అప్పుల బాధతో కౌలురైతు బలవన్మరణం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:49 PM
అప్పుల బాధతో ఓ కౌలురైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కొండుపల్లె గ్రామంలో చోటుచేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ బుచ్చన్న తెలిపారు.
ఉయ్యాలవాడ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): అప్పుల బాధతో ఓ కౌలురైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కొండుపల్లె గ్రామంలో చోటుచేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ బుచ్చన్న తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన సిద్దంరెడ్డి రామచంద్రారెడ్డి(50) కొండుపల్లె, బాచాపురం గ్రామాల్లో 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. అందులో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసేవాడు. ఐదేళ్లుగా పంటలు సరిగా పండక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. పంట సాగు కోసం కొందరు వ్యక్తుల నుండి దాదాపుగా రూ. 16 లక్షలు అప్పు చేశాడు. అప్పు ఎలా తీర్చాలో తెలియక మదనపడేవాడు. ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు గుర్తించి ఆళ్లగడ్డకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.