Transport Department: పదేళ్లు... ఐదు ప్రమాదాలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:27 AM
తాజా బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో గత 10 ఏళ్లలో జరిగిన ప్రమాదాల్లో దగ్ధమైన స్లీపర్ బస్సుల ఘటనలను పరిశీలిస్తే...
81 మంది సజీవ దహనం
అమరావతి, అక్టోబరు 25: తాజా బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో గత 10 ఏళ్లలో జరిగిన ప్రమాదాల్లో దగ్ధమైన స్లీపర్ బస్సుల ఘటనలను పరిశీలిస్తే... అన్ని ప్రమాదాలూ తెల్లవారుజామునే జరిగాయి. కర్నూలు సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనతో సహా మొత్తం ఐదు ప్రమాదాలు జరగ్గా... 81 మంది దుర్మరణం పాలయ్యారు. 2016, జూలై 27న కర్ణాటకలోని హుబ్లీ సమీపంలో నాన్ ఏసీ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు వెనుక భాగం నుంచి మంటలు చెలరేగాయి. బస్సులో 18 మంది ఉండగా ముగ్గురు మరణించారు. 2022, అక్టోబరు 8న మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ముంబయికి చెందిన ప్రైవేటు స్లీపర్ బస్సు ప్రమాదానికి గురయింది. ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టి మంటల్లో దగ్ధమైన ఘటనలో 12 మంది దుర్మరణం పాలవ్వగా 43 మంది గాయపడ్డారు. 2023, జూలై 1న మహారాష్ట్రలోనే మరో ప్రమాదం జరిగింది. నాగపూర్-పూనే మధ్య నడిచే ఈ బస్సు ఎక్స్‌ప్రెస్ హైవేలో బుల్ధానా జిల్లాలో అగ్నికి ఆహుతయింది. ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 25 మంది చనిపోగా ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబరు మొదటి వారంలో రాజస్థాన్‌లో మరో స్లీపర్ బస్సు దగ్ధమైంది. సామర్థ్యాన్ని మంచి 57 మందితో జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ఈ ఏసీ స్లీపర్ బస్సు థయీయాత్ వద్ద ప్రమాదానికి గురయింది. 20 మంది సజీవ దహనయ్యారు.
రోడ్డు భద్రత సమావేశాలేవీ?
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ఏటా 8 వేలమందికి పైగా మరణిస్తున్నా పాలకులు, అధికారులకు పట్టడం లేదు. కొన్నేళ్లుగా రోడ్డు భద్రత సమావేశాలు కూడా జరగట్లేదు. ప్రతి ఆర్నెళ్లకు తప్పనిసరిగా జరగాల్సిన సమావేశాలు ఒక్కటి కూడా జరగలేదు. రవాణా శాఖ మంత్రి, రవాణా శాఖ కమిషనర్ ఉమ్మడిగా కలిసి సమావేశాలు నిర్వహించలేదు.