర్‌ పిలిచింది. టెండర్‌లో పాల్గొన్న కంపెనీలు తాము సరఫరా చేసే వస్తువులకు సంబంధించిన డెమోలు ఇచ్చాయి. ఇక ఎల్‌-1 కంపెనీని ఎంపిక చేసి, పర్చేజ్‌ ఆర్డర్లు ఇవ్వడమే మిగిలింది. ఇంతలోనే అకస్మాత్తుగా టెండర్లు రద్దు చేసిన ఎక్విప్‌మెంట్‌ విభాగం.. వెంటనే రీ-టెండర్లు పిలిచింది. తాము ముందుగా బేరాలు కుదుర్చుకున్న కంపెనీకి చెందిన పరికరాలు ఎంపిక కాకపోవడం వల్లనే టెండర్‌ రద్దు చేశారన్న విమర్శలొస్తున్నాయి.


బేరం కుదిరిన కంపెనీకే...

నిబంధనల ప్రకారం బలమైన కారణం ఉంటే తప్ప టెండర్లు రద్దు చేయడానికి వీల్లేదు. కానీ ఎక్విప్‌మెంట్‌ విభాగం అధికారులకు ఇవన్నీ పట్టవు. మరోవైపు మొదటిసారి టెండర్లు పిలిచినప్పుడు పిడియాట్రిక్‌ వెంటిలేటర్లు, సాధారణ వెంటిలేటర్లు, అనస్థీషియా వర్క్‌ స్టేషన్‌, ఓ.టి.లైట్లకు వేర్వేరుగా టెండర్లు పిలిచారు. ఇప్పుడు రీ-టెండర్లలో మాత్రం అన్నీ కలిపి ఒకే ప్యాకేజీ కింద పేర్కొన్నారు. తొలుత ఒక్కో పరికరానికి ఒక్కో కంపెనీ టెండర్‌లో పాల్గొనే అవకాశం ఉండేది. ఇప్పుడు మార్చిన నిబంధన ప్రకారం అన్ని పరికరాలు సరఫరా చేయగలిగిన కంపెనీ మాత్రమే టెండర్‌ వేసే వెసులుబాటు ఉంటుంది. ముందుగా బేరం కుదుర్చుకున్న కంపెనీకి అన్ని పరికరాలు సరఫరా చేసే ఆప్షన్‌ ఉండటంతో, దానికే టెండర్‌ కట్టబెట్టేందుకే ఎక్విప్‌మెంట్‌ విభాగం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు వస్తున్నాయి.


స్థానిక టెండర్లలోనూ ఇష్టారాజ్యం

ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేయని మందులు, సర్జికల్‌ పరికరాలను ఆస్పత్రుల సూపరింటెండెంట్లే కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. వీటికోసం స్థానికంగానే టెండర్లు పిలుస్తారు. ఇటీవల కర్నూలు ఆస్పత్రి అధికారులు స్థానిక కొనుగోలుకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానించారు. టెండర్‌ నోటిఫికేషన్‌లో మందులు, సర్జికల్‌ వస్తువులు, ల్యాబ్‌ రీఏజెంట్స్‌, ఆర్థో, న్యూరో ఇంప్లాంట్స్‌, కార్డియాలజీ ఐటమ్స్‌ కొనుగోలుకు ప్రకటన ఇచ్చారు. టెండర్లలో పాల్గొనేందుకు 10రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. పైగా టెండర్లలో పాల్గొనే ప్రతి కంపెనీ రూ.5లక్షలు డిపాజిట్‌ కట్టాలన్న నిబంధన విధించారు. రూ.కోట్ల విలువైన టెండర్లు ఆహ్వానించే ఏపీఎంఎస్ఐడీసీ కూడా కంపెనీలకు దాదాపు నెల రోజుల సమయం ఇస్తుంది. ఇక్కడ రూ.3 లక్షల డిపాజిట్‌ చెల్లిస్తే సరిపోతుంది. కర్నూలు అధికారులు మాత్రం రోజులను కుదించడంతో పాటు డిపాజిట్‌ భారీగా పెంచేశారు. పేపర్‌ ప్రకటన ఆధారంగా కర్నూలు వెళ్లిన ఆయా కంపెనీల ప్రతినిధులకు ఒక పెన్‌డ్రైవ్‌ ఇచ్చి, అందులో ఉన్న ప్రకారం బిడ్‌లు దాఖలు చేయాలని సూచించారు. తీరా ఆ పెన్‌డ్రైవ్‌ తెరిస్తే అందులో ఉన్న పత్రాల్లో కేవలం ఎన్టీఆర్‌ వైద్య సేవ నిధులకు సంబంధించిన పరికరాలు మాత్రమే సరఫరా చేసేందుకు బిడ్‌ దాఖలు చేయాలని పేర్కొన్నారు. వాటిపై సూపరింటెండెంట్‌ సంతకం కూడా లేకపోవడం విశేషం. పాదర్శకంగా నిర్వహించాల్సినటెండర్‌ ప్రక్రియను ఇంత రహస్యంగా ఎందుకు చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. ఈ వ్యవహారంపై డీఎంఈ అధికారులు దృష్టి సారించాలని కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - Sep 01 , 2025 | 05:35 AM