Kasibugga Temple Tragedy: అయ్యో... దేవుడా
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:07 AM
పుణ్యం కోసం దైవ దర్శనానికి వెళ్లిన వారిని మృత్యువు పలకరించింది. తొక్కిసలాట రూపంలో మరణం వెంటాడింది. తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా...
గుడిలో తొక్కిసలాట.. 9 మంది దుర్మరణం
దైవ దర్శనంలో పెను విషాదం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ప్రైవేటు ఆలయం
కార్తీక శనివారం రోజు పోటెత్తిన భక్తులు
మొదటి అంతస్తులో గర్భగుడి
వచ్చిపోయేందుకు ఒకటే మెట్లదారి
పరిస్థితి అదుపు తప్పి తోపులాట
రెయిలింగ్ ఊడిపోవడంతో కింద పడిన జనం
వారిని తొక్కుకుంటూ వెళ్లిన మరికొందరు
వలంటీర్లు లేరు, నియంత్రణా లేదు
పోలీసు బందోబస్తూ కోరలేదు
మృతుల్లో ఎనిమిది మంది మహిళలే
కాశీబుగ్గకు హుటాహుటిన లోకేశ్, రామ్మోహన్ నాయుడు
విచారణ జరిపిస్తామని ప్రభుత్వ ప్రకటన
సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి
రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల విచారం
పవిత్రమైన కార్తీక మాసం... అందులోనూ శనివారం... వెంకన్నను దర్శించుకుంటే మంచిదనే ఒక నమ్మకం! తండోపతండాలుగా జనం తరలి వచ్చారు! నియంత్రించే వారు లేరు! స్వీయ నియంత్రణా లేదు! ఫలితం... పెను విషాదం! తొక్కిసలాటలో తొమ్మిది నిండు ప్రాణాలు బలి! వీరిలో ఎనిమిది మంది మహిళలే! శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోరమిది!
శ్రీకాకుళం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పుణ్యం కోసం దైవ దర్శనానికి వెళ్లిన వారిని మృత్యువు పలకరించింది. తొక్కిసలాట రూపంలో మరణం వెంటాడింది. తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా... మరో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 8 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. మరణించిన వారంతా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. పలాస నియోజకవర్గంలో కాశీబుగ్గలోని శ్రీనివాసనగర్‌లో హరి ముకుంద పండా అనే వ్యక్తి సొంతంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఏడాదిన్నర క్రితం నిర్మించారు. స్థానికులు ఈ ఆలయాన్ని ‘చిన్న తిరుపతి’గా పిలుస్తారు. ప్రైవేటు నిర్వహణలో ఉన్న ఈ గుడికి ప్రతి శనివారం, సోమవారం 2వేల నుంచి 5వేల మంది భక్తులు వస్తుంటారు. కార్తీక మాసం కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బస్సులు, ఆటోలు, కార్లలో 25వేల మంది దాకా తరలి వచ్చారు. ఇంత రద్దీని ఊహించని ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదు. వలంటీర్లను నియమించుకోలేదు. పోలీసులు, అధికారులూ దృష్టి సారించలేదు. ఇదే పెను విషాదానికి కారణమైంది.
పది నిమిషాల్లోనే..
పెద్దసంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర రద్దీ నెలకొంది. 10 నుంచి 12 మెట్లు ఎక్కి మొదటి అంతస్తులోకి వెళితే గర్భగుడి వస్తుంది. పైకి వెళ్లేందుకు... దర్శనం తర్వాత కిందికి వచ్చేందుకు ఇదే మార్గం! ‘క్యూ’ కోసం మధ్యలో స్టీల్ బారికేడ్ పెట్టారు. మధ్యాహ్నం 12.05 గంటల సమయంలో ఈ మెట్ల మార్గంలోనే తొక్కిసలాట మొదలైంది. దర్శనం చేసుకుని వచ్చే వరుసలోకి... ఇటువైపు నుంచి జనాలు చొచ్చుకుపోయారు. దీంతో... పరిస్థితి అదుపు తప్పి, తోపులాట మొదలైంది. క్యూలో ఉన్న వారు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. బయటపడే ప్రయత్నంలో తోపులాట మరింత పెరిగింది. కొందరి కాళ్లు స్టీల్ బారికేడ్లలో ఇరుక్కుపోవడంతో గట్టిగా కేకలు వేస్తూ, రోదించారు. దీంతో ఏదో జరుగుతోందని భావించి బయటికి వచ్చేందుకు బలంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టీల్ రెయిలింగ్ విరిగిపోయింది. జనం ఒకరిపై ఒకరు పడిపోయారు. కిందపడిన వారిని తొక్కుకుంటూ చాలామంది బయటికి వచ్చారు. అంతా తీవ్ర గందరగోళం, కేకలు, అరుపులు! ఏం జరిగిందో తెలుసుకునేలోపే.. నిండుప్రాణాలు బలైపోయాయి. ఇదంతా 10నిమిషాల్లోనే జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘వెనుక నుంచి ఒక్క ఉదుటన నెట్టినట్లయింది. వెనుదిరిగి చూసుకునేలోపే కిందపడిపోయాం. కళ్ల ఎదుటే చాలామంది చనిపోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు పలాస, టెక్కలి, మందసలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న బాకి కళావతి (50), దువ్వు కుమారి(25)లను శ్రీకాకుళం మండలం జెమ్స్ ఆసుపత్రి ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శనివారం సుమారు 25వేల మంది భక్తులు రాగా.. వారిలో అత్యధికులు మహిళలే. పూర్తిగా ప్రైవేటు ఆలయం కావడంతో అధికార యంత్రాంగం ముందస్తుగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బందోబస్తు కోసం ఆలయ నిర్వాహకుల నుంచీ ఎలాంటి అభ్యర్థనా అందలేదు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు లేవు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పరామర్శించిన మంత్రులు
ఘటన గురించి తెలియగానే మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులతో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పలాసలో ఆసుపత్రి వద్ద రోదిస్తున్న మృతుల బంధువులను ఓదార్చారు. దేవాలయాన్ని నిర్మించిన ప్రైవేటు ట్రస్టు యజమాని హరిముకుంద పండాతో మాట్లాడారు. దేవాలయంలో వేలాది మంది భక్తులు వస్తుంటే రక్షణ పెట్టుకోకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. మంత్రి లోకేశ్ అమరావతి నుంచి హుటాహుటిన కాశీబుగ్గ చేరుకున్నారు. హోంమంత్రి అనిత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి పరిస్థితి సమీక్షించారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడికి చేరుకున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రులు పరిశీలించారు. ఆలయం పూర్తిగా ప్రైవేటుకు చెందినదని.. ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ నియమించి విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. డీఐజీ గోపీనాథ్ జట్టి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి తదితర అధికారులూ లోకేశ్ వెంట ఉన్నారు.
విషాదం... తీవ్రమైన విషయం: చంద్రబాబు
కాశీబుగ్గలో ఆలయంలో తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ప్రభుత్వం చాలా సీరియ్‌సగా తీసుకుంటుందని వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ అంశా న్నిప్రస్తావించారు. ‘‘కాశీబుగ్గలో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు. కార్తీకమాసం సందర్భంగా చాలా మంది దర్శనానికి వెళా ్లరు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే బందోబస్తు పెట్టేవాళ్లం. తొక్కిసలాటలో అమాయకులు చనిపోయారు. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశిస్తున్నా. ఇ లాంటి ఘటనలు రాష్ట్రంలో జరగడానికి వీలులేదు. తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని తెలిపారు.